రేవంత్‌రెడ్డి నివాసం వద్ద భారీ భద్రతా..

నవతెలంగాణ – హైదరాబాద్‌: రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేతగా అధిష్ఠానం ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి చాలా ఏళ్లుగా జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 44లో నివాసముంటున్నారు. ప్రస్తుతానికి అక్కడే ఉండాలని ఆయన యోచిస్తున్నట్లు తెలిసింది. సమీపంలోని 44ఎ రోడ్డులోనే రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకున్నారు. అక్కడే కొన్ని రోజులు ప్రజా దర్బార్‌ నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని పోలీసులకు సూచనప్రాయ సమాచారం అందింది. అందుకు అనుగుణంగా మంగళవారం రాత్రి పోలీసులు బందోబస్తు, ఇతర ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్‌ ఏసీపీ హరిప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర ప్రస్తుతం భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ‘కాబోయే సీఎం నివాసానికి తరలివచ్చే కార్యకర్తలు, అభిమానులను అదుపు చేసేందుకు ప్రస్తుతం సివిల్‌ పోలీసుల్ని ఉపయోగిస్తాం. తర్వాత దశలో ఏఆర్‌ సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొంటాయి. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ పోలీసుల ఆధ్వర్యంలో రెండు ప్లటూన్ల బలగాలను విధుల్లో ఉంచాం. బుధవారం నుంచి వారికి అదనంగా సాయుధ సిబ్బంది, స్థానిక పోలీసులు అంచెలంచెలుగా విధుల్లో ఉంటారు’ అని పోలీసు అధికారులు తెలిపారు.

Spread the love