చరిత్రా చైతన్యం

Historical consciousnessప్రజా ఉద్యమ చరిత్ర ఎప్పుడూ చైతన్యాన్ని నింపుతూనే ఉంటుంది. ఎందుకంటే అది దుర్మార్గంపై, దోపిడీపై, అన్యాయంపై తిరగబడే పోరాట చరిత్ర కావున. ఒక సంఘటితమైన జన సమూహపు సజీవ సంఘర్షణాంశం కనుక. బతుకు పోరాట మెప్పుడూ ప్రేరణాత్మకమే. అసలు చరిత్రంతా పోరాటాల ఫలితంగా ఏర్పడినదే. అందుకే సెప్టెంబర్‌ 17 వినపడగానే ఒక మహాత్తర ప్రజా సమరగాథ ప్రతిధ్వనిస్తుంది. అందుండి విద్యుత్తులా చైతన్యం మన హృదయంలోకి ప్రవహిస్తుంది. తమను తాము విముక్తం చేసుకోవటానికి సాయుధ పోరాటంలోకి ప్రజలు దుమికిన చారిత్రక ఘటనా జ్ఞాపిక అది. ‘ఒక వ్యక్తిని మరొక వ్యక్తీ, ఒక జాతిని వేరొక జాతీ పీడించే సాంఘిక ధర్మం ఇంకానా? ఇకపై సాగదు’ అంటూ మార్క్స్‌ సిద్ధాంతం ఆచరణాత్మకంగా రుజువు చేసిన పోరాటపు ఆనవాలు అది. సాంస్కృతిక అణచివేతపై ఎగసిన నిరసన, తిరుగుబాటుతో ఆరంభమై, దోపిడీపై సాయుధ పోరుగా పరిణమించిన సామాన్యుల చరిత్ర అందించే చైతన్యాలు కూడా. అలాంటి చరిత్రను మసిపూయాలని యత్నిస్తే వాస్తవాలు తూటాలై పేలుతాయి. వక్రబుద్ధులను దునుమాడుతాయి.
ప్రపంచ చరిత్రలోనే అరుదైన పోరాటంగా పేరొందిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, 1940కు ముందు భారతదేశంలో ఎక్కడా జరగని మహత్తర విప్లవ పోరాటం. ఇది మొదట భాషా సాంస్కృతిక ఉద్యమంగా ఆరంభమయింది. తమ సంస్కృతీ పరమైన భాష, విద్య, సంప్రదాయాలు, జీవన విధానంలోని వ్యవహారాలు అణచివేయబడటంతో, వాటి పరిరక్షణకు తెలంగాణ నేల తిరుగుబాటుకు బీజం వేసింది. ఈ సాంస్కృతిక చైతన్యోద్యమం భూమి సమస్యను తీసుకుని ‘దున్నేవాడికే భూమి’ నినాదంతో భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు జెండాను ఎగరవేసింది. ఇది భారతదేశంలోని వర్గ సమస్యను ప్రధాన ఎజెండాలోకి తీసుకువచ్చింది. భారతావని సాధించాల్సిన విప్లవ కార్యాచరణకు ప్రాతిపదికను ఏర్పరచింది. అశేష ప్రజానీకంలో విప్లవ చైతన్యాన్ని నింపి, దిశానిర్దేశం చేసింది. భాషా సాంస్కృతిక ఉద్యమంగా మొదలైన ఈ ఉద్యమం, విప్లవోద్యమంగా మారటంలో కమ్యూనిస్టులు నిర్వహించిన పాత్ర ప్రధానమైనది. చరిత్ర విస్మరణకు తావులేనిది. ఈ రోజు ఎవరు ఎన్ని తీరులుగా దాన్ని వివరించాలనుకున్నా ఎర్రని జెండా రెపరెపలే చరిత్ర పొడుగునా త్యాగాలనద్దుకుని మెరుస్తాయి. సామాన్యుడు సాయుధుడై యోధుడై నిలిచినా, మట్టి చేతుల మనుషులు మహారచయితలుగా ఉద్యమానికి ఉత్తేజాన్ని నింపినా అది అరుణ పతాకకు మాత్రమే సాధ్యమయిన పని. అందుకే ‘నీ బాంచన్‌ కాల్మొక్తా’ అన్న అణగారిన వర్గాలు నీ గోరీ కడ్తం కొడకా అని నినదించగలిగారు.
