నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాహనదారులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కూడా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం కారణంగా వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీలో ఈ రోజు నుంచి(మంగళవారం) తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హెల్మెట్ ధరించకుండా బైక్ డ్రైవింగ్ చేస్తే రూ. 200 జరిమానా విధించనున్నారు. రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేసే వారికి రూ. 2 వేలు జరిమానా విధించనున్నారు. ఈ నిబంధనలు నేటి నుంచి అమలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక పబ్‌ల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. మొత్తానికి రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు కఠిన చర్యలు అమలు చేస్తున్నారు.