వృత్తికి చేయూత‌

ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్థికసాయం
– వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ..
– వివిధ శాఖల్లో సర్దుబాటు

– 111 జీవో పూర్తిగా ఎత్తివేత
– హిమాయత్‌సాగర్‌, గండిపేటకు కాళేశ్వరం నీళ్లు
– వ్యవసాయరంగంలో మార్పుల కోసం మంత్రివర్గ ఉపసంఘం
– జైన మతానికి మైనారిటీ గుర్తింపు
– మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కులవృత్తిదారులకు ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్థిక చేయూత ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి విధివిధానాల ఖరారు కోసం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే వీఆర్‌ఏల సర్వీసుల్ని క్రమబద్ధీకరించి, వారిని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో సర్దుబాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికోసం వీఆర్‌ఏ సంఘాలు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో చర్చించాలని సీసీఎల్‌ఏకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ రెండు నుంచి 21 రోజులపాటు జరపాలనీ, రాష్ట్ర సాధన తర్వాత సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరించేలా ఈ కార్యక్రమాలు ఉండాలనీ, ప్రభుత్వం నుంచి లబ్దిపొందిన వారిని ఈ ఉత్సవాల్లో భాగస్వాములు చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో తొలిసారి మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను మంత్రి హరీశ్‌రావు విలేకరుల సమావేశంలో తెలిపారు.
కాళేశ్వరం నీటితో హిమాయత్‌సాగర్‌, గండిపేట జలాశయాల అనుసంధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే హుస్సేన్‌సాగర్‌ను గోదావరి జలాలకు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. 111 జీవోను పూర్తిగా ఎత్తివేసేందుకు అమోదం ఆమోదం తెలిపారు. ఈ జీవో పరిధిలోని 84 గ్రామాల ప్రజలు అభివధ్ధికి దూరంగా ఉన్నామని ఎన్నో ఏండ్లుగా విజ్ఞప్తులు చేస్తున్నారనీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామాలకు వర్తించే విధి విధానాలు, నిబంధనలే ఇక్కడా అమల్లో ఉంటాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 డీఎంహెచ్‌ఓ పోస్టులు మంజూరుకు ఓకే చెప్పారు. కొత్తగా ఏర్పడిన 40మండలాలకు పీహెచ్‌సీలను మంజూరు చేశారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శాశ్వత ఉద్యోగుల నియామకానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. యాసంగి పంటను నెలరోజులు ముందుకు తెచ్చే అంశాన్ని పరిశీలించి, వ్యవసాయరంగంలో చేయాల్సిన మార్పు లపై అధ్యయనం చేసేందుకు ఆ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వనపర్తిలో జర్నలిస్టు భవన్‌ కోసం 10గుంటల భూమి ఇచ్చేందు కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే ఖమ్మం జిల్లాలో జర్నలిస్టు భవన్‌, ఇళ్ల స్థలాల కోసం 23 ఎకరాలు కేటాయింపునకూ ఆమోదం తెలిపారు. జైనులను మైనారిటీలుగా గుర్తించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆ వర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలో జైనులకు మైనారిటీ హౌదా ఇస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడున్న మైనారిటీ కమిషన్‌లో జైనుల ప్రతినిధిని కూడా సభ్యుడిగా చేర్చాలని నిర్ణయించారు. దీనితో ఈ కమిటీలో సభ్యుల సంఖ్య 9కి చేరుతుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)లో పాలనా సౌలభ్యం కోసం కొత్తగా పది పోస్టులు మంజూరు చేసేందుకు మంత్రివర్గం అంగీకరించింది. నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎక్కడైనా నకిలీల బెడద తలెత్తితే కచ్చితంగా పీడీ యాక్ట్‌ కింద కేసులు పెట్టి దోషుల్ని జైళ్లకు పంపాలని మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న డీజీపీ అంజన్‌కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించా రు. మక్కలు, జొన్నలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం తరుపున గ్యారెంటీ ఇచ్చేందుకు మంత్రివర్గ సమావేశం అంగీకరించింది. అచ్చంపేట ఉమా మహేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఫేస్‌ 1, ఫేస్‌ 2 మంజూరు కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెండో విడత గొర్రెల పంపిణీ 15 రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయించారు. సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, గంగుల కమలాకర్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, సీహెచ్‌ మల్లారెడ్డి పాల్గొన్నారు.
క్యాబినెట్‌ నిర్ణయాల పట్ల సీపీఐ(ఎం) హర్షం
రాష్ట్ర మంత్రి వర్గంలో తీసుకున్న సానుకూల నిర్ణయాల పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం, కులవృత్తుల బలోపేతం, తదితర అంశాలపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ సబ్‌కమిటీలకు వెంటనే విధివిధానాలను రూపొందించి, అధ్యయనం చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సుదీర్ఘకాలం పోరాడిన వీఆర్‌ఏలను రెగ్యులరైజ్‌ చేయడం, నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించడం, రెండో విడత గొర్రెల పంపిణీ, ప్రైమరీ హెల్త్‌ సెంటర్ల బలోపేతం, డీఎంహెచ్‌ఓ పోస్టుల మంజూరు, ఒకటి రెండు జిల్లాల్లో జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు వంటి నిర్ణయాలపై తమ్మినేని వీరభద్రం హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న పోడు భూముల పంపిణీ, పేదలకు ఇండ్ల స్థలాల కేటాయింపుపై మంత్రి మండలి వెంటనే నిర్ణయం తీసుకోవాలని సీపీఐ(ఎం) ప్రభుత్వాన్ని కోరింది.

Spread the love