లోపం దాచేసి.. ఆమెనే అనుమానించి…

Hiding the mistake.. Suspecting her...భర్త మోసం చేసి ఆమెను పెండ్లి చేసుకున్నాడు. నిజం తెలిసినా భర్తే సర్వస్వం అనుకుంది. భర్తను బాగు చేసుకునేందుకు అన్ని విధాల ప్రయత్నించింది. అతను బాగుపడకపోగా ఆమెనే అనుమానించడం మొదలుపెట్టాడు. అతనిలోని లోపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం తాగే వాడు, కొట్టేవాడు. అయినా కొన్నేండ్లు భరించింది. చివరకు ఇక అతనితో ఉండలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. దాంతో భర్త ఆమెకు నోటీసు పంపించాడు. ఈ సమస్య నుండి ఆమె ఎలా బయటపడిందో ఈ వారం ఐద్వా అదాలత్‌లో తెలుసుకుందాం…

లక్ష్మికి 20 ఏండ్లు. ఆమె ఉండేది చిన్న పల్లెటూరు. అమ్మా, నాన్నాతో పాటు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. తల్లిదండ్రులు వారు గ్రామంలోనే కూలిపని చేసుకుని బతికేవారు. పెద్దగా చదువు లేదు. లక్ష్మికి 18 ఏండ్లకే పెండ్లి చేశారు. అతనికి ఇది రెండో పెండ్లి. మొదటి భార్య వాళ్ళ బంధువుల అమ్మాయి. అయినా పెండ్లయిన ఏడాదికే విడాకులు తీసుకుంది. ఆ విషయం చెప్పకుండానే అతను లక్ష్మిని పెండ్లి చేసుకున్నాడు. అయితే పెండ్లి తర్వాత జరగాల్సిన ఏ ముచ్చటా ఆమెకు జరగలేదు. భర్త ఆమెతో కనీసం మాట్లాడేవాడు కాదు. పనికి వెళ్లొచ్చి అన్నం పెడితే తిని, పడుకునే వాడు.
ఏడాది తర్వాత లక్ష్మి తండ్రి చనిపోయాడు. దాంతో లక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 15 రోజులు ఉండి వచ్చింది. అప్పటి నుండి భర్త అంజయ్య ఆమెను అనుమానించడం మొదలుపెట్టాడు. ‘నీకు అక్కడ ఎవరితోనే సంబంధం వుంది. నువ్వు నాకు వద్దు’ అనేవాడు. ఊరి పెద్దలు పంచాయితీ పెట్టి అంజయ్యకు నాలుగు మంచి మాటలు చెప్పి పంపించారు. అప్పుడే అంజయ్య సంసార జీవితానికి పనికి రాడనే మొదటి భార్య విడాకులు ఇచ్చిందనే విషయం లక్ష్మికి తెలిసింది. కానీ ఆమె భర్తను ఒక్క మాట కూడా అనలేదు. పైగా ‘మనం హైదరాబాద్‌ పోయి అక్కడే ఏదో ఒక పని చేస్తూ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుందాం’ అని ధైర్యం చెప్పింది. కుటుంబ సభ్యులను కూడా ఒప్పించింది.
ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లో రెండేండ్లు గడిచిపోయింది. ఇంకా పిల్లలు ఎందుకు కాలేదు అంటూ ఇంట్లో వాళ్లు అనడం మొదలుపెట్టారు. ‘నీలో ఏదో లోపం ఉంది, అందుకే నీకు పిల్లలు పుట్టడం లేదు’ అని అందరూ లక్ష్మినే అనేవారు. ఒకపక్క ‘డాక్టర్లు ఆయనకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేదు’ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మి అతనికి విడాకులు ఇచ్చి ఇంకో వివాహం చేసుకోవచ్చు. కానీ ఆమె అలా చేయలేదు. ‘మంచో చెడో పెండ్లి చేసుకున్నాను. ఇప్పుడు కేవలం సంసార సుఖం కోసం అంజయ్యను వదిలి వెళ్ళడం సరి కాదు’ అనుకుంది. పైగా ఆమెకు తండ్రి లేడు. తల్లి కూలి చేసుకుని బతుకుతుంది. ఇంకా పెండ్లి కావల్సిన ఇద్దరు చెల్లెళ్లు వున్నారు. తను తిరిగి వెళితే తల్లికి భారం అవుతాను అనుకుంది. అందుకే ఎలాగైనా అంజయ్యతోనే ఉండాలని నిర్ణయించుకుంది.
