హే రామ్‌..!

హే రామ్‌..!డెబ్భై నాలుగో గణతంత్ర దినోత్సవాన్ని పూర్తి చేసు కున్నాం. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన చారిత్రక సందర్భానికి గుర్తుగా మన దేశం ఏటా ఈ వేడుకను జరుపుకుంటున్నది. అలా డెబ్బది నాలుగేండ్లు పూర్తి చేసుకుని డెబ్బది అయిదవ వడిలోకి ప్రవేశించిన వజ్రోత్సవ సమయమిది. సాధారణంగా ఇలాం టి సందర్భంలో ఈ రాజ్యాంగ దినోత్సవ వేడుక అంగరంగ వైభవంగా, స్ఫూర్తిదాయకంగా జరుగుతుందని భావిం చడం సహజం. కానీ అలా జరుగకపోగా ఆ రాజ్యాంగ పునాదులే కదులుతున్న అలికిడి వినిపిస్తోంది. ఈ సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తి, లక్ష్యాలపై జరగాల్సిన కనీస చర్చ కూడా ఇటు ప్రసారమాధ్యమాల్లోనూ అటు ప్రభుత్వ వేదికల్లోనూ లేకపోగా… అది పూర్తిగా అయోధ్య రామా లయ వేడుకలతో కప్పివేయబడింది. లేదంటే ఇదే సమ యంలో మందిర ప్రారంభోత్సవం (జనవరి 22) నుంచి మహాత్ముని వర్ధంతి (జనవరి 30) వరకూ రామాలయ వారోత్సవాలకు స్వయంగా ప్రధానే పిలుపునివ్వడంలోని మతలబేమిటి? రామాలయ వారోత్సవాల మీద ఉన్న శ్రద్ధ రాజ్యాంగ ఉత్సవాల మీద లేకపోవడమేమిటి? ఈ నేపథ్యం లో ఇది ప్రగతిశీలురు, రాజకీయ విశ్లేషకులనేకులకు ఉద్దేశపూరిత చర్యగా కనిపించడంలో ఆశ్చర్యమేముంది?
భారత రాజ్యాంగం ఈ దేశానికి ఏ లౌకిక, సమ్మిళిత రాజ్యాన్ని లక్ష్యంగా నిర్దేశించిందో సరిగ్గా ఇప్పుడు ఆ లక్ష్యా నికే ముప్పు ఏర్పడిందని పరిస్థితులు సూచిస్తున్నాయి. లౌకి కవాదం, ఆర్ధిక స్వావలంబన, సామాజిక న్యాయం, ఫెడ రలిజం ఆలంబనగా మన గణతంత్ర భారత్‌ ఆవిర్భవిం చింది. జాతీయోద్యమ ఆకాంక్షలకు ప్రతీకగా అది నిర్మించ బడింది. స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న ఫ్యూడల్‌ భావజా లానికి భిన్నమైన ఆదర్శాలు, ఆధునిక వైజ్ఞానిక భావనలు పునాదిగా ఈ దేశ నిర్మాణం జరగాలని భారత రాజ్యాంగం నిర్దేశించింది. ఏ మత ప్రమేయమూ లేని పాలనా వ్యవ స్థను ఆదేశించింది. లౌకిక, సామ్యవాదాలతోపాటు సమా ఖ్య విధానం, స్వతంత్ర న్యాయవ్యవస్థ, పార్లమెంటరీ ప్రజా స్వామ్యం, ప్రాధమిక హక్కులను ఈ గణతంత్ర రాజ్య మౌలిక స్వరూపంగా పేర్కొన్నది. ఈ స్వభావమే డెబ్బది నాలుగేండ్లుగా కాలపరీక్షకు నిలిచి ఈ దేశాన్ని ఒక్కటిగా నడుపుతోంది. భిన్న మతాలు, కులాలు, విభిన్న సంస్కృ తులు, ప్రాంతాలతో కూడిన భారత ప్రజలను ఒకే జాతిగా ఐక్యంగా నిలుపుతోంది. ఇప్పుడు ఈ మౌలిక స్వభావానికే ముప్పు ఏర్పడింది. ఈ ముప్పు ఈ దేశ పాలకుల నుండే ఎదురవుతుండటం ఆందోళనకరం.
