– 5, 6 తేదీల్లో రాష్ట్రస్థాయి సమ్మేళనం
– ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రం వేదిక
– గిరిజన సంఘం వ్యవస్థాపకులు గుగులోత్ ధర్మా ప్రథమ వర్ధంతి సందర్భంగా గిరిజన సమ్మేళనం
– సమస్యలపై చర్చించనున్న గిరిజన సంఘాలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
పేదలు, గిరిజనుల హక్కులపై రోజురోజుకూ దాడి తీవ్రతరం అవుతోంది. గిరిజన సంస్కృతీ సాంప్రదాయాలు, నాగరికత హరించి వేయబడుతున్నాయి. గిరిజనులు అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన సంఘం వ్యవస్థాపకులు గుగులోత్ ధర్మా స్ఫూర్తితో ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం వేదికగా 5, 6 తేదీల్లో తెలంగాణ రాష్ట్రస్థాయి గిరిజన సమ్మేళనాన్ని టీజీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని గిరిజన ఉద్యమ నాయకులు, మేధావులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. వారి నుంచి విలువైన సూచనలు, సలహాలు తీసుకొని ఉద్యమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సమ్మేళనంలో కార్యచరణ రూపొందిస్తారు.
2011 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల ప్రకారం 59,18,073 మంది గిరిజనులు ఉన్నారు. తెలంగాణలో 32 తెగల గిరిజనులు ఉన్నారు. గిరిజన జనాభా 32.87 లక్షలు. రాష్ట్ర జనాభాలో 9.3శాతం మంది గిరిజనులే. అధికంగా లంబాడీలు 20,46,117 మంది, కోయ 4,86,391 మంది జనాభా ఉన్నారు. కాగా, శాతం పరంగా అత్యధికంగా గిరిజనులు ఉన్న ప్రాంతం ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 5 లక్షలకు పైగా గిరిజనులు జీవిస్తున్నారు. వీరు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆవిర్భవించింది. గతంలో భద్రాచలం కేంద్రంగా ఐటీడీఏ ఉంది. ఖమ్మం ప్రత్యేక జిల్లా అయినా ఇక్కడ ఐటీడీఏ ఏర్పాటు చేయట్లేదు. జిల్లాల విభజన తర్వాత ఐటీడీఏ ప్రాభావాన్ని కోల్పోయింది. ఖమ్మం జిల్లాలో గిరిజన సమస్యల పరిష్కారానికి కేంద్రం అంటూ లేకుండా పోయింది.
ఐటీడీఏ లేదు.. అనాథ పాఠశాలలుగా ఆశ్రమాలు..
ఐటీడీఏ లేకపోవడంతో ఖమ్మం జిల్లా.. భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాభావాన్ని కోల్పోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజనులు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఖమ్మం జిల్లాలో 20కి పైగా ఉన్న గిరిజన ఆశ్రమాలు అనాథ పాఠశాలలుగా మారాయి. పది గిరిజన వసతి గృహాలు సమస్యల లేమితో సతమతమవుతున్నాయి. వీటిలో ఐదువేలకు పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరిలో మూడు వేల మంది వరకు బాలికలే ఉన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో పర్మనెంట్ టీచర్లు లేరు. అంతా కాంట్రాక్టు ఉపాధ్యాయులతోనే విద్యాబోధన సాగుతోంది. మెనూ విధానంలో మార్పులు చేసినా సక్రమంగా అమలుకావడం లేదు. గిరిజన హాస్టల్స్, పాఠశాలల్లోని ఆర్‌ఓఆర్ ప్లాంట్స్ పనిచేయట్లేదు. వీటిని పునరుద్ధరించాల్సి ఉంది. అత్యధికంగా 70వేల మంది వరకు గిరిజన జనాభా ఉన్న కారేపల్లిలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని 50 పడకల ఆస్పత్రిగా మార్చాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కనీసం ఈ మండలానికి 108 వాహనం సైతం ఏర్పాటు చేయలేదు. ఇక్కడే కాదు గిరిజనులు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో విద్యా వైద్యం సక్రమంగా అందడం లేదు. ఏజెన్సీ మండలాలను ఐటీడీఏ చిన్నచూపు చూస్తోంది. జిల్లాలో కామేపల్లి, కారేపల్లి, ఏన్కూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలం, ఖమ్మంలో వైరా మొత్తం పదింట ఐదు ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నా వీటి బాగోగులను పట్టించుకునే పరిస్థితి లేదు.
విద్యా, ఉపాధి అవకాశాలూ అంతంతే..
