బెంగళూరులో వాన బీభత్సంపలుచోట్ల ఈదురుగాలులతో కుంభవృష్ట

 జలదిగ్బంధనంతో జనం విలవిల
 కృష్ణా జిల్లాకు చెందిన మహిళ మృతి
బెంగళూరు : కర్నాటక రాజధాని నగరమైన బెంగళూరు ఆదివారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి అతలాకుతలమైంది. గాలి, వాన బీభత్సం సృష్టించాయి. కొన్ని ప్రాంతాల్లోనూ వండగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తింది. రహదారులు ఈతకొలన్లను తలపించాయి. జలదిగ్బంధనంతో ప్రజలు విలవిల్లాడిపోయారు. వర్షానికి తోడు భారీగా ఈదురుగాలులు వీయడంతో పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. సదాశివనగర్‌, కెఆర్‌ అండర్‌పాస్‌, కుమారకృప రోడ్డు, చిత్రకళా పరిషత్‌ వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు ముంచెత్తడంతో రాకపోకలపై ఆంక్షలు విధించారు.
విహారయాత్రకు వెళ్లి..విగతజీవిగా..
కెఆర్‌ సర్కిల్‌ వద్ద ఉన్న అండర్‌పాస్‌లో వర్షపు నీటిలో ఒక కారు చిక్కుకుపోవడంతో కృష్ణా జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ భానురేఖ (22) చనిపోయారు. ఈ ఘటన జరిగినప్పుడు కారులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నారు. కొత్తవారు కావడంతో రోడ్డు మీద వాస్తవిక నీటి లోతును గుర్తించకుండా కారును ముందుకు పోనియ్యడంతో అండర్‌పాస్‌లో కొత్తదూరం వెళ్లాక వాహనం మునిగిపోయింది. కారులో ఉన్నవారంతా అతికష్టం మీదకు బయటకు వచ్చినా..అప్పటికే వరద నీరు ఉధృతి పెరగడంతో చిక్కుకుపోయారు. ‘రక్షించండి’ అంటూ హాహాకారాలు చేశారు. స్థానిక ప్రజలు చీరలు, తాళ్లు వంటివి అందించినా

వాటి ద్వారా పైకి రాలేక విలవిల్లాడిపోయారు. అగ్నిమాపక సిబ్బంది నిచ్చెన వేసి, గజ ఈతగాళ్ల సహాయంతో ఐదుగురిని రక్షించగలిగారు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన భానురేఖ (22)ను ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. విహారయాత్రకు వెళ్లి..విగతజీవిగా మిగిలిన భానురేఖ మృతదేహాన్ని చూసినవారంతా తల్లడిల్లిపోయారు. బాధితులంతా ఏపికి చెందినవారిగా గుర్తించారు. భానురేఖ చికిత్స పొందిన ఆస్పత్రిని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సందర్శించి మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. అకాల వర్షాలపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. అత్యవసర బలగాలను రంగంలోకి దించి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆదేశించారు.

Spread the love