– మూసివేతకు ఉత్తర్వులు ఇస్తామని హెచ్చరిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. పీసీబీపైనే అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయనీ, ప్రజలు ఇచ్చే వినతి పత్రాలపై చర్యలు తీసుకోకపోవడంతో వారంతా కోర్టుకు వస్తున్నారని చెప్పింది. పీసీబీ సరిగ్గా పనిచేయకపోతే దానిని మూసేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి రికమండ్ చేస్తామని హెచ్చరించింది. కోర్టు ఆఫీసర్‌ను నియమించి పీసీబీని నడిపిస్తామనీ ఘాటు వ్యాఖ్య చేసింది. డ్యూటీ సరిగ్గా చేయనప్పుడు పీసీబీ ఉండి ఉపయోగం ఏముంటుందని ప్రశ్నించింది. పీసీబీ చైర్మెన్ ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశాలిస్తామని హెచ్చరిక చేసింది. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్దిష్ట గడువు నిర్ణయించాలనీ, అలా చేయని అధికారి జీతం నుంచి కోత విధించేలా చేయాల్సి వస్తుందని చెప్పింది. సూర్యాపేటలో మై హౌం ఇండిస్టీ విస్తరణకు అనుమతుల్లో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం పీసీబీ జులై 27న జారీ చేసిన నోటీసులను సూర్యాపేట జిల్లా మేళ్లచెరువుకు చెందిన ఏ వెంకటేశ్వర్లు ఇతరులు సవాల్ చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ వినోద్‌కుమార్‌ల డివిజన్ బెంచ్ పైవిధంగా పీసీబీపై నిప్పులు చెరిగింది. సీనియర్ అడ్వొకేట్ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ, మై హౌం ఇండిస్టీస్ విస్తరణ నిమిత్తం దరఖాస్తు చేసుకుందని సున్నపురాయి గనుల లీజులకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం జులై 27న నోటీసులు జారీ చేసిందన్నారు. ఒకేసారి మూడు చోట్ల ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారని, వాటిని వేర్వేరు ప్రాజెక్టులుగా పరిగణించకూడదని చెప్పారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ మై హౌం ఇండిస్టీస్ మూడు దరఖాస్తులు చేసుకుందనీ, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మెమోరాండం ప్రకారం ఈ కేసులో వేర్వేరు ప్రజాభిప్రాయ సేకరణ సరికాదంది. 10.30, 12.30, 3 గంటలకు వేర్వేరుగా కాకుండా పదిన్నర గంటలకు ప్రజాభిప్రాయ సేకరణ మొదలుపెట్టి మూడింటిపైన ఒకేచోట అభిప్రాయ సేకరణ చేయాలంది. దీనిపై వివరాలు అందజేయాలని పీసీబీని ఆదేశించి విచారణను వాయిదా వేసింది.
తప్పుడు రికార్డులు సమర్పిస్తారా? అధికారులపై హైకోర్టు మండిపాటు
మల్లన్నసాగర్ నిర్వాసితుల కోసం సిద్ధిపేట జిల్లా ముట్రాజ్‌పల్లిలో భూసేకరణకు చెందిన గెజిట్ జారీలో తప్పుడు రికార్డులు సమర్పించిన అధికారులపై హైకోర్టు విరుచుకుపడింది. వారు ఉద్దేశ్యపూర్వకంగానే కోర్టును తప్పుతోవ పట్టించారని పేర్కొంది. ఏడాది వివరాలు ఒకే చేతి రాత, ఒకే ఇంక్‌తో ఎలా రాశారని నిలదీసింది. ఇదంతా ఇటీవల తయారు చేసిన రికార్డులా కనిపిస్తుందని అభిప్రాయపడింది. ఈ విషయాన్ని పరిగణిస్తున్నామనీ, అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. ముట్రాజ్‌పల్లిలో సర్వే నంబర్ 326, 331కు సంబంధించిన భూసేకరణ రికార్డులను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది. ఆర్‌అండ్‌ఆర్ కాలనీ కోసం 102 ఎకరాల భూ సేకరణ నిమిత్తం 2021, జనవరి 31న ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ బాలాజీ స్పిన్నర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని సింగిల్ జడ్జి కొట్టివేయడంతో, అప్పీల్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్ డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు గెజిట్ జారీకి సంబంధించిన రిజిస్టర్‌ను ప్రభుత్వ న్యాయవాది అందజేశారు. రిజిస్టర్‌ను పరిశీలించిన హైకోర్టు పైవిధంగా నిప్పులు చెరిగింది. భూసేకరణ రికార్డులను సమర్పించడానికి మూడు వారాల గడువు కావాలని ప్రభుత్వం కోరగా హైకోర్టు నిరాకరించింది. సెప్టెంబరు 4వరకు గడువు ఇచ్చింది.