నెంబర్ ప్లేట్ లేదని చీటింగ్ కేసు.. హైకోర్టు ఫైర్

నవతెలంగాణ – హైదరాబాద్: నగరంలో రోజుకు కొన్ని లక్షల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అందులో కొందరు రాంగ్ రూట్లలో వెళ్తుంటారు. మరికొందరు సిగ్నల్ జంప్ చేస్తుంటారు. మరికొందరు హెల్మెట్ లేకుండా, త్రిపుల్ రైడ్ చేస్తూ పోలీసులకు దొరికిపోతుంటారు.ఈ మధ్యకాలంలో ట్రాఫిక్‌లో సీసీ కెమెరాలు నేరుగా నిబంధనలు అతిక్రమించిన వాహనదారుడి నెంబర్‌ను కాప్చర్ చేసి కంట్రోల్ రూంకు పంపిస్తుంటుంది. మరికొన్ని చోట్ల ట్రాఫిక్ పోలీసులే కెమెరాలతో ఫోటోలు తీస్తున్నారు. అయితే, కొందరు ఈ మధ్యకాలంలో నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపై తిరుగుతున్నారు. ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు కొందరు ఇలాంటి వాటికి అలవాటు పడ్డారని భావించిన ట్రాఫిక్ పోలీసులు వారిపై కేసులు పెడుతున్నారు. అయితే, ఇటువంటి కేసులో హైకోర్టు చార్మినార్ ట్రాఫిక్ పోలీసులపై సీరియస్ అయ్యింది. ఎందుకంటే వారు నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపాడని అతనిపై ఐపీసీలోని సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు పెట్టారు. దీనిపై విచారించిన కోర్టు ఇలాంటి వాటికి ఎవరైనా చీటింగ్ కేసు పెడతారా? అని మందలించింది.నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే జరిమానా విధించాలని లేదా సంబంధిత సెక్షన్ల కింద కేసు పెట్టాలని సూచించింది. సెక్షన్ 420, 80ఏ కూడా ఈ కేసులో వర్తించదని స్పష్టంచేస్తూ కేసును కొట్టేసింది.

Spread the love