మలయాళ సూపర్ స్టార్ మోహనాల్‌తో నల్లటి దుస్తులు ధరించిన ఓ మహిళ ఉన్న ఓ వీడియో ఇటీవల బాగా వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ వీడియో అంతగా ప్రచారం అవుతుందని ఆ క్షణాన ఆమె అనుకోలేదు. అయితే ఆ వీడియో ఇప్పుడు ఆమె మార్గాన్ని మరింత సుగమం చేసింది. ఆమె వృత్తికి అత్యంత ప్రాధాన్యం తెచ్చిపెట్టింది. ఆమె గౌరవాన్ని పెంచింది. ఆమే కేరళకు చెందిన మహిళా బౌన్సర్ అను కుంజుమోన్.
మహిళలు అరుదుగా కనిపించే రంగం ఇది. అటువంటి చోట పురుషాధిక్యతను బద్దలు కొట్టి ముందుకు దూసుకుపోతోంది. తన కలల గురించి ప్రపంచానికి తెలియజేస్తోంది. ‘మహిళా బౌన్సర్ల గురించి పరిశోధన చేస్తున్న పీటీఐ నుండి వచ్చిన ఒక రిపోర్టర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను వారికి నా కథ చెప్పాను. నా వీడియోలలో కొన్నింటిని వారికి ఇచ్చాను. వాటిలో ఒకటి వైరల్ అయింది’ అని ఆమె పంచుకున్నారు. వీడియాలోని ఒక విభాగంలో చూపించినట్టు తాను నటుడు మోహన్ లాల్‌కు బాడీగార్డ్ కాదని ఆమె స్పష్టం చేసింది. ఈ ఫొటో ఒక సినిమా ప్రకటన కోసం షూట్‌లో తీయబడింది, అక్కడ కుంజుమోన్ సమన్వయకర్తగా, బౌన్సర్‌గా రెండు పాత్రలుపోషించారు.
పోరాటం కొత్త కాదు
పదమూడు ఏండ్లుగా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా ఉన్న కుంజుమోన్ పబ్‌లు, ఈవెంట్‌లలో పార్ట్‌టైమ్ బౌన్సర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఆమె తరచుగా పగటిపూట షూటింగ్‌లో పాల్గొంటూ రాత్రిపూట సెక్యురిటీగా ఉంటారు. ఎర్నాకుళం జిల్లాలోని కంజిరామట్టంలో జన్మించిన కుంజుమోన్ ఒంటరి తల్లి దగ్గర పెరిగారు. ఇది ఆమె జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపింది. చిన్నతనం నుండే ఇబ్బందులు, పోరాటాలను అర్థం చేసుకుంది. అందుకే ఆమె ప్రతి అవకాశంలోనూ తనను తాను సవాలు చేసుకుంది. మహిళలకు అంతగా ప్రాధాన్యం లేని ఫొటోగ్రఫీలోకి అడుగుపెట్టింది. వృత్తిలో భాగంగా వివాహాలు, సినిమా ప్రమోషన్‌లను కవర్ చేసింది. అలాగే ప్రకటనల షూట్‌లలో పనిచేసింది. అయితే బౌన్సర్‌గా మారడం అనేది ఆమె ఊహించని మలుపు.
వారి పని పట్ల ఆసక్తితో…
‘ఫొటోగ్రాఫర్‌గా ఒక ప్రమోషనల్ ఈవెంట్‌కు వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక బౌన్సర్‌తో ఘర్షణ పడ్డాను. అయితే త్వరలోనే నేను ఆ బౌన్సర్ల బృందంతో స్నేహం చేశాను. వారి పని పట్ల ఆసక్తి కలిగింది. నేను అప్పటికే ఫిట్‌నెస్‌తో ఉండేదాన్ని. అందుకే రాష్ట్రంలో అప్పటి వరకు కేవలం కొంతమంది మహిళలు మాత్రమే వెళ్లిన మార్గాన్ని ముందు అన్వేషించాలని నిర్ణయించుకున్నాను’ అని ఆమె చెప్పింది. ఇది మూడేండ్ల కిందట జరిగిన సంఘటన. అప్పటి నుండి కుంజుమోన్ కొచ్చిలోని వివిధ పబ్‌లలో బౌన్సర్‌గా ఉంది. ప్రైవేట్ ఈవెంట్‌లలో కూడా పనిచేసింది. విజయవంతమైన మహిళా బౌన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
దృఢత్వం ప్రారంభం మాత్రమే
‘ఈ రంగంలో నిలదొక్కుకోవాలంటే శారీరకంగా దృఢంగా ఉండటం, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం మంచిది. కానీ మానసికంగా అప్రమత్తంగా, బలంగా ఉండటం, కఠినమైన పరిస్థితులను ఎదుర్కోగలగడం కూడా అంతే ముఖ్యం’ అని ఆమె వివరిస్తుంది. ఆమె మానసిక బలాన్ని అనేకసార్లు పరీక్షించారు. ఒక పబ్‌లో జరిగిన ఘర్షణకు దారితీసిన సంఘటనను గుర్తుచేసుకుంటూ కుంజుమోన్ ‘నేను పరిస్థితిని ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రయత్నించాను. కానీ అది పని చేయలేదు. గొడవకు దారితీసింది. కానీ నేను దాన్ని వృత్తిపరంగా నిర్వహించానని భావించాను. దీనిపై ఎటువంటి అధికారిక ఫిర్యాదూ ఉండదు’ ఏదైనా పరిస్థితిని నిర్వహించడానికి మానసిక శక్తి ఉండాలని, భద్రత యొక్క మానసిక అంశాలను ఆమె నొక్కి చెబుతుంది.
