‘దేశానికి సేవ చెయ్యాలంటే రాజకీయాల్లోనే ఉండక్కరలేదు.. నీకొచ్చిన పనినే నీకు తెలిసిందే నువ్వు దేశం కోసం చెయ్యొచ్చు. నిజానికి ప్రతి ఒక్కరూ దేశం కోసం పని చెయ్యవచ్చు’ తండ్రి చెప్పిన ఈ మాటలు ఆమె మనసులో కొత్త ఆలోచన మొలకెత్తించింది. ఆ ఆలోచనకు ఆచరణ ప్రాణం పోసింది. చిన్న మొలక నేడు మహా వృక్షమై మహిళా సాధికారత ఫలాలు ఇస్తుంది. సమాజ శ్రేయస్సుకు పాటుపడుతోంది. ఎందరో వ్యాపారవేత్తలకు డేటా అందిస్తోంది. నగరాల అభివృద్దికి ఆధారంగా నిలుస్తోంది. ఆమే మ్యునిఫై సుబ్బలక్ష్మి.
మ్యునిఫై అంటే ఇంటిపేరు కాదు, ఆమె చేసే పని పేరు. సుబ్బలక్ష్మీ మ్యునిఫై డేటాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించారు. ఇది మున్సిపల్ కార్పొరేషన్ల పనితీరు, ప్రణాళికల నుండి వాటి భవిష్య ప్రణాళికలు, బడ్జెట్లు, ర్యాకింగ్స్ ఇలా అన్ని డిజిటల్‌గా అందుబాటులోకి తెచ్చే ఒక ప్లాట్ ఫార్మ్. ఒకప్పుడు పెద్ద పెద్ద సంస్థల పనితీరుకు రేటింగ్ ఇచ్చే ఒక ప్రైవేటు సంస్థలో క్రెడిట్ రేటింగ్ హెడ్‌గా ఉద్యోగం చేసే సుబ్బలక్ష్మి తానే సొంతంగా ఒక సంస్థ పెట్టి నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. తాను పనిచేసే రోజులలో ఎన్నో సంస్థలకు రేటింగ్ ఇచ్చేది. ఈరోజుల్లో రేటింగ్స్‌కు ఉన్న ప్రాముఖ్యం మనకు తెలిసిందే. పది రూపాయలు పెట్టి ఒక జూసు తాగాలన్నా ఏ జూస్ పాయింట్‌కు వెళ్లాలని అంతర్జాలంలో రేటింగ్ చూసి వెళ్లడం సహజమైపోయింది.
అందరికీ ప్రయోజనం
ఒక సంస్థ నెలకొల్పినప్పుడు దాని పనితీరుకు వచ్చే రేటింగ్‌ని బట్టే ఆ సంస్థ పురోగతి ఆధారపడి ఉంటుంది. లోన్లు రావడం, పెట్టుబడులు పెట్టడం వంటి ఆర్ధిక విషయాలు రేటింగ్స్ పైనే ఆధారపడి ఉంటాయి. అందుకే ఈ అంశాలన్నిటిని ఒక డేటా బేస్‌లో పదిలపరచాలని సంకల్పించారు సుబ్బలక్ష్మి. అయితే ప్రైవేటు సంస్థలకు రేటింగ్స్ అందరూ ఇస్తారు. కానీ మున్సిపాలిటీల పనితీరును రేట్ చెయ్యడం తాను చూడలేదు. ఒక సంస్థ ప్రగతి, ప్రజల ప్రగతి మున్సిపాలిటీలతో ముడిపడి ఉంది. ఈ డేటా వాటి పనితీరు, ప్రణాళికలు తెలిస్తే అటు ఇన్వెస్టర్లకూ ఇటు లోన్లు ఇచ్చే వారికి అందరికీ ప్రయోజనం చేకూరుతుంది. అని దాని అవశ్యకతను గుర్తించి మ్యునిఫై డేటాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నెలకొల్పారు.
ఆటంకాలను అణగదొక్కి
చిన్న కిరాణాకొట్టు నడపాలంటేనే ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కోవాలి. అటువంటిది ప్రభుత్వానికి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ల పనితీరు, డేటాబేస్ అంటే ఆశామాషి వ్యవహారం కాదని తొలినాళ్లలో ఆమె ఎదుర్కున్న అనుభవాల ద్వారా తెలుసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ల డేటా బేస్ ప్లాటుఫారంకు 2013లో శ్రీకారం చుట్టారు. ఒక్కోమెట్టు ఎక్కి ఆటంకాలను, అవరోధాలను అణగతొక్కి సక్సెస్ ఫుల్ మహిళా ఎంటర్ప్రెన్యూర్‌గా ఎదిగారు. ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఆమె. చేసేది మంచి పనైనా అందరూ ఒకే లాగా సానుకూలంగా స్పందించలేదు. ప్రతికూల పరిస్థితులకు మహిళలు తలవంచరని ప్రూవ్ చేసింది. మ్యునిఫై డేటాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌ని మూల సంస్థగా తీర్చిదిద్దింది ప్రయత్నం రెండు సార్లు విఫలమైంది. కానీ ఆమె ఆత్మవిశ్వాసం సఫలమైంది.
