భద్రాద్రిలో జోరు వాన..

భద్రాద్రిలో జోరు వాన..– లోతట్టు ప్రాంతాలు జలమయం
– ఇరిగేషన్‌ అధికారుల వైఫల్యానికి బలైన రామాలయ ప్రాంత వ్యాపార వర్గాలు
– జలదిగ్బంధంలో కొత్త కాలనీలోని 75 కుటుంబాలు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
ఏకధాటిగా కురిసిన జోరువానతో భద్రాచలం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు రామాలయ దేవస్థాన పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. దాంతో వ్యాపారులకు తీవ్ర నష్టం జరిగింది. కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీనికి ఇరిగేషన్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి భద్రాచలం ఏజెన్సీ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం వరకు గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహించిన విషయం తెలిసిందే. అనంతరం గోదావరి ప్రవాహం తగ్గడంతో స్లూయిజ్‌ల వద్ద ఏర్పాటు చేసిన మోటర్లు తొలగించారు. బుధవారం కురిసిన వర్షంతో 23 ప్రాంతాల్లో ఇటు రెవెన్యూ అధికారులు గానీ, ఇరిగేషన్‌ అధికారులు గానీ పర్యటించకపోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనలతో ఆర్తనాదాలు చేశారు. అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో పాటు లాకుల వద్ద అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చప్టా దిగువ రెడ్డి సత్రం వద్ద ఉన్న స్లూయిజ్‌, కొత్త కాలనీ, కరకట్ట వద్ద ఉన్న స్లూయిజ్‌ల వద్ద మోటార్లు లేక ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వర్షపు నీటితో ఆయా ప్రాంతాలు జలమయమయ్యాయి. పునరావాస కేంద్రాల నుంచి సోమవారమే కొత్త కాలనీకి చెందిన 75 కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. బుధవారం కురిసిన భారీ వర్షానికి మరోసారి ఆ ప్రాంతం నీటిలో మునిగింది. ఇప్పటికే సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న కాలనీవాసులపై మరోసారి వర్షం ప్రతాపంతో మరింతగా చితికిపోయారు. అంతేకాక, రాజుపేట, జగదీష్‌ కాలనీ, ఏఎస్‌ఆర్‌ కాలనీల్లోని ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని కేకే ఫంక్షన్‌ ఎదురుగా డ్రయినేజీ కాలువలో ప్లాస్టిక్‌ బాటిల్స్‌ సేకరించడానికి వెళ్లిన ఓ వ్యక్తి కాలు జారిపడి గల్లంతయ్యాడు.
రామాలయ పరిసర ప్రాంతాలకు వరద
రామాలయ పరిసర ప్రాంతాల్లో ఊహించని వరదతో విస్తా కాంప్లెక్స్‌ వద్ద ఉన్న బొమ్మల దుకాణాల్లోకి వర్షపు నీరు చేరి లక్షల రూపాయల సరుకు నీటిపాలైంది. విషయం తెలుసుకున్న ఆర్డీఓ దామోదర్‌ హుటాహుటిన స్లూయిజ్‌ల వద్దకు వెళ్లి ఇరిగేషన్‌ అధికారులతో మాట్లాడి దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రభుత్వం వెంటనే విస్తా కాంప్లెక్స్‌ వద్ద ఉన్న వ్యాపారస్తులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రామాలయ నిత్యాన్నదాన సత్రం లోకి వరద నీరు భారీగా చేరడంతో యాత్రికులు సైతం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రామాలయం పక్కనున్న కొండపై ఉన్న శ్రీ కుసుమ హరినాధ బాబా ఆలయంలోని కళ్యాణ మండపం భారీ వర్షంతో కుంగిపోయింది. ఆలయం కింద కొండను కొంతకాలంగా కొందరు తవ్వుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యం లో హరినాధ బాబా ఆలయం కింద కొండ ఖాళీ అవటంతో కళ్యాణమండపం కుంగిపోతోంది. కళ్యాణ మండపం కింద పడిపోతే ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఓపెన్‌ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం ఓపెన్‌ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. చండ్రుగొండలో పాఠశాల గదుల్లోకి వర్షపు నీరు చేరింది. ఆళ్లపల్లి మండలం రాయిగూడెం గ్రామం వెళ్లే కిన్నెరసాని వాగుపై ఉన్న గ్రావెల్‌ కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అశ్వారావుపేట నుంచి వాగొడ్డుగూడెం రహదారిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సత్తుపల్లి మండలం గంగారం నుంచి రామానగరం వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.

Spread the love