బాల సాహిత్యంలో.. ముఖ్యంగా మనం చదువుకున్న మొన్నటి చందమామ కథలు మొదలుకుని నేటి బాలల కథల వరకు కథా ఇతివృత్తాల విషయాన్ని చూస్తే ఎక్కువగా మనకు కనిపించేవి పల్లెలు… పల్లె చిత్రాలు, జానపదుల జీవితాలు వగైరా వగైరాలు. అయితే వీటికి అతీతంగా నగరాలు, పట్నాల ఇతివృత్తాల కథలు వచ్చాయి… వస్తున్నాయి. ఆ కోవలోనే ఇటీవల పిల్లల కోసం హైదరాబాద్‌లోని ఒక బడి నేపథ్యంగా వచ్చిన బాలల నవల ‘బడే నాలోకం’.. రచయిత్రి డా.సమ్మెట విజయ.
డా||సమ్మెట విజయ నవంబర్ 11, 1964న హైదరాబాద్‌లో జన్మించారు. శ్రీమతి సమ్మెట తులసీబాయి – శ్రీ పోతరాజు వీరి అమ్మానాన్నలు. డా|| సమ్మెట విజయ రచయిత్రి, కవయిత్రి, పరిశోధకురాలు, ‘అక్షరయాన్’తో కలిసి నడుస్తున్న కార్యకర్త, కావ్యకర్త. వత్తిరీత్యా రైల్వే మిశ్రమోన్నత పాఠశాలలో పిల్లలకు తెలుగు పాఠాలను బోధించి త్వరలో పదవీ విరమణ చేయబోతున్నారు. బాల సాహితీవేత్త, రచయిత్రి, వందలాది గిరిజన విద్యార్థులకు ‘అమ్మ’ అయిన సమ్మెట ఉమాదేవికి స్వయాన సోదరి ఈమె.
కవయిత్రిగా విజయ ప్రచురించిన పుస్తకం ‘భావనాంజలి’. తరువాత జీవిత చరిత్ర రచయిత్రిగా ‘అనుటెక్స్ అధినేత పులవర్తి రామకృష్ణారావు జీవిత కథ’ను రచించారు. నాటక రంగంపై రాసిన వ్యాసాలు ‘తెర వెనుక’. విజయ పరిశోధకురాలుగా తెలుగు నాటక రంగంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో సాధికారిక పరిశోధన చేసి డాక్టరేటు పట్టా అందుకున్నారు. వీరి పిహెచ్.డి పరిశోధనా వ్యాసం ‘తెలుగులో నాటక రచన’ పేరుతో అచ్చయ్యింది. వివిధ పత్రికల్లో రచనలతోపాటు ఆకాశవాణి ద్వారా దాదాపు యాభైకి పైగా వ్యాసాలు ప్రసారమయ్యాయి. ఇరవై వరకు కథలు కూడా ఆకాశవాణి ద్వారా తెలుగు శ్రోతలను అలరించాయి. ఈమె బాల సాహిత్య రచనకు ముందు బాల సాహిత్య వికాసకారులుగా రవీంద్ర భారతిలో జరిగిన కార్యశాలలో పిల్లలతో కవిత్వం రాయించారు. రెండు ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొని సదస్సులో పత్ర సమర్పణ చేశారు. రచయిత్రిగా ఆంధ్ర సారస్వత సమితి ఉగాది పురస్కారం, హైదరాబాద్ పాత నగరం కవుల వేదిక పురస్కారం, కిరణ్ సాంస్కృతిక సమాఖ్య పురస్కారం, అక్షరాలతోవ ఉత్తమ కవితా పురస్కారం, తెలుగు రక్షణ వేదిక బహుమతితో పాటు అభినయ, భూమిక వంటి సంస్థల బహుమతులు, సత్కారాలు అందుకున్నారు.
