రాష్ట్ర వ్యాప్తంగా రెండువేల గ్రామాల చరిత్ర నమోదు

– తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌
నవతెలంగాణ-ఖమ్మం
తెలంగాణ సాహిత్య అకాడమి చేపట్టిన ”మన ఊరు -మన చరిత్ర” కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండువేల గ్రామాల చరిత్ర నమోదు అయ్యిందని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ తెలిపారు. ఒక సంవత్సర కాలంగా సాహిత్య అకాడమి డిగ్రీ విద్యార్థులచే సొంత ఊళ్ళ చరిత్రను రాయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అపూర్వమైన స్పందన లభించిందని ఆయన తెలిపారు. మంగళవారం ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బిజిఎన్‌ఆర్‌ కళాశాల విద్యార్థులు రాసిన 568 గ్రామాల చరిత్రను కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌. ముహమ్మద్‌ జాకీరుల్లా విద్యార్థులు కలిసి సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌, జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా గౌరిశంకర్‌ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఎస్‌ఆర్‌ అండ్‌ బిజిఎన్‌ఆర్‌ విద్యార్థులు 568 గ్రామాల చరిత్రను రాయడం ఒక నూతన చరిత్రకు శ్రీకారం చుట్టినట్లయ్యిందని, ఇది గర్వించదగిన విషయమని తెలిపారు. జిల్లా కలెక్టరు గౌతమ్‌ మాట్లాడుతూ చరిత్రను నిర్మిస్తున్న ప్రజలదే అసలు చరిత్ర అన్నారు. ఊరి చరిత్రను రాసిన వారిని ఊరు ఎప్పటికి గుర్తు పెట్టుకుంటుందని ఆయన తెలిపారు. విద్యార్థులు రాసిన 568 గ్రామాల చరిత్ర ప్రతులను కళాశాల ప్రిన్సిపాల్‌ మొహమ్మద్‌ జాకీరుల్లా సాహిత్యఅకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌, కలెక్టర్‌ గౌతమ్‌లకు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ బి.వి.రెడ్డి, వైస్‌-ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.జీవన్‌ కుమార్‌, వైస్‌-ప్రిన్సిపాల్‌ డాక్టర్‌.సీతారాం, డాక్టర్‌ మిల్టన్‌, చరిత్ర శాఖాధ్యక్షులు డాక్టర్‌ జె.రమేష్‌, తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్‌ సర్వేశ్వరరావు, కామర్స్‌ విభాగాధ్యక్షులు డాక్టర్‌ వరలక్ష్మి పాల్గొన్నారు.

Spread the love