వికలాంగులకు చేయూత మన సామాజిక బాధ్యత

– జనరల్‌ మేనేజర్‌ దుర్గం రామచందర్‌
నవతెలంగాణ-మణుగూరు
వికలాంగులకు చేయూత మనందరి బాధ్యత అని మణుగూరు ఏరియా జనరల్‌ మేనేజర్‌ దుర్గం రామచందర్‌ కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం సింగరేణి కాలరీస్‌ అధ్వర్యంలో పీవీ కాలనీ భద్రాద్రి స్టేడియం ఆవరణలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనరల్‌ మేనేజర్‌ దుర్గం రామచందర్‌ మాట్లాడుతూ అన్ని అవయవాలు సక్రమంగా వున్న మనుషులకు తీసిపోని విధంగా విధిరాత వల్ల అంగవైకల్యంతో పుట్టిన వికలాంగులు ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని జయిస్తూ వివిధ రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అలాంటి వారికి చేయూతనందించడం మనందరి సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్కరూ వారి ఉజ్జ్వల భవిష్యత్తుకు బాసటగా నిలవాలి అన్నారు. అందుకే సిఎస్‌ఆర్‌ నిధులతో అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపడ్తున్న సింగరేణి యాజమాన్యం స్థానికీ శ్రీ సత్యసాయి దివ్యాంగుల పాటశాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడంతో పాటు ఆ పాటశాల ఉపాధ్యాయులకు ప్రతి నెల సంస్థ ద్వారా గౌరవ వేతనాలు అందించడం జరుగుతుంది. అంతే కాక ప్రతి సంవత్సరం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తు స్థానిక దివ్యాంగులను ప్రోత్సహించేందుకుగాను వారికి క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించి వారికి జ్ఞాపికలు కూడా ఇవ్వడం ద్వారా వారిలో నూతనోత్సాహం, ఆత్మ విశ్వాసం పెంచడం జరుగుతుంది అన్నారు. అనంతరం సభాధ్యక్షులు డిజిఎం (పర్సనల్‌) ఎస్‌.రమేశ్‌ మాట్లాడారు. దివ్యాంగుల సౌలభ్యాన్ని బట్టి నిర్వహించిన దివ్యాంగుల క్రీడాపోటీలలో సంతోష్‌ నగర్‌ శ్రీ సత్యా సాయి దివ్యాంగుల పాఠశాల, సింగరేణి పాఠశాల, స్థానిక దివ్యాంగులు క్రీడల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనటంతో పాటు వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా దివ్యాంగులతో పాటు ఏరియా జనరల్‌ మేనేజర్‌ దుర్గం రాంచందర్‌, ఇతర అధికారులు సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింగు శ్రీనివాస్‌, రామేశ్వర రావు, ఎండి మదార్‌ సాహెబ్‌, స్పొర్ట్స్‌ జాన్‌ వెస్లీ, షాకిర బేగం, సేవ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love