హ‌లో.. హ‌లో.. మేం సైబ‌ర్ క్రైం బ్రాంచ్

హ‌లో.. హ‌లో.. మేం సైబ‌ర్ క్రైం బ్రాంచ్– సరికొత్త పంథాలో సైబర్‌ నేరాలు
– టెలిఫోన్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి అంటూ కాల్స్‌
– ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌లో కేసు నమోదైందంటూ బెదిరింపు
– వృద్ధుని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ నుంచి రూ.15.86లక్షలు ట్రాన్స్‌ఫర్‌
– స్టాక్‌ మార్కెట్‌ పేరుతో మరో వ్యక్తి నుంచి రూ.34,9000
నవతెలంగాణ-సిటీబ్యూరో
సైబర్‌ నేరస్తులు రోజుకో తీరులో రెచ్చిపోతున్నారు. కొత్తకొత్త ఆలోచనలతో అందినకాడికి దండుకుంటున్నారు. తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన ఓ (రిటైర్డ్‌ ఉద్యోగి) 80ఏండ్ల వృద్ధుడికి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరస్థులు తాము టెలిఫోన్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. వృద్ధుడి పేరుపై రెండు ఫోన్లు రిజిస్టిర్‌ అయ్యాయని, మరో ఫోన్‌ మనీల్యాండరింగ్‌లో నేరస్థులు ఉపయోగిస్తున్నారని బెదిరించారు. ఆందోళనకు గురైన బాధితుడు లేదు సార్‌ ఒక్కటే ఉందని సమాధానం ఇచ్చేలోపే.. లేదు నీపై ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌లో ఎఫ్‌ఐఆర్‌ ‘ఎంహెచ్‌045/ ఇ524’ నమోదైందని వెంటనే అందేరీ క్రైమ్‌ బ్రాంచ్‌ ఎస్‌హెచ్‌వోను సంప్రదించాలంటూ ఫోన్‌ కట్‌ చేశారు. ఆ తర్వాత మరో సైబర్‌ నేరస్థుడు బాధితునితో ఫోన్‌లో మాట్లాడుతూ.. ‘మీ ఫోన్‌ రాజ్‌ కుంద్రా అనే నేరస్థుడు ఉపయోగిస్తున్నాడు.. వందల కోట్లు కొల్లగొట్టాడు.. ఆ కేసులో నీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది” అని బెదిరించాడు. తాము చెప్పినట్టు చేయ్యాలి లేదా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తాం.. ఇక ఆలోచించుకో అంటూ ఫోన్‌ పెట్టేశాడు. మరుసటి రోజు ఉదయం వృద్ధునికి వీడియోకాల్‌ చేసిన మరో వ్యక్తి తాను సీబీఐ అధికారినంటూ పోలీస్‌ డ్రెస్‌లోనే మాట్లాడాడు. నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదైంది.. వివరాలు చెప్పాలంటూ కటువుగా మాట్లాడాడు. సైబర్‌ నేరస్థుడు మాట్లాడుతున్న రూంలో నకిలీ సీబీఐ ఎంబ్లమ్స్‌, గుర్తింపు కార్డులు, పోస్టర్లను గమనించిన బాధితుడు భయాందోళనకు గురయ్యాడు. భయపడుతున్న అతన్ని గమనించిన సైబర్‌ నేరస్థులు ఎవరికీ వివరాలు చెప్పకుండా ఓ రూంలోకి వచ్చి మాట్లాడాలంటూ ఆదేశించారు. అలా దాదాపు రెండు గంటలపాటు విచారణ పేరుతో వీడియోకాల్‌ మాట్లాడిన సైబర్‌ నేరస్థులు బాధితుని ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్‌ ఖాతాల వివరాలు సేకరించారు. బ్యాంక్‌ ఖాతాలో డబ్బులు ఉంచడం అంత మంచిది కాదని, వాటిని సీబీఐ సీజ్‌ చేస్తుందని, విచారణలో భాగంగా వాటిని వివిధ బ్యాంక్‌లకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తే, అనంతరం రెండు మూడ్రోజుల్లో తిరిగి ట్రాన్స్‌ఫర్‌ చేస్తామని లేకపోతే నీవు ఇబ్బందుల్లో పడ్తావని హెచ్చరించారు. వారి మాటలను పూర్తిగా నమ్మిన వృద్ధుడు సేవింగ్‌ బ్యాంక్‌తోపాటు రిటైర్‌మెంట్‌ ద్వారా వచ్చిన డబ్బులను ఫిక్స్‌ చేసిన ఖాతాల నుంచి సైతం డబ్బులు తీసి రూ.15,86,000ను నిందితులకు ‘ఆర్‌టీజీఎస్‌’ చేశాడు. ఆ తర్వాత రెండు రోజులైనా వారి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్టు గుర్తించిన వృద్ధుడు హైదరాబాద్‌(సీసీఎస్‌) సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
లోన్‌ పెట్టించి మరీ.. రూ.34.90లక్షలు స్వాహా
తాము చెప్పిన విధంగా స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలొస్తాయని నమ్మించిన సైబర్‌ నేరస్థులు నగరానికి చెందిన ఓ ప్రయివేటు సంస్థలో పనిచేస్తున్న ఓ వ్యక్తి నుంచి రూ.34,9000ను ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారు. వాట్సాప్‌ కాల్‌లో మాట్లాడిన సైబర్‌ నేరస్థులు మాయమాటలతో బాధితున్ని నమ్మించారు. ‘657 ఐ సెక్షన్‌ గ్రూప్‌’ పేరుతో ఉన్న వాట్సాప్‌ గ్రూప్‌లో యాడ్‌ చేశారు. అందులో (నకిలీ పేర్లతో) 140 మంది సభ్యులుగా ఉన్నారు. సదరు వ్యక్తులు పంపించిన అప్లికేషన్స్‌ను డౌన్‌లోడ్‌ చేశాడు. అందులో లాభాలొచ్చినట్టు నమ్మించారు. అనంతరం 15రోజుల్లోనే పెట్టుబడి రూపంలో లక్షలు దండుకున్నారు. సీన్‌లో మాత్రం లాభాలొచ్చినట్టు చూపించారు. వాటిని తీసుకోవాలంటే మరిన్ని డబ్బులు ఇన్వెస్ట్‌ చేయాలని నమ్మించారు. డబ్బులు లేవని చెప్పడంతో బాధితుని బ్యాంక్‌ ఖాతాలు, బజాజ్‌ క్యాపిటల్‌ నుంచి ఓడీపై లోన్స్‌ ఇప్పించి మరీ వివిధ ఖాతాల్లో ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారు. వివిధ కారణాలతో రూ.34,90,000ను దండుకున్న నేరస్థులు బాధితుడు తిరిగి డబ్బులు ఇవ్వాలని కోరడంతో అప్పటి నుంచి స్పందించడం మానేశారు. తీరా మోసపోయినట్టు గుర్తించిన బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఇలా రోజుకో రకంగా సైబర్‌ నేరస్థులు ప్రజలను మోసగిస్తున్నారు.
ఆర్థిక లావాదేవీల వివరాలు చెప్పొద్దు..: డీసీపీ
గుర్తు తెలియని వ్యక్తులకు ఆర్థిక లావాదేవీల వివరాలను చెప్పొద్దని డీసీపీ స్వేతా సూచించారు. ఫెడెక్స్‌ కొరియర్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, టీఆర్‌ఏఐ లేదా పోలీస్‌ అంటూ మాట్లాడితే ఎలాంటి నిర్ధారణ లేకుండా నమ్మొద్దన్నారు. బ్యాంక్‌, పోలీస్‌ అధికారులు లేదా ఏ ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న వారైనా బ్యాంక్‌ వివరాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను ఫోన్‌లో అడిగి తెలుసుకోరని చెప్పారు. గుర్తు తెలియని వీడియో కాల్స్‌కుగానీ లింక్స్‌కుగానీ స్పందించొద్దన్నారు. మోసపోయిన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అంతేకాకుండా 1930 ఆన్‌లైన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు చెప్పాలని అన్నారు.

Spread the love