హెరిటేజ్‌ షేర్ల విలువ రెట్టింపు

హెరిటేజ్‌ షేర్ల విలువ రెట్టింపు– 12 సెషన్లలోనే వృద్థి
– రూ.1,225 కోట్ల పెరిగిన చంద్రబాబు కుటుంబ సంపద
ముంబయి : కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సంపద రెండు వారాల్లోనే రెట్టింపు అయ్యింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌ షేర్లు భారీగా పెరగడమే ఇందుకు కారణం. గడిచిన 12 ట్రేడింగ్‌ సెషన్లలో ఈ కంపెనీ షేర్లు 105 శాతం పెరిగాయి. దీంతో చంద్రబాబు కుటుంబ సభ్యుల సంపద రూ.1,225 కోట్లు ఎగిసింది. సోమవారం బీఎస్‌ఈలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ షేరు ఇంట్రాడేలో 10 శాతం అప్పర్‌ సర్య్కూట్‌ తాకి రూ.727.9కి చేరింది. తాజాగా 52 వారాల గరిష్ట స్థాయికి ఎగిసిన ఈ సూచీ.. మే 23న కేవలం రూ.354.5 వద్ద నమోదయ్యింది. కాగా.. ఎన్నికల ఫలితాల ముందు జూన్‌ 3 నుంచి జూన్‌ 10 మధ్య ఈ స్టాక్స్‌కు భారీగా డిమాండ్‌ పెరిగింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌లో చంద్రబాబు కుటుంబానికి 35.71 శాతం వాటాకు సమానమైన 3,31,36,005 షేర్లు ఉన్నాయి. 2024 మార్చి 31 నాటికి లోకేష్‌కు 10.82 శాతం వాటాలు ఉన్నాయి. భువనేశ్వరీ, దేవాన్ష్‌కు వరుసగా 24.37 శాతం, 0.06 శాతం చొప్పున వాటాలున్నాయి. నారా బ్రహ్మణీకి 0.46 శాతం వాటా ఉంది. 2024 జూన్‌ 10 నాటికి భువనేశ్వరీ సంపద రూ.1,631.6 కోట్లకు చేరగా.. లోకేష్‌ రూ.724.4 కోట్ల సంపదను కలిగి ఉన్నారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ స్టాక్స్‌లో వారి కుటుంబం మొత్తానికి ప్రస్తుతం రూ.2,391 కోట్ల సంపద ఉంది.పాల ఉత్పత్తుల్లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ దేశంలోనే కీలక బ్రాండ్‌గా ఉంది. అదే విధంగా అనుబంధ సంస్థగా హెరిటేజ్‌ నూట్రివెట్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎన్‌ఎల్‌) పేరుతో పశువుల దానను విక్రయిస్తోంది. దేశంలోని 11 రాష్ట్రాల్లో 15 లక్షల కుటుంబాలు హెరిటేజ్‌ ఫుడ్స్‌కు చెందిన పాలు, పాల ఉత్పత్తులు అయినా పెరుగు, నెయ్యి, పన్నీరు, ఫ్లేవర్డ్‌ మిల్క్‌ తదితర ఉత్పత్తులను ఉపయోగి స్తున్నారని ఆ సంస్థ వర్గాల అంచనా. 2023-24లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ రెవెన్యూ 17 శాతం, లాభాలు 83 శాతం చొప్పున పెరగ్గా.. మార్కెట్లు షేర్‌ విలువ 126 శాతం పెరిగింది. సోమవారం చివరకు బీఎస్‌ఈలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ షేర్‌ విలువ 4.90 శాతం పెరిగి రూ.694.15 వద్ద ముగిసింది. ఐదు సెషన్లలోనే ఏకంగా 61.39 శాతం లేదా రూ.264 పెరిగింది.

Spread the love