భర్తను ఒప్పించి ఒక బాబును దత్తత తీసుకుంది. కానీ అంజయ్య తనలోని లోపాన్ని భరించలేక తాగుడుకు బానిస అయ్యాడు. తాగి లక్ష్మిని కొట్టేవాడు. ఏ పని చేసేవాడు కాదు. లక్ష్మి చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇంటిని నడిపించేది. అయినా ‘నేను సంసారానికి పనికిరానని వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నావు’ అంటూ లక్ష్మిని అనుమానించేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో అంజయ్యకు యాక్సిడెంట్‌ జరిగి మంచానికే పరిమితమయ్యాడు. అయినా భర్తకు చిన్న పిల్లాడికి చేసినట్టు ఆరు నెలలు సేవ చేసింది. తర్వాత అత్తమామలు వచ్చి ‘ఇంత ఇబ్బంది పడుతూ ఇక్కడ ఉండటం ఎందుకు, ఊరికి వెళ్దాం’ అని తీసుకువెళ్లారు. అంజయ్య ఆరోగ్య పరిస్థితి మెరుగు పడింది. కానీ లక్ష్ష్మిని మానసికంగా బాధ పెట్టడం మొదలు పెట్టాడు. ఊరిలో కూడా ప్రతి ఒక్కరితో సంబంధం అంటగట్టేవాడు. పని చేసేవాడు కాదు. కూర్చున్న దగ్గర అమ్ముకోవచ్చు అని పండ్ల వ్యాపారం చేయమని చెప్పినా వినలేదు. వాళ్ళ అమ్మ షాపులో కూర్చుంటే వచ్చిన డబ్బులు తీసుకుని తాగేవాడు. లక్ష్మి సంపాదన కూడా అతని తాగుడికి, మందులకే అయిపోయేవి. బాబును వేరే వాళ్ళకు ఇచ్చేయమని గొడవ చేసేవాడు.
‘నా బాబు కాదు, వీడు నీ కొడుకే. ఎవరితోనే సంబంధం పెట్టుకోవడం వల్ల పుట్టాడు. అందుకే వాడిని పెంచుతున్నావు’ అంటూ రకరకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టేవాడు. దాంతో అతన్ని వదిలేసి తల్లి దగ్గరకు వెళ్ళి పోయింది. లక్ష్మి తన తల్లితో పాటు హైదరాబాద్‌ వచ్చేసింది. చెల్లెళ్లను హాస్టల్లో చేర్పించింది. తల్లీ కూతుళ్లు ఉద్యోగం చేసే దగ్గర ఒక రూమ్‌ ఇచ్చారు. ఇప్పుడు అక్కడే ఉంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ‘నా భార్య నాతో కాపురం చేయడం లేదు. నాకు ఆరోగ్యం బాగోలేదు. అయినా నన్ను చూడటం లేదు’ అంటూ ఆమెకు నోటీసులు పంపించాడు. తెలిసిన వారు చెబితే ఆ నోటీసు తీసుకుని లక్ష్మి ‘ఐద్వా’ దగ్గరకు వచ్చింది.
మేము అంజయ్యను పిలిచి మాట్లాడాము. అతను ముందు ‘నా తప్పు ఏమీ లేదు. తప్పంతా ఆమెదే’ అని చెప్పాడు. అతనికి ఆస్పత్రిలో చికిత్స చేయించిన పేపర్లు, బాబును దత్తత తీసుకున్న పేపర్లు అన్నీ మాకు చూపించింది. వాటిని చూసి అతన్ని ప్రశ్నిస్తే ‘మేడం నాలో లోపం వుంది. అందుకే నా మొదటి భార్య వదిలేసి వెళ్ళింది. చికిత్స తీసుకుంటే నయం అవుతుంది అని లక్ష్మీని పెండ్లి చేసుకున్నాను. కానీ నా సమస్యకు ఎలాంటి చికిత్సా లేదని డాక్టర్లు చెప్పారు. అయినా ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భార్యగా నన్ను చూసుకోవాల్సిన బాధ్యత ఆమెదే కదా! అందుకే నోటీసులు పంపించాను’ అన్నాడు.
‘నువ్వు ఏ రోజైనా ఆమెకు భర్తగా ఉన్నావా? మోసం చేసి పెండ్లి చేసుకున్నావు. నీలో లోపం వుందని తెలిసి కూడా ఆమె నీతోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఆస్పత్రికి కూడా తీసుకెళ్ళింది. ఎలాంటి ప్రయోజనం లేదన్నా నీకు అండగా నిలబడింది. అయినా నువ్వేం చేశావు. ఆమెను అనుమానిస్తూనే ఉన్నావు. నీకు ఎన్ని సేవలు చేసినా నీ బుద్ధి మారలేదు. చివరకు బాబును దత్తత తీసుకుంటే ఆ విషయంలో కూడా అనుమానించావు. ఇక నీతో ఆమె ఎలా ఉంటుంది? ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి చూసుకోనే బాధ్యత తనదే అంటున్నావు. నోటీసు పంపించి మంచి పనే చేశావు. కోర్టులో నీలో లోపం వుందని తెలిస్తే నువ్వే ఆమెకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది. ఆ డబ్బుతో లక్ష్మి, బాబు హాయిగా బతకొచ్చు. ఇక నీకు నచ్చినా, నచ్చకపోయినా ఆమె నీ నుండి విడాకులు తీసుకుని ప్రశాతంగా ఉండొచ్చు’ అని చెప్పాము. దాంతో అతను మరో మాట మాట్లాడలేదు.
అంజయ్య తల్లిదండ్రులతో మాట్లాడి లక్ష్మికి అర్ధ ఎకరం పొలం రాయించాము. ‘నీకు జీవితం చాలా ఉంది. వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుని హాయిగా ఉండు. నిన్నూ, బాబును కూడా చూసుకునే వ్యక్తిని చూసి పెండ్లి చేసుకో. మీ చెల్లెళ్ల కోసం ఆలోచించే పని లేదు. వాళ్లిద్దరూ హాస్టల్లో వుండి బాగా చదువుకుంటున్నారు. నువ్వు నీ జీవితం, బాబు గురించే ఆలోచించు. మనిషికి బతకడానికి తిండి ఎంత అవసరమో, జీవితంలో ఒక తోడు కూడా అంతే అవసరం. నీ తర్వాత బాబును చూసుకోవడానికి అయినా నీ జీవితంలోకి మరో వ్యక్తిని ఆహ్వానించు’ అని చెప్పి పంపించాము.
నువు ఏ రోజైనా ఆమెకు భర్తగా ఉన్నారా? మోసం చేసి పెండ్లి చేసుకున్నావు. నీలో లోపం వుందని తెలిసి కూడా ఆమె నీతోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఆస్పత్రికి కూడా తీసుకెళ్ళింది. ఎలాంటి ప్రయోజనం లేదన్నా నీకు అండగా నిలబడింది. అయినా నువ్వేం చేశావు. ఆమెను అనుమానిస్తూనే ఉన్నావు. నీకు ఎన్ని సేవలు చేసినా నీ బుద్ధి మారలేదు. చివరకు బాబును దత్తత తీసుకుంటే ఆ విషయంలో కూడా అనుమానించావు. ఇక నీతో ఆమె ఎలా ఉంటుంది? ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి చూసుకోనే బాధ్యత తనదే అంటున్నావు. నోటీసు పంపించి మంచి పనే చేశావు. కోర్టులో నీలో లోపం వుందని తెలిస్తే నువ్వే ఆమెకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది. ఆ డబ్బుతో లక్ష్మి, బాబు హాయిగా బతకొచ్చు.
– వై. వరలక్ష్మి, 9948794051

Spread the love