నవతెలంగాణ – హైదరాబాద్: పత్రికల్లో పనిచేసే వారికి ప్రభుత్వ గుర్తింపు (అక్రిడిటేషన్) కార్డుల జారీలో చిన్న పత్రికలను ఎ, బి, సి, డిలుగా విభజించడం చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి జీవో 239 షెడ్యూలు-ఇలోని నిబంధలను కొట్టివేసింది. అక్రిడిటేషన్‌కు సంబంధించి 2016లో జారీచేసిన జీవోలోని నిబంధనలు వివక్షాపూరితంగా ఉన్నాయని, వాటిని కొట్టివేయాలంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన టి.కృష్ణ మరో ముగ్గురు 2016లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనల వల్ల చిన్నపత్రికల్లో పనిచేసే జిల్లా, నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ప్రయోజనాలు లభించడంలేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం చిన్న పత్రికలను విభజించడానికి ప్రభుత్వం సహేతుక కారణాలను పేర్కొనలేదని, ఆ నిబంధనలు చెల్లవని స్పష్టం చేసింది. రెండు నెలల్లో చిన్న పత్రికల జిల్లా, నియోజకవర్గ విలేకరులకు ప్రయోజనం కలిగించేలా మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది.