నవతెలంగాణ – హైదరాబాద్: ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇస్కాన్, యాదవ సంఘాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. విచారణ చేపట్టిన ఉన్నతన్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎన్టీఆర్ విగ్రహం పెట్టొద్దని స్టే విధించింది. పువ్వాడ అజయ్ సహా నిర్వాహకులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఖమ్మం లకారం చెరువులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కృష్ణావతార విగ్రహం ఏర్పాటు చేయాలని అభిమానులు నిర్ణయించారు. ఎన్టీఆర్ వందో జయంతి సందర్భంగా మే 28న దీనిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ 54 అడుగుల విగ్రహాన్ని రూ.2.3 కోట్లతో నిజామాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. లకారం చెరువు మధ్యలో తీగల వంతెన వద్ద ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. విగ్రహాన్ని జూనియర్ ఎన్టీఆర్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే విగ్రహం తయారీ పనులు తుదిదశకు చేరినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టు స్టే ఇచ్చింది.