వైద్యవిద్యలో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్‌ ఇవ్వాలి: హైకోర్టు

నవతెలంగాణ-హైదరాబాద్ : ట్రాన్స్‌జెండర్లకు వైద్య విద్య ప్రవేశాల్లో రిజర్వేషన్‌ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ట్రాన్స్‌జెండర్‌ కోటా కింద పీజీ మెడికల్‌ సీటు ఇవ్వకపోవడాన్ని సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ కొయ్యల రూత్‌ జాన్‌పాల్‌ వేసిన పిటిషన్‌పై హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌ తుకారాంజీ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ)కి లేదని, దీనిపై ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని ఎన్‌ఎంసీ న్యాయవాది పూజిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది ప్రవీణ్‌కుమా ర్‌ స్పందిస్తూ.. రిజర్వేషన్లకు ఎన్‌ఎంసీ మార్గదర్శకాలు రూపొందిస్తే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దీంతో పిటిషనర్‌కు ఎస్సీ కోటాలో లేదా ఓబీసీ కోటాలో రిజర్వేషన్‌ కల్పించాలని, లేదంటే ట్రాన్స్‌జెండర్‌ కోటాలో రిజర్వేషన్‌ కల్పించే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను జూలై 20కి వాయిదా వేసింది.

Spread the love