బ్లాక్‌ ఇంక్‌పై హిండెన్‌బర్గ్‌ బాంబు

– ట్విటర్‌ మాజీ బాస్‌ డోర్సే అక్రమాలు వెల్లడి
న్యూఢిల్లీ : గౌతం అదానీ మోసాలపై రిపోర్ట్‌ తయారు చేసి ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని కుదిపేసి భారత్‌లో పెను సంచలనం సృష్టించిన అమెరికన్‌ షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ తాజాగా ట్విట్టర్‌ మాజీ సీఈఓ జాక్‌ డోర్సీపై పడింది. డోర్సే ఆధ్వర్యంలోని మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవల సంస్థ బ్లాక్‌ ఇంక్‌ భారీ అక్రమాలకు పాల్పడిందని వెల్లడించింది. దీనికి సంబంధించి గురువారం ఓ రిపోర్టును విడుదల చేసింది. బ్లాక్‌ ఇంక్‌కు చెందిన ‘అండర్‌ బ్యాంక్‌’పై తాము రెండేండ్ల పాటు చేపట్టిన పరిశోధనలో అనేక అక్రమాలు గుట్టురట్టు అయ్యాయని తెలిపింది. ముఖ్యంగా తమ ఖాతాదారులను ఎక్కువగా చూపించి వారి ఖర్చులను తక్కువ చేసిందని ఆరోపించింది. తప్పుడు గణంకాలు, లేని వినియోగదారుల సంఖ్యతో పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించిందని తెలిపింది. ఇది బ్లాక్‌ వ్యాపారం వెనకున్న మాయాజాలం అని వ్యాఖ్యానించింది. ఈ రిపోర్టుతో అమెరికన్‌ మార్కెట్ల ప్రారంభంలోనే బ్లాక్‌ ఇంక్‌ షేర్లు 20 శాతం పైగా పడిపోయాయి. జాక్‌ డోర్సే 2009లో బ్లాక్‌ ఇంక్‌ని స్థాపించారు. ఈ కంపెనీ టెక్నాలజీకి సంబంధించినది. బ్లాక్‌ ఇంక్‌ని గతంలో స్వ్చేర్‌ అని పిలిచేవారు. కంపెనీ మార్కెట్‌ కాపిటలైజేషన్‌ దాదాపు 44 బిలియన్‌ డాలర్లు. ‘బ్యాంకు లేని’ ‘అండర్‌బ్యాంకింగ్‌’ వ్యక్తులకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఈ మొబైల్‌ బ్యాంకింగ్‌ను ఏర్పాటు చేశారు.అదానీ గ్రూపు అక్రమాలపై సరిగ్గా రెండు నెలల క్రితం హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ను వెలువరించింది. ఈ సంస్థ ప్రచురించిన నివేదిక గౌతమ్‌ అదానీ సామ్రాజ్యాన్ని కుదిపేసింది. ప్రపంచంలోని టాప్‌-10 సంపన్నుల జాబితాలో చేరిన అదానీ సంపద 60 శాతం మేర పడిపోయింది. నాథన్‌ ఆండర్సన్‌ నేతృత్వంలోని షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ 2017 నుంచి ప్రపంచ వ్యాప్తంగా 17 కంపెనీలలో జరిగిన తప్పులు, అవకతవకలపై తన నివేదికను విడుదల చేసింది. బ్లాక్‌ సంస్థ ”అండర్‌ బ్యాంక్‌” ఖాతాదారుల్లో ఎక్కువమంది నేరస్థులు లేదా అక్రమ కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తులున్నారని ఆరోపించింది. మోసం, ఇతర స్కామ్‌ల నిమిత్తం ఖాతాలను భారీగా సష్టించడం, ఆపై అక్రమ నిధులను త్వర త్వరగా మళ్లించడం చేసిందని తెలిపింది. తాము సమీక్షించిన ఖాతాల్లో 40 శాతం నుంచి 75 శాతం నకిలీవి, మోసానికి పాల్పడినవీ లేదా ఒకే వ్యక్తితో ముడిపడి ఉన్న అదనపు ఖాతాలని హిండెన్‌బర్గ్‌ వెల్లడించింది. దాదాపు ఆరు దేశాల్లో కంపెనీ కార్యాలయాలను పరిశీలించిన తర్వాతే ఈ పరిశోధన నివేదికను వెల్లడిస్తున్నామని తెలిపింది.

Spread the love