ఈ సంస్థ ఏంచేస్తుంది
దేశంలోని కార్పొరేషన్ల కార్యకలాపాలు, ప్రణాళికలు, బడ్జెట్లు ఇలా అన్నీ సేకరించి ఒక ప్లాటుఫారంపై పొందుపరిచింది. ఇది దేశంలోనే తొలి ప్రయత్నం. వినూత్న ప్రయోజనాత్మక ప్రయత్నం కూడా. అందుకే ఆమె ప్రయత్నానికి స్నేహహస్తం అందించింది వి హబ్. విమేన్ ఎంట్రప్రెనెర్స్‌కి చేయూతనిస్తూ మహిళాసాధికారతకు ప్రాణం పోస్తోంది విహబ్. మ్యునిఫై సుబ్బలక్ష్మికి కూడా విహబ్ మార్గదర్శకం చూపింది. అంతేకాదు ఆమెకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ వారు కూడా సహకరించారు. ప్రస్తుతం 250 మున్సిపల్ కార్పొరేషన్ల ఆర్ధిక అసెస్మెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకే ప్లాటుఫారంపైన పొందుపరిచింది.
విశ్వవ్యాప్త సేవలు
ఇన్ఫర్మేషన్ ఎంత సమర్ధవంతంగా ఇవ్వగలిగితే అంట ప్రయోజనం కలిగిస్తుందని భావించింది. విజువల్ ప్రెసెంటేషన్ ఇవ్వాలని ఇన్ఫోగ్రాఫిక్స్ డాష్ బోర్డు రూపొందించారు. సుమారు 2300 ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా మున్సిపల్ పర్ఫార్మెన్స్ సమాచారం అందిస్తోంది. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, సాంకేతిక నిపుణుల సహాయంతో సామాన్యులు సైతం సులువుగా అర్ధం చేసుకునేలా ప్రతి కార్పొరేషన్ సమాచారం విభాగాల వారీగా ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా తెలుపుతున్నారు. మన దేశ మున్సిపాలిటీలలో పెట్టుబడులు పెట్టాలనుకునే అన్ని సంస్థలకూ, వ్యాపారవేత్తలకూ దిక్సూచిగా నిలిచే సంస్థ ఆమె నెలకొల్పారు. భారతీయులతో పాటు విదేశీ ఇన్వెస్టర్లకూ ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ సమాచారం బ్యాంక్స్, ప్రైవేట్ సంస్థలు, రెగ్యులేటర్స్‌కి ఉపయోగపడుతుంది. నగరాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్‌కి కూడా దోహదపడుతుంది. అంతేకాదు 2021లో మ్యునిఫై డేటాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు.
కుటుంబ నేపధ్యం
సుబ్బలక్ష్మి తమిళనాడులో పుట్టారు. తండ్రి జానా కృష్ణమూర్తి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసారు. 1988లో మద్రాసు యూనివర్సిటీలో బి కామ్ చేసారు. 1991లో సి.ఏ పూర్తి చేసారు. కాస్ట్ అండ్ మానేజ్ మెంట్ అకౌంటెంట్‌లో 1992లో గోల్డ్ మెడల్ అందుకున్నారు. జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు. భర్త స్పోర్ట్స్ బిజినెస్ చేస్తారు. వీరికి 15 ఏండ్ల కూతురు ఉంది. తండ్రి చెప్పినట్టు దేశం కోసం తన వంతు సేవ చెయ్యాలని దృఢంగా విశ్వసి స్తారు. కుటుంబం, వృత్తితో ఆగిపోకుండా సమాజసేవలో నేను సైతం అంటూ ఒక బ్రిటిష్ యన్.జి.ఓ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. తన దినచర్యలో అధిక భాగం సమాజసేవలోనే గడిచిపోతుందని చెబుతారు. సాంకేతిక విద్యలో పట్టభద్రులైన తన స్నేహితులు, చార్టెడ్ అక్కౌంటెంట్లు, కుటుంబ సభ్యుల అందరి సహకారంతోనే తన సంస్థ ఈ స్థాయికి వచ్చిందని అంటారు సుబ్బలక్ష్మి.
– ముదిగొండ రాజ చంద్రిక
యువతకు ఉపాధి
గాంధీజీ గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడితే సుబ్బలక్ష్మి నగరాభివృద్ధి గురించి ఆలోచించారు. మున్సిపల్ కార్పోరేషన్ల పనితీరుపైనే నగరాల అభివృద్ధి ఆధారపడి వుంటుంది. అందుకే మున్సిపల్ పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ అనే యూనిక్ ఐడియాతో అడుగులు వేస్తున్నారు. తన ప్రయాణంలో యువతకు ప్రత్యేక స్థానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా సేవలు అందించడానికి పెయిడ్ ఇంటర్న్ షిప్ అవకాశాలు ఇస్తున్నారు. ఉపాధి కల్పిస్తున్నారు