మహిళా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

– బాలికల విద్యను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్‌ : మహిళా కమిషన్‌ చైర్మెన్‌ సునీతా లక్ష్మారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే వారి సాధికారత సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాకిటి సునితా లక్ష్మారెడ్డి అన్నారు. మహిళా శిశు సంక్షేమానికి, రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యనిస్తున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట మహిళా కమిషన్‌, జాతీయ మహిళా కమిషన్‌ సారథ్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ‘మహిళల హక్కులు సాధికారతలో భాగంగా ఉపాధి ద్వారా మహిళా సాధికారత’ అనే అంశంపై బుధవారం సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు సంపూర్ణ విద్యావంతులు కావాలనే లక్ష్యంతో దేశంలోనే బాలికల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని వివరించారు. అందులో భాగంగానే పాఠశాలలను నెలకొల్పిందని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పరీక్షల్లో అమ్మాయిలు ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారనీ, ఇది మంచి పరిణామమని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలు బాలికలకు అండగా ఉన్నాయని చెప్పారు.
మహిళల అభివృద్ధితోనే సమాజం ముందుకెళ్తుందని అన్నారు. లింగ వివక్షతలేని సమాజ నిర్మాణం జరిగినప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధిని సాధిస్తుందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రారంభించిందని వివరించారు.
మహిళలకు ఎలాంటి సమస్య వచ్చినా తక్షణమే మహిళా కమిషన్‌ దృష్టికి తేవాలనీ, అప్పుడే సత్పర న్యాయం అందేలా చూస్తామని అన్నారు. ఏ సమస్య వచ్చినా 100, 181 లేదా మహిళా కమిషన్‌ వాట్సాప్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 9490555533 ఫోన్‌ చేయొచ్చని కోరారు.
ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్‌ సభ్యులు కుమ్ర ఈశ్వరీబారు, కటారి రేవతిరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ శారద, కార్యదర్శి కృష్ణకుమారి, డీఆర్డీఓ డీపీఎం స్వర్ణలత, హైకోర్టు అడ్వకేట్‌ మంజూష పాల్గొన్నారు.

Spread the love