– పెద్దవాగు ప్రాజెక్ట్ గేట్లన్నీ ఎత్తివేత
– గోదారమ్మ పరవళ్లు
– తెరుచుకున్న తాలిపేరు, కిన్నెరసాని గేట్లు
– అశ్వారావుపేటలో అత్యధిక వర్షపాతం
– లోతట్టు ప్రాంతాలు జలమయం
– ప్రవాహంలో చిక్కుకున్న నారాయణపురం రైతులు, కూలీలు
– హెలికాప్టర్ సహాయంతో కాపాడిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండ్రోజులుగా ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి కూడా వరద వస్తుండటంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పెద్దవాగు, తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తేశారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెద్దవాగు ప్రవాహంలో రైతులు, కూలీలు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ సహాయంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం వారిని కాపాడింది. దమ్మపేట మండలంలో పిడుగు పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజకవర్గం కేంద్రంలో గురువారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం వరకు 109.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఇదే అత్యధిక వర్షపాతం. జిల్లా వ్యాప్తంగా 566 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. దమ్మపేటలో 86, చండ్రుగొండలో 28 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్ట్ సామర్థ్యానికి మించి వరద చేరడంతో ఉన్న మూడు గేట్లు ఎత్తారు. అయినా కట్ట పై నుంచి వరద ప్రవహిస్తోంది. ఈ ప్రాజెక్ట్ సామర్థ్యం 40 వేల క్యూసెక్కులకుగాను 60 వేల క్యూసెక్కుల నీరు చేరింది. నారాయణపురం – బచ్చువారిగూడెం మధ్యలో గల పెద్దవాగుకు భారీగా వరద నీరు చేరడంతో పొలాలకు వెళ్లిన రైతులు, కూలీలు ప్రవాహంలో చిక్కుకుపోయారు. పలు వాహనాలు కూడా వరదలో చిక్కుకున్నాయి. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రభుత్వాన్ని సంప్రదించి హెలిక్యాప్టర్ సహాయంతో వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేపట్టారు. తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, సీఐ కరుణాకర్, ఐబీ ఈఈ సురేష్ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడూ అంచనా వేస్తున్నారు. అశ్వారావుపేట పట్టణంలో సైతం లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపిలేని వర్షంతో జనజీవనం స్తంభించింది. నారంవారిగూడెం- గుర్రాల చెరువు మధ్య రహదారి వరదకు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అశ్వారావుపేట, బూర్గంపాడు మధ్య ఉన్న రహదారిపై నుంచి వరద ప్రవహిస్తోంది.
భద్రాచలం ఏజెన్సీ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బుధవారం అర్ధరాత్రి ప్రారంభమైన వర్షం గురువారం రోజంతా కురవడంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతం జనావాసాల్లోకి వర్షపు నీరు చేరింది. ప్రధానంగా పట్టణంలోని రాజుపేట, ఎంపీ కాలనీ, జగదీష్ కాలనీ శివారు ప్రాంతాల్లో ఇండ్లల్లోకి నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాసరావుని సంఘటనా స్థలానికి పిలిపించి యుద్ధ ప్రాతిపదికన జేసీబీ ద్వారా పూడికలు తీయించి తాత్కాలిక ఉపశమనం కల్పించారు.
తాలిపేరు నాలుగు గేట్లు ఎత్తివేత
తాలిపేరు ప్రాజెక్టు సైతం జలకళ సంతరించుకోవడంతో ఇప్పటికే నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా వాగులూ వంకలు పొంగిపొర్లుతుండగా ప్రజలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
కిన్నెరసాని మూడు గేట్లు..
వరంగల్ జిల్లా పాకల నుంచి పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మొత్తం 14 గేట్లలో మూడింటిని ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జలదిగ్బంధంలో దమ్మపేట
దమ్మపేట మండలంలోని కొడిసలగూడెం, ఆర్లపెంట, జగ్గారం, అంకంపాలెం, సుధాపల్లి, నాగుపల్లి బంజరు, లింగాలపల్లి, నాచారం, నాయుడుపేట, మొద్దులగూడెం, ముష్టిబండ, గాంధీ నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధానంగా మందలపల్లి, దమ్మపేట పట్టణాల పరిస్థితి దారుణంగా ఉంది. మందలపల్లి అంబేద్కర్ కాలనీ పూర్తిగా జలమయమైంది. ఇండ్లల్లో సామాన్లు నీటిలో తేలియాడుతున్నాయి. పాల్వంచ-దమ్మపేట ప్రధాన రహదారి జలదిగ్బంధంలో చిక్కుకుంది.
గోదారమ్మ పరవళ్లు
వారం రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా దండకారణ్యంలో విస్తారంగా పడుతున్న వర్షాల ప్రభావంతో భద్రాచలం వద్ద గోదారమ్మ పరవళ్ళు తొక్కుతోంది. గురువారం సాయంత్రం 6 గంటల వరకు 18.2 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం రెండ్రోజులపాటు పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యుసీ అధికారులు తెలిపారు. గోదావరి ప్రవాహం అధికంగా ఉన్న నేపథ్యంలో రామయ్య దర్శనానికి వచ్చే యాత్రికులు సైతం స్నానాల కోసం నదిలోకి దిగొద్దని రెవెన్యూ అధికారులు సూచించారు.
పిడుగుపాటుకు గిరిజన బిడ్డలు బలి
దమ్మపేట మండలంలో జమేదార్ బంజర్ గ్రామ సమీపంలోని పుల్లయ్య చెరువు వద్ద ఉన్న పొలానికి తల్లిదండ్రులు బొర్రా మల్లేష్, నాగమణితో కలిసి వారి కుమారులు చందు(12), సిద్దు(15) వెళ్లారు. అక్కడ చిన్నారుల సమీపంలో పిడుగుపడటంతో ఇరువురు అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో బంజర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.