చెక్‌ కార్మికుల చారిత్రాత్మక సమ్మె

పొదుపు చర్యలపై పోటెత్తిన ప్రజాగ్రహం
ప్రేగ్‌ : నయా ఉదారవాద విధానాల్లో భాగమైన పొదుపుచర్యలకు వ్యతిరేకంగా పూర్వ కమ్యూనిస్టు దేశం చెక్‌ రిపబ్లిక్‌లో కార్మికవర్గం ఉద్యమించింది. కార్పొరేట్లకు వరాలు, సామాన్యులపై భారాలు మోపుతూ ప్రభుత్వం పలు ప్రతిపాదనలను తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించింది. దీనిపై కార్మిక సంఘాలు సోమవారం నుంచి దేశవ్యాపితంగా మెరుపు సమ్మెకు దిగాయి.. కమ్యూనిజం నుంచి వైదొలగిన తరువాత చెక్‌ రిపబ్లిక్‌లో ఇంత పెద్ద యెత్తున నిరసనలు చోటుచేసుకోవడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం. ఆర్థిక సంస్కరణల పేరుతో బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి భారీగా కోతలు పెట్టడం, సామాన్యులకు పన్నుల వాతలు, నిరుద్యోగం, అధిక ధరలు, వీటికి తోడు ఉద్యోగుల వయోపరిమితిని 68 సంవత్సరాల కు పెంపు వంటి ప్రజా వ్యతిరేక చర్యలకు పీటర్‌ ఫియాలా ప్రభుత్వం ఒడిగట్టింది. దీనికి వ్యతిరేకంగా దేశంలోనే అతి పెద్ద కార్మిక సంఘమైన చెక్‌ మొరావి యా కార్మిక సంఘాల సమాఖ్య (సిఎంకెఓఎస్‌) సమ్మెకు పిలుపునిచ్చింది. దీనికి అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వమైన మద్దతు లభించింది. సికెఎంఓ ఎస్‌ ప్రతినిధి జోసెఫ్‌ స్ట్రెడులా మంగళవారం నాడు మాట్లాడుతూ, సంస్కరణలపై తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమెందని అన్నారు. చెక్‌ రిపబ్లిక్‌ చరిత్రలోనే ఎన్నడు లేని రీతిలో అత్యంత ఎక్కువగా వున్న ద్రవ్య లోటును తగ్గించేందుకు పొదుపు చర్యలు చేపట్టింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 65 నుంచి 68 ఏళ్లకు పెంచేసింది. వ్యాట్‌ జీరో రేటును రద్దు చేసి, దాదాపు అన్ని ఉత్పత్తులపై వ్యాట్‌ను 10నుండి 21శాతానికి పెంచేసింది. ఈ చర్యలన్నింటి వల్ల ఒక్కో కుటుంబంపై ఏడాదికి సగటున 4వేల యూరోలు అదనపు భారం పడుతోందని ఆయన తెలిపారు. పిల్లల సంఖ్యను బట్టి తల్లులు ఇంకొంచెం ముందుగా రిటైర్‌ కావచ్చు. అయితే పార్లమెంట్‌లో తనకున్న మెజారిటీని ఆసరా చేసుకుని ఈ పొదుపు చర్యలకు ఆమోదం పొందవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది.

Spread the love