నవతెలంగాణ – చెన్నై: తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగపట్నంలో ఏకంగా 16.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. కడలూరు, కోయంబత్తూరు, తంజావూరు, కాంచీపురం, దిండిగల్, విల్లుపురం, మైలాడుతురై, నాగపట్నం, వెల్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, తిరువారూర్, కళ్లకురిచ్చి, చెంగల్‌పట్టు, కన్యాకుమారి సహా 18 జిల్లాలో ఆదివారం భారీ వర్షపాతం నమోదయింది. దీంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఇక రాష్ట్ర రాజధాని చెన్నైలో రోడ్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగపట్టిణం, కిల్వేలూర్ తాళూకా, కుడ్డలూర్, విల్లుపురం, కళ్లకురిచి, రాణిపేట్, వెల్లోర్, తిరువణ్ణమళైలో అధికారులు స్కూళ్లు, కాలేజీకు సెలవు ప్రకటించారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో పాటు ఈశాన్య గాలుల ప్రభావం తమిళనాడులో కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. మైచాంగ్ తుఫాను అంత తీవ్రంగా ఇప్పుడు ఉండదని, అయితే తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.