నాకు వేరే మార్గం లేదు
ఒంటరి తల్లి వద్ద ఆమె ఎదుర్కొంటున్న పోరాటాలను వివరిస్తూ ‘నేను ఒంటరి తల్లి దగ్గర పెరిగాను, నా తల్లి కష్టాలను చూశాను. విభిన్న పరిస్థితులను ఎదుర్కోవడానికి నేను ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను. కానీ నేను ఏ పరిస్థితినైనా నిర్వహించగలనని నాకు తెలుసు. ఎందుకంటే నాకు వేరే మార్గం లేదు’ అని ఆమె చెప్పింది. కుంజుమోన్‌కు పన్నెండవ తరగతి చదువుతున్న కూతురు, ఏడో తరగతి చదువుతున్న కొడుకు ఉన్నారు. ‘నేను ఎంచుకున్న రంగాన్ని చూసి నా పిల్లలు సంతోషంగా ఉన్నారు. ప్రతిదానిలోనూ నాకు మద్దతు ఇస్తున్నారు. ఇది నన్ను ముందుకు నడిపిస్తుంది’ అని ఆమె గర్వంగా పంచుకుంటుంది.
మన దగ్గర గుర్తింపు తక్కువ
ఓ మహిళా బౌన్సర్‌గా కుంజుమోన్ తెచ్చుకున్న గుర్తింపు, పొందుతున్న గౌరవం ఇప్పుడు ఇతర మహిళలకు స్ఫూర్తిదాయకంగా మారింది. వారు కూడా ఈ రంగాన్ని ఎంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘నా గురించి తెలుసుకొని తాము కూడా బౌన్సర్‌గా పని చేయడం గురించి ఆలోచిస్తున్నామని కొందరు మహిళల నుండి నాకు ఫోన్ కాల్స్ వచ్చినపుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది’ అని ఆమె చెప్పింది. పురుషాధిక్య రంగాన్ని ఎంపిక చేసుకునేందుకు గల కారణాల గురించి ప్రజలు తరచూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆమె చెప్పే సమాధానం జీవితం పట్ల ఆమె వైఖరి ఆచరణాత్మకత, అభిరుచి రెండింటినీ ప్రతిబింబిస్తుంది. ‘నేను జీవితంలో కష్టాలు పడే వ్యక్తిని. ముందుకు సాగాలంటే నాకు ఉద్యోగం అవసరం. ఇది నేను అభిరుచి, ప్రేమతో చేసే పని. ఇష్టపడి చేసే పనిలో మనకు బాధ ఉండదని నేను నమ్ముతాను. అది నాకు ఆదాయాన్ని కూడా ఇస్తుంది’ అంటారు ఆమె. అయితే ఇతర దేశాల్లో బౌన్సర్లకు ఉన్న గౌరవం, హౌదా మన భారతదేశంలో ఉండదని కుంజుమోన్ ఎత్తి చూపారు. ‘ఇక్కడ వారిని గూండాలతో సమానం చేస్తారు’ అని ఆమె అంటుంది.
ఆమె ఆశయాలు బహుముఖం
ఆమె ఫొటోగ్రాఫర్‌గా, బౌన్సర్‌గా పని చేస్తూనే ఉంటుంది. అయితే ఆమె సినిమాల్లో నటించేందుకు అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఆమె మలయాళ చిత్రం విశేషమ్‌లో ఒక చిన్న పాత్ర పోషించింది. అలాగే ఆమె అతిధి పాత్ర పోషించిన పూరం పూరదం పూరుతాది అనే సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఏ రంగంలో ఉన్నా కుంజుమోన్ తన కంటూ ప్రత్యేక గుర్తింపు, స్థానం సంపాదించుకోవడం కోసమే ప్రయత్నిస్తోంది. అభిరుచి, పట్టుదలతో పాటు, ఇతర మహిళలు పెద్ద కలలు కనేలా ప్రేరేపించడమే ఆమె ఉద్దేశ్యం.