ఏపీలో 5 రోజుల పాటు భారీ వర్షాలు..

నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్. ఏపీలో మరో 5 రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం శుక్రవారం తుఫానుగా బలపడింది. శుక్రవారం రాత్రి బంగ్లాదేశ్ తీరంలో కేపుపరాకు సమీపంలో తుఫాన్ తీరం దాటిందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారానికి ఈ తుఫాన్ బలహీన పడుతుందన్నారు. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు. దక్షిణ అండమాన్ వద్ద సముద్రంలో మరో ఊపరితల ఆవర్తనం కొనసాగుతుండగా వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏపీలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది వాతావరణశాఖ.

Spread the love