శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై భారీగా గంజాయి పట్టివేత

శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై భారీగా గంజాయి పట్టివేత– ట్రక్కులో తరలిస్తుండగా.. పట్టుకున్న సైబరాబాద్‌ పోలీసులు
– పట్టుబడిన గంజాయి విలువ దాదాపు రూ.3 కోట్లు : సైబరాబాద్‌ ఎస్‌ఓటీ డీసీపీ శ్రీనివాస్‌
నవతెలంగాణ-మియాపూర్‌
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై భారీగా గంజాయి పట్టుబడింది. బాలానగర్‌, శంషాబాద్‌ ఎస్‌ఓటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించగా.. ట్రక్కులో తరలిస్తున్న 803 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ సీపీ కార్యాలయంలో సైబరాబాద్‌ ఎస్‌ఓటీ డీసీపీ శ్రీనివాస్‌ ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌ మీదుగా తెలంగాణ నుంచి మహారాష్ట్ర, కర్నాటకకు గంజaాయిని తరలిస్తున్నారు. నిందితులు డీసీఎం ఏర్పాటు చేసుకుని దానిలో మొదటి వరుసలో కెమికల్‌ డ్రమ్స్‌ పెట్టి, వెనుక వైపు గంజాయి పెట్టుకొని సరఫరా చేస్తున్నారు. ఇలా డీసీఎంలో గంజాయి తీసుకొచ్చినందుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు డబ్బులు వసూలు చేస్తారు.
డీసీఎంలో తీసుకొచ్చిన గంజాయిని పటాన్‌చెరులోని ఒక నిర్మాణష్య ప్రాంతంలో ఉంచి, మహారాష్ట్ర, కర్నాటకకు పంపించే ఏర్పాటు చేసుకున్నారు. ఆ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్‌, శంషాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకోవడం ఇదే మొదటి సారి.
ఐదుగురిపై కేసు నమోదు చేసి వారిని విచారిస్తున్నారు. ఈ కేసులో మొత్తం ఏడుగురి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు రాము, సోమనాథ్‌ కట్టర్‌, సురేష్‌ మారుతి పటేల్‌, విటల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రధాన నిందితుడు రాము పరారీలో ఉన్నాడు. ఈ ఆపరేషన్‌లో బాలానగర్‌ ఎస్‌ఓటీ సీఐ శివ, ఎస్‌ఐ రవి కిరణ్‌, సిబ్బంది పాల్గొనగా.. వారిని సైబరాబాద్‌ సీపీ అభినందించినట్టు డీసీపీ తెలిపారు.

Spread the love