– ఏపీలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల
– బాలికల వసతి గృహంలో కలకలం
అమరావతి : కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ కళాశాల బాలికల వసతి గృహం వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు అర్ధరాత్రి సమయంలో ఆందోళనకు దిగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహిళా కమిషన్ సుమోటోగా కేసు తీసుకుంది. విద్యార్థి సంఘాలు ఉద్యమించాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి ఈ ఘటనను తీసుకెళతామని విద్యార్థులు తెలిపారు. పోలీసులు మాత్రం రహస్య కెమెరాలు ఏవీ దొరకలేదని చెప్తున్నారు. గుడివాడ మండలం గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు ఇంజనీరింగ్ కళాశాల బాలికల వసతి గృహం వాష్‌రూమ్‌లో హిడెన్ కెమెరాలు అమర్చినట్లు. ఓ విద్యార్థిని సాయంతో బిటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజరు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విద్యార్థులు చెబుతున్నారు. దీనిపై వారం రోజుల క్రితమే కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా సాక్ష్యాలు కావాలంటూ చర్యలు తీసుకోకపోవడంతో గురువారం అర్థరాత్రి నుండి శుక్రవారం తెల్లవారుజాము మూడు గంటల వరకూ సెల్‌ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ వసతి గృహం వద్దే నిరసనకు దిగారు. వర్షంలోనూ ఆందోళన కొనసాగిం చారు. ‘ఉరు వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనకు కారణమైన విజరుపై విద్యార్థులు దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో విద్యార్థినులు మాట్లాడు తూ, ‘వాష్‌రూమ్‌లో కెమెరాలు అమర్చి వీడియోలు తీశారు. ఆ వీడియోలను అమ్ముకుంటున్నారు’ అని వాపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విజరును విచారించి కేసు నమోదు చేసి అతడి ల్యాప్‌ట్యాప్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆందో ళన చేస్తున్న విద్యార్థులను అదుపు చేశారు. బాలికల వసతి గృహంలో హిడెన్ కెమెరా గుర్తించార ంటూ ‘ఎక్స్’ వేదికగా కొందరు విద్యార్థులు పోస్టులు పెట్టారు. విద్యార్థినులకు సంబంధించి దాదాపు 300 వీడియోలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సెప్టెంబర్ మూడో తేదీ వరకూ కళాశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది.
విద్యార్థి సంఘాల ఆందోళన
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు మద్దతుగా శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ తదితర విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వసతి గృహంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, విద్యార్థి సంఘాల నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.