నవతెలంగాణ-హైదరాబాద్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు 1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఓసారి పరీక్ష రద్దై.. మళ్లీ నిర్వహించిన తరువాత.. తాజాగా మరోసారి కూడా రద్దు చేస్తున్నట్టు తెలంగాణ హైకోర్టు ఇటీవలే పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా టీఎస్పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓవైపు ఉద్యోగాలు రాక చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే. రాజ్యాంగ బద్ధ సంస్థ అయి ఉండి పరీక్షల నిర్వహణలో పదేపదే టీఎస్పీఎస్సీ విఫలమవుతుందని హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదటిసారి పేపర్ లీకేజ్ తో పరీక్ష రద్దు చేశారని.. రెండోసారి నిర్వహించే సమయంలోనూ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహించారని హై కోర్టు ఆక్షేపించింది. గ్రూప్ – 1 పరీక్షలో బయోమెట్రిక్ పెట్టకపోవడానికి కారణాలేంటని హై కోర్టు నిలదీసింది. మధ్యాహ్నం 2:30 లోపు టీఎస్పీఎస్సీ నుంచి ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకోవాలని అడ్వకేట్ జనరల్ కు హై కోర్టు ఆదేశించింది. బయోమెట్రిక్ అమలు చేయడం వల్ల మీకు ఇబ్బందేంటి? ఇంతకు ముందు బయోమెట్రిక్ అమలు చేసినప్పుడు నిర్వహించిన పరీక్షల వివరాలను సమర్పించండి. నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా బయోమెట్రిక్ ఎందుకు అమలు చేయలేదు? మీరు ఇచ్చిన నోటిఫికేషన్‌ని మీరే అమలు చేయకపోతే ఎలా? ఒకసారి పరీక్ష రద్దు అయిన తర్వాత.. మరోసారి పరీక్ష నిర్వహించాలంటే చాలా అప్రమత్తంగా ఉండాలి కదా? నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత టీఎస్‌పీఎస్సీపైన ఉంది. తాజా ఘటనలతో అభ్యర్థుల భవిష్యత్తు, టీఎస్పీఎస్సీ ప్రతిష్ఠ ప్రశ్నార్థకంగా ఉన్నాయని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.