హిందువులు, ముస్లింలంటూ రాజకీయాలు చేయను

Like Hindus and Muslims I don't do politics– అలా చేస్తే ప్రజాజీవితంలో కొనసాగే అర్హత కోల్పోతా
– గోద్రా అల్లర్ల పేరుచెప్పి నా ప్రతిష్టను ప్రత్యర్థులు దెబ్బతీశారు : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : లోక్‌ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను చేసిన (‘అధిక సంతానం ఉన్నవారు’) వ్యాఖ్యలపై ప్రధాని మోడీ వివరణ ఇచ్చారు. తాను ముస్లింలను ఉద్దేశించి అనలేదనీ, అధిక సంతానంతో ఇబ్బంది పడుతున్న ప్రతి పేద కుటుంబం గురించి ఆ మాటలు అన్నానని స్పష్టం చేశారు. ఒకవేళ హిందూవులు, ముస్లింలంటూ తాను వేరు చేసి మాట్లాడితే ఆ రోజు నుంచి ప్రజాజీవితంలో కొనసాగే అర్హత కోల్పోతానని వ్యాఖ్యానించారు. ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై ప్రధాని సుదీర్ఘంగా మాట్లాడారు. ”నేను ముస్లింల పట్ల ప్రత్యేక ప్రేమ కనబరచను. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నేను పనిచేయను. అందరితో కలసి అందరి అభివృద్ధి అనే నినాదాన్నే నమ్ముతాను. కానీ నేను ఆ మాటలు అన్నట్టు ప్రచారం కావడం నన్ను షాక్‌ కు గురిచేసింది. అధిక సంతానం ఉన్నవారి గురించి నేను మాట్లాడితే అది ముస్లింలను ఉద్దేశించే అని ఎవరు చెప్పారు? పేద కుటుంబాలన్నింటిలోనూ ఈ పరిస్థితి నెలకొన్నది. పేదరికం ఉన్న చోట మతంతో సంబంధం లేకుండా అధిక సంతాన సమస్య ఉంటుంది. నేను హిందువు, ముస్లిం పేరు ఎత్తలేదు. ఎందరు పిల్లల బాగోగులు చూసుకోగలరో అంతమందినే కనాలి. ప్రభుత్వమే మీ పిల్లల బాగోగులు చూసుకోవాలనే పరిస్థితి కల్పించకూడదు” అని మోడీ వ్యాఖ్యానించారు. తాను గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు 2002లో గోద్రా రైలు దహనం ఘటన అనంతరం అల్లర్ల పేరుచెప్పి ముస్లింలలో తనకున్న ఇమేజ్‌ ను తన రాజకీయ ప్రత్యర్థులు చెడగొట్టారని మోడీ చెప్పారు.

Spread the love