నిరంతరం బడి పిల్లలతోనే మూడు దశాబ్దాలు గడిపిన విజయ ‘బడే నా లోకం’ తేవడం ఔచిత్యంగా ఉంది. ఈ నవల నేపథ్యం, పరిసరాలు, పాత్రలు, సంఘటనలు, సమాచారం అంతా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలే. రచయిత్రి తనకు తెలిసిన, చూసిన వాటిని అక్షర చిత్రం చేయడం వల్ల ప్రత్యక్షంగా పాఠకుడికి అనుభూతితో పాటు ‘తెలిసిన’ ఫీలింగ్ కలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ సమయంలో అనుభవించిన బాధలు, భయాలు మనకు తెలియనివి కావు. ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళమే. 21 రోజులు లాక్‌డౌన్‌కు ముందూ, తరువాత ఎన్ని జీవితాలు ఛిద్రమైపోయాయో అందరం చూశాం. ఇప్పటికీ ఆ విషాదంలోంచి కోలుకోని అనేక కుటుంబాలు మన చుట్టూ ఉన్నాయి. ఈ నవల కోవిడ్ ముందూ వెనకా పరిస్థితులతో పాటు ‘బడే లోకం’గా నిబద్దత కలిగిన ‘మీనా’ టీచర్ కథ, ఆమె బడి కథ, ఆమె పిల్లల కథ. ఇంకా చెప్పాలంటే నగరాల్లో జీవించే దిగువ, మధ్యతరగతి పిల్లల కుటుంబ గాధల సమాహారం కూడా! విజయ కేవలం బడికే పరిమితమై పాఠాలు చెప్పడంతోనే బాధ్యత పూర్తయ్యిందనుకున్నట్టయితే ఈ నవలలోని అనేక సంఘటనలు మనకు కనబడేవి కావు. పిల్లల మనసుల్లోకి, వాళ్ళ కుటుంబాల్లోకి వెళ్ళగలిగింది కాబట్టే సబ్బండ వర్ణాల ‘సంగతులు’, పరిస్థితులు మనకు తెలిసాయి. నిజానికి నవలలో నాయిక మీనా అయినా, బడితో సంబంధం ఉన్న అందరం ఆ పాత్రలో మనల్ని చూసుకుంటాం. ‘బడే నా లోకం’ నవల అనేక విషయాలు, అంశాలను సర్కారు బడి నేపథ్యంగా మన ముందు ఉంచుతుంది. వాటిలో- డిజిటల్ పాఠాల నేపథ్యంగా వీడియో పాఠాలు, తల్లిదండ్రుల మనస్తత్వాలు, పరిస్థితులు, సర్కారు బడుల్లో క్రీడల ప్రాధాన్యం, ఆటల నేపథ్యంగా ఆరోగ్యం గురించిన వివరాలు, సంతోష్ మొదలైన పాత్రల ద్వారా దిగువ మధ్యతరగతి జీవితాలు, పిల్లలకు ఉపయోగపడే ట్రాఫిక్ రూల్స్ వంటివి కథా సందర్భంగా చెప్పించటం, సెల్ ఫోను వల్ల అనర్థాలు, లాభాలతో పాటు వివిధ సంఘటనల ద్వారా విద్యార్థులల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు నిబద్దత గల టీచర్ల ప్రయత్నాల వంటివి రచయిత్రి చక్కగా ఇందులో చూపించారు. డా.విజయ దీనిని మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కోసం రాసినా మనకు అనేక విషయాలు తెలిపేలావుంది. ఓకేచోట ఇన్ని రకాల అంశాలు, మనస్తత్వాలు, జీవితాలను చిత్రించడం సాధారణమైన పని కాదు. ‘చైతన్య స్రవంతి’ని చదివి అధ్యయనం చేస్తేనే ఇది సాధ్యం. అది రచయిత్రి చక్కగా సాధించారు. తెలుగు బాలల కోసం మరో రచనను నవలగా అందిస్తున్న టీచరమ్మ, అమ్మ, పిల్లల మనసు తెలిసిన స్త్రీమూర్తి డా. సమ్మెట విజయను ఆత్మతో అభినందిస్తున్నాను. మరిన్ని రచనలను ఆహ్వానిస్తున్నాను.
– డా|| పత్తిపాక మోహన్
9966229548