విద్యా, ఉపాధి అవకాశాల కల్పన విషయంలోనూ నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీకి నోచుకోవట్లేదు. ప్రతి మండల కేంద్రంలో గిరిజన భవనం నిర్మించాలనే డిమాండ్ ఉన్నా పట్టించుకోవట్లేదు. ఖమ్మంలోని బంజార భవన్ నిర్మాణానికి రూ.5 కోట్లు ఇస్తామన్న హామీ.. హామీగానే మిగిలింది. గిరిజన పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి, ఇండ్ల నిర్మాణాలు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవట్లేదు. మరోవైపు గిరిజన సంప్రదాయాలపై బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడులు కొనసాగిస్తోంది. అనేక తెగల ఆచార వ్యవహారాలను నిర్వీర్యం చేసి హిందూ మతాన్ని చొప్పించే చర్యలు కొనసాగుతున్నాయని గిరిజన పెద్దలు వాపోతున్నారు. గిరిజన నిరుద్యోగులకు భృతి, ఉపాధి కల్పన చర్యలు లేకుండా పోయాయి. గిరిజన ఉపాధి కోసం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా ప్రభుత్వాలు పెడిచెవిన పెడుతున్నాయి. వెదురు పరిశ్రమ ఏర్పాటు కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. రాష్ట్రస్థాయి గిరిజన సమ్మేళనం ద్వారా సమస్యల పరిష్కారానికి ఎలా ముందుకు వెళ్లాలో గిరిజన సంఘాలు నిర్ణయానికి రానున్నాయి.
గుగులోత్ ధర్మా స్ఫూర్తితో..
పుచ్చలపల్లి సుందరయ్య, మంచికంటి కిషన్‌రావు, ఏలూరి లక్ష్మీనారాయణ, బోడేపూడి వెంకటేశ్వరరావు, కంగాల బుచ్చయ్య వంటి మార్క్సిస్టు నేతల ఆదర్శాలను పుణికి పుచ్చుకొని అగ్రనాయకుల సూచనతో 1994లో గుగులోత్ ధర్మా నేతృత్వంలో మైదాన ప్రాంత గిరిజన సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా ఏర్పాటైంది. అనతికాలంలోనే ఇది రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ఓసీ కోయగూడెం, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, వ్యవసాయ కార్మికుల కూలీ రేట్ల పెంపు, రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు తదితర ఉద్యమాల్లో గిరిజన సంఘం క్రియాశీలకంగా వ్యవహరించింది. 2006లో 65 రోజుల పాటు 1200 గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో ధర్మా పాదయాత్రలు నిర్వహించారు. అటవీహక్కుల గుర్తింపు చట్టం కోసం వామపక్షాలతో కలిసి గిరిజన సంఘం ఉద్యమాలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని, పోడు భూముల పోరాటంలో ధర్మా జైలుకు వెళ్లారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం, గిరిజన వ్యతిరేక విధానాలపై రాజకీయాలకు అతీతంగా ఐక్య ఉద్యమాలు నిర్వహించిన నేత గుగులోత్ ధర్మా. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ గిరిజన సమ్మేళనాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా గిరిజనులు తరలివచ్చి దీన్ని విజయవంతం చేయాలి. దీనిలో భాగంగా గిరిజన కళా ప్రదర్శనలు ఉంటాయి.
భూక్యా వీరభద్రం, ఆహ్వానసంఘం ప్రధాన కార్యదర్శి
పాడు భూములుగా పోడు భూములు..
పోడు సమస్యను సంపూర్ణంగా పరిష్కరించే చర్యలు లేవు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే మూడువేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో పదివేలకు పైగా దరఖాస్తులకు పరిష్కారం లభించలేదు. గిరిజన వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం లేదు. బోర్లు, మోటార్లు, కరెంట్ సౌకర్యం కల్పించట్లేదు. ఫారెస్టు అధికారులు ఇవేవీ రాకుండా అడ్డుపడుతున్నారు. హక్కు పత్రాలున్న ప్రతి రైతుకూ ఈ సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక గత ప్రభుత్వం గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించినా రెవెన్యూ హౌదా ఇవ్వలేదు. ఫలితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 500 గిరిజన పంచాయతీలు రెవెన్యూ హౌదా కోసం ఎదురుచూస్తున్నాయి. తండాల మౌలికాభి వృద్ధికి రూ.కోటి విడుదల చేస్తామన్న ప్రభుత్వాలు ఆ ఊసే మరిచాయి.