ఒంటరి మహిళలకు ప్రత్యేక పరిహారం ఇవ్వాల్సిందే : హైకోర్టు

నవతెలంగాణ హైదరాబాద్‌: మల్లన్నసాగర్‌ నిర్మాణంలో భాగంగా అందిస్తున్న పునరావాస, పునర్నిర్మాణ పథకంలో వృద్ధులకూ ప్రత్యేకంగా పరిహారం చెల్లించాల్సిందేనని హైకోర్టు చెప్పింది. చట్టప్రకారం వృద్ధులను ప్రత్యేక కుటుంబంగానే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. కుటుంబానికి పరిహారం చెల్లించామంటూ.. తమకు ప్యాకేజీ కల్పించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌, వేములఘాట్‌కు చెందిన పలువురు వృద్ధులు హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ ముమ్మినేని సుధీర్‌కుమార్‌ విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిమిత్తం ఏటిగడ్డ కిష్టాపూర్‌, వేములఘాట్‌ గ్రామాలతోపాటు 2 వేల ఎకరాలకుపైగా భూములను 2016-19 మధ్య సేకరించారన్నారు. భూసేకరణ చట్టంలోని సెక్షన్‌ 38 ప్రకారం పిటిషనర్లకు పరిహారం చెల్లించకుండా రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించారన్నారు. కుమారులకు పరిహారం చెల్లించామన్న కారణంగా వృద్ధులైన వితంతువులు, భార్య చనిపోయినవారికి చెల్లించడం లేదన్నారు.
ఇండ్లు ఉన్న వృద్ధులకు భూసేకరణలో భాగంగా పరిహారం వారిపేరుతోనే చెల్లించారని, పునరావాస ప్యాకేజీ కింద మాత్రం వారిని మినహాయించి కుమారుల పేరుతో ఇచ్చినట్టు తెలిపారు. ప్రభుత్వం జీవో 120 కింద రూ.7.5 లక్షలతోపాటు ఇళ్లు మంజూరు చేసిందన్నారు. కాగా ఎక్కువ మంది 65 ఏళ్లకు పైబడిన వితంతువులు, భార్యను కోల్పోయిన వారు ఉన్నారని, తమకు ఇళ్లు లేక కుమారులు, బంధువుల ఇళ్లలో నివాసం ఉండాల్సి వస్తోందన్నారు. కొందరికి మాత్రమే సొంత ఇళ్లుండగా.. ఉన్నాయని, వాటిని భూసేకరణలో భాగంగా తీసుకున్నారని.. యాజమాన్యం, కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నారన్న దానితో సంబంధం లేకుండా చట్టప్రకారం పునరావాస బాధితులుగా గుర్తించి పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ జీవో 120 ప్రకారం కుటుంబానికి మొత్తం పరిహారం చెల్లించామన్నారు. కుటుంబం అంగీకారంతోనే పునరావాస ప్యాకేజీ కల్పించినట్లు తెలిపారు. అలా వద్దనుకుంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కుటుంబానికి 250 గజాల్లో రెండు పడకల గదుల ఇంటితోపాటు రూ.7.5 లక్షలు ఇచ్చామన్నారు. కేంద్ర చట్టం ప్రకారం పరిహారం 100 గజాల్లో సింగిల్‌ బెడ్‌రూం ఇళ్లు, రూ.6.50 లక్షలు మాత్రమే ఉంటుందన్నారు. ఒంటరిగా ఉన్న వృద్ధులకు ప్యాకేజీ చెల్లించినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి చట్టప్రకారం వృద్ధులకు ప్రత్యేకంగా పునరావాస ప్యాకేజీ కింద పరిహారం అందజేయాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.

Spread the love