17న హైఅలర్ట్‌

High alert on 17th– రాజధానిలో పోలీసులకు బిగ్‌ టాస్క్‌
– ఒకే రోజు గణేశ్‌ నిమజ్జనం, ప్రజా పాలన, విమోచన దినం, ఎంఐఎం కార్యక్రమాలు
– 25వేల మందికి పైగా పోలీసులతో బందోబస్తు
– ఇంటెలిజెన్స్‌ డేగ కన్ను
– కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం : ‘నవతెలంగాణ’తో డీజీపీ జితేందర్‌
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర రాజధానిలో ఈనెల 17న గణేశ్‌ నిమజ్జనోత్సవంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజాపాలన’, కేంద్రం ‘హైదరాబాద్‌ విమోచన దినం’, ఎంఐఎం ర్యాలీలు ఉండటంతో పోలీసులు ఉన్నతాధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. ఒకేరోజు అత్యంత ప్రాధాన్యత కలిగిన నాలుగు కార్యక్రమాలు ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 25వేల మందికిపైగా పోలీసులతో హైదరాబాద్‌ నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికా రులు చేస్తున్నారు. ప్రతి సంవత్సరంలానే నగరంలో పాతబస్తీ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు వేలాది గణపతి విగ్రహాల నిమజ్జన ఊరేగింపు సాగటం, ఇందులో లక్షలాది మంది ప్రజలు పాల్గొనటం విదితమే. ప్రతి ఏడాదీ నిమజ్జన ఊరేగింపు మాత్రమే జరిగే రోజుల్లో ఇతర ఏ కార్యక్రమాలు జరిగేవి కావు. అప్పుడప్పుడు మిలాద్‌-ఉన్‌-నబీ పండుగ కూడా ఒకే రోజు వచ్చేది. ఈ సారి ఏకంగా నాలుగు ప్రధాన కార్యక్రమాలు ఒకేరోజు రావటం, అవన్నీ హైదరాబాద్‌ కేంద్రంగానే జరుగుతుండటంతో శాంతిభద్రతల పరంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడటం పోలీసు ఉన్నతాధికారులకు సవాలుగా మారింది. మంగళవారం రోజునే ఒకపక్క నిమజ్జనోత్సవం ఉండగా, మరోవైపు కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌ విమోచన దినోత్సవం బహిరంగ సభను పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నది. ఇంకోపక్క, రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ప్రజా పాలన సభను చేపట్టగా, పాతబస్తీలో సెప్టెంబర్‌ 17ను పురస్కరించుకొని ఎంఐఎం పార్టీ కూడా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నది. ఈ కార్యక్రమాలన్నీ కూడా శాంతియుత వాతావరణంలో నిర్వహించే ప్రధాన బాధ్యత పోలీసుల భుజస్కంధాలపై ఉన్నది. ఈ నేపథ్యంలో 17న హైదరాబాద్‌లో నిర్వహించాల్సిన పోలీసు బందోబస్తుపై సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. రాష్ట్ర డీజీపీ జితేందర్‌ శనివారం హైదరాబాద్‌ నగరంలో కమిషనర్‌ సి.వి ఆనంద్‌ ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి గణేశ్‌ నిమజ్జన ఊరేగింపు మార్గంలో చేపడుతున్న బందోబస్తు గురించి స్వయంగా తిరిగి తెలుసుకున్నారు. అలాగే, ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎంఐఎం పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఏర్పాటు చేస్తున్న భద్రతపై కూడా ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. 25వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నప్పటికీ.. అవసరమైతే అదనపు పోలీసు బలగాలను తరలించటానికి కూడా తాము సిద్ధంగా ఉన్నట్టు డీజీపీ.. నగర పోలీసు కమిషనర్‌కు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనీ, ప్రతి క్షణం పరిస్థితులను ఉన్నతాధికారులు కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా గమనిస్తూ ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుతమున్న ఐపీఎస్‌ అధికారులేగాక గతంలో హైదరాబాద్‌లో నిమజ్జనోత్సవ బందోబస్తు అనుభవం ఉండి, ఇతర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న అదనపు ఎస్పీలు మొదలుకొని ఇన్‌స్పెక్టర్ల వరకు అధికారులను కూడా ఈ ప్రధాన బందోబస్తులో వినియోగించేలా డీజీపీ ఆదేశాలిచ్చారు. అలాగే, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధులలోనూ నిమజ్జనోత్సవ వేడుకల సందర్భంగా అపశృతులు దొర్లకుండా జాగ్రత్తలను తీసుకోవాలని ఆయన ఇరు కమిషనరేట్ల సీపీలు అవినాశ్‌ మహంతి, సుధీర్‌బాబులను ఆదేశించారు. సంఘ విద్రోహ శక్తుల కదలికలపై నిరంతరం నిఘా వేసి ఉంచేలా ఇంటెలిజెన్స్‌ విభాగం అప్రమత్తంగా ఉండాలని ఆయన నిఘా విభాగం చీఫ్‌ సూర్యారెడ్డిని కోరారు. మొత్తమ్మీద, 17వ తేదీ కార్యక్రమాలు సజావుగా సాగేలా చూడటానికి డీజీపీ కార్యాలయం నుంచి కూడా అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ పర్యవేక్షణ జరిపేలా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌లో 17న జరిగే గణేశ్‌ నిమజ్జనోత్సవం మొదలుకొని మూడు ప్రధాన కార్యక్రమాలు సవ్యంగా సాగటానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామని డీజీపీ జితేందర్‌ ‘నవతెలంగాణ’తో మాట్లాడుతూ తెలిపారు. ఇందుకు పోలీసులు అవసరమైన వ్యూహాలను రచించి, అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారు ఎంతటివారైనా వదిలిపెట్టబో మని ఆయన హెచ్చరించారు. 16న జరిగే మిలాద్‌-ఉన్‌-నబీ పండుగకు సైతం తగిన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్‌ సి.వి ఆనంద్‌ తెలిపారు.

Spread the love