ప్రజలను కదిలించడానికి, చైతన్య పరచడానికి సాంస్కృతికమైన అంశాలు చాలా ఉపయోగపడతాయని ఈ పోరాటం ద్వారా మనం తెలుసుకోవచ్చు. వర్గ పోరాటాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోవటానికి సాంస్కృతిక అంశాలను జోడించాల్సిన అవశ్యకత నేడు చాలా ఉన్నది. తెలంగాణ సాయుధ పోరాటంలో సకల జనులను కదిలించడానికి ముందు ఈ సాంస్కృతిక ఉద్యమం చాలా పాత్ర నిర్వహించింది. ‘ఆంధ్ర మహాసభ’ ఒక విశాల ప్రాతిపదికన ప్రజలను జాగరూకపరిచిన సంస్థగా నిలిచింది. నైజాం పాలనలో అందరికీ విద్య అందుబాటులో లేదు. అక్షరాస్యత కేవలం 5శాతం మాత్రమే. ఉర్దూ ఆధిపత్యం రుద్దబడింది. అందుకే గ్రంథాలయోద్యమం, భాషా ఉద్యమం ప్రజలను కదిలించింది. రావిచెట్టు రంగారావు కొమర్రాజు లక్ష్మణరావు, వెంకట రంగారావులు, సురవరం ప్రతాపరెడ్డి, కొండా వెంకటరంగారెడ్డి, మాడపాటి హనుమంతరావులు ఈ కృషిలో ముందున్నారు. 1930లో ఏర్పడిన ఆంధ్రమహాసభ, 1944లో రావినారాయణరెడ్డి ఆధ్వర్యంలో భువనగిరిలో జరిగిన సభ సాయుధ పోరాట చైతన్యాన్ని పొందింది. ఆనాడు జానపద కళలు, సామాన్య కళారూపాలే ప్రజా ఉద్యమానికి, విప్లవ ప్రచారానికి దోహదం చేశాయి. అందులో పాట ప్రధాన ఆయుధంగా తెలంగాణ సాయుధ పోరులో నిలిచింది. ఒక చేతితో గన్నూ, పెన్నూ పట్టిన రచయితలు ఎందరో ప్రజలను ఉత్తేజ పరిచి ఉద్యమంలోకి ప్రేరేపించారు. యాదగిరి, తిరునగరి, సుద్దాల హనుమంతు, మఖ్దూం మొహియుద్దీన్‌ లాంటి కలం యోధులు ఎందరో… జైలు గోడలపైనే నిజాము నిరంకుశత్వాన్ని ఎదిరించిన దాశరథి, వట్టికోట, ప్రజల జీవనాన్ని బాధలను నాటకం చేసిన సుంకర, వాసిరెడ్డి, కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రపంచ కవులను, కళాకారులను ప్రేరేపించిన పోరాటం ఇది. ఆరుద్ర ‘త్వమే వాహం’, సోమసుందర్‌ ‘వజ్రాయుధం’, దాశరథి ‘అగ్నిధార’ కావ్యాలను చదువుతుంటే, హరీంద్రనాధ్‌ చటోపాధ్యాయ పద్యాలను ఉచ్చరిస్తుంటే తెలుస్తుంది సమర తెలంగాణకు సారధులెవ్వరనేది. ఫకీరు సాబు కళారూపంలో బందగీ చరిత్రను విను, ‘వేరు, వేరు, దెబ్బకు దెబ్బ’ అనే సుద్దాల గానం చేసి పల్లవిని అడుగు ఈ నేలను పొంగిన చైతన్యమెవ్వరిదని. ఇప్పటికీ తెలంగాణ వారసత్వంగా మనలోకి ప్రవేహించేది చైతన్యధారనే. అందుకు కారణం వీర తెలంగాణ విప్లవ పోరాటమే.

Spread the love