లౌకిక, సామ్యవాద అనే పదాలనే రాజ్యాంగ పీఠిక నుండి తొలగించిన పాలకుల కాలమిది. వీరు నిర్లజ్జగా మతమే తమ అస్తిత్వంగా రాజకీయాలు సాగిస్తున్న వైనం బహిరంగ రహస్యం! లౌకిక స్వభావాన్ని కోల్పోతే ఏ దేశం లోనూ ప్రజాస్వామ్యం మనజాలదని చరిత్ర చెపుతోంది. నేటి ఆధునిక ప్రపంచం కూడా ఇదే రుజువు చేస్తోంది. కానీ ఈ దేశంలో ఏం జరుగుతోంది? పౌరసత్వానికి సైతం మతాన్నే ప్రామాణికంగా ఎంచుకోవడం మొదలు ఏకంగా ప్రభుత్వమే ఒక మతానికి ప్రాతినిధ్యం వహించే దశకు చేరింది..! ”ఆరోగ్యకరమైన లౌకిక ధృక్పథమే నిజమైన ప్రజా స్వామ్యానికి పునాది” అన్నాడు అంబేద్కర్‌. అది మచ్చుకైనా లేకుండాపోతే అంతకంటే విషాదమేముంటుంది..? ”ప్రజా స్వామ్యమనేది అసమ్మతి గుండా ప్రవహిస్తుంది” అన్నాడు మహాత్మాగాంధీ. అసమ్మతిని ప్రకటిస్తే ”ఆందోళన జీవులు” అని ఎగతాళి చేస్తున్నాడు ప్రధాని మోడీ. అసమ్మతిని, విమర్శను నిర్ధాక్షిణ్యంగా అణచివేయడమే ఇప్పుడొక విధా నంగా సర్వసాధారణమైపోయింది. ఇది ప్రజాక్షేత్రంలోనే కాదు పార్లమెంటులోనూ పదేపదే రుజువవుతున్న సత్యం. నేడు అధికారంలో ఉన్నవారు పౌరసమాజంలో ప్రశ్నించే సామర్థ్యాన్ని ఒక క్రమపద్ధతిలో బలహీన పరుస్తున్నారు.
భారత రాజ్యాంగం ఈ దేశం రాష్ట్రాల సమాఖ్య అని స్పష్టంగా చెప్పింది. కేంద్రం, రాష్ట్రాల మధ్య స్పష్టమైన అధి కార విభజన చేసింది. ఇప్పుడా సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలుగుతోంది. కేంద్ర పాలకులు రాష్ట్రాల హక్కులను ఒక్క టొక్కటిగా హరిస్తూ సమాఖ్య వ్యవస్థను నీరు గారుస్తు న్నారు. ఇందుకు జీఎస్టీ మొదలు ఎన్‌ఈపీ వరకు ఉదా హరణలు కోకొల్లలు. రాష్ట్రాల ఉనికినే ప్రశ్నార్ధకం గా మార్చి సర్వాధికారాలను కేంద్రం గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు వేగంగా జరుగుతు న్నాయి. మరోవైపు స్వతంత్రంగా వ్యవహరించా ల్సిన వ్యవస్థలన్నీ ఏలికల నిరంకుశత్వానికి బలై పోతున్నాయి. చివరికి న్యాయవ్యవస్థ కూడా ఇం దుకు మినహాయింపు కాకపోవడం కలవరపెట్టే అంశం. సుప్రీంకోర్టు పనితీరులో సైతం జోక్యం చేసుకుంటున్నారు. మంత్రులే న్యాయవ్యవస్థ స్వతంత్రతను బహిరంగంగా సవాలు చేస్తు న్నారు. కొలీజియం ప్రతిపాదనలను ఖాతరు చేయకుండా తమకు ఇష్టమైన వారినే న్యాయ మూర్తులుగా నియమిస్తున్నారు. ఇప్పుడీ దాడుల నుండి రాజ్యాంగాన్నీ, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకోవడం ద్వారానే ఈ దేశాన్నీ కాపాడుకో గలం. ”భారత ప్రజలమైన మేము ఈ రాజ్యాం గాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం” అంటూ రాజ్యాంగ పీఠిక భారత ప్రజలందరి తరుపునా ప్రకటిస్తోంది. ఇప్పుడు దాన్ని కాపాడుకోవడం ప్రజల బాధ్యతే….

Spread the love