– హైదరాబాద్‌లోని హ్యుందారు ఇంజినీరింగ్ సెంటర్ ఆధునీకరణ
– సీఎం రేవంత్‌తో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందారు మోటార్ కంపెనీ, దాని భారతీయ విభాగమైన హ్యుందారు మోటార్ ఇండియా ఇంజినీరింగ్ ప్రయివేట్ లిమిటెడ్ (హెచ్‌ఎంఐఈ) ద్వారా తెలంగాణలో కార్లకు సంబంధించిన మెగా టెస్ట్ సెంటర్‌ను స్థాపించేందుకు యోచిస్తోంది. ఆ సెంటర్‌లో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌక్యం (ఈవీలతో సహా) ఉంటుంది. అలాగే హైదరాబాద్‌లో ఉన్న ఇంజినీరింగ్ కేంద్రం పునరుద్ధరణ, ఆధునీ కరణ, విస్తరణ ద్వారా భారతదేశం హా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మరింత ఉపాధిని ఆ సంస్థ కల్పించనుంది. తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సీఎంతోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అక్కడి సియోల్‌లో హ్యూందారు మోటార్ కంపెనీ అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. చర్చల అనంతరం హెచ్‌ఎంఐఈ ప్రతినిధులు మాట్లాడుతూ… భారతదేశం తమకు చాలా ముఖ్యమైన మార్కెట్ అని తెలిపారు. అక్కడి వినియోగదారుల కోసం బెంచ్‌మార్క్ సెట్టింగ్ ఉత్పత్తులు, సాంకేతిక అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అత్యాధునిక పరీక్షా సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు తమకు అవకాశం కల్పించి ముఖ్యమంత్రి రేవంత్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం మాట్లాడుతూ… తమ ప్రభుత్వం ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించటంపై దృష్టి సారించిందని అన్నారు. హ్యూందారు మోటార్ కంపెనీ తన అనుబంధ సంస్థ అయిన హెచ్‌ఎంఐఈ ద్వారా తెలంగాణలో కార్ టెస్టింగ్ సదుపాయాన్ని కల్పించాలనీ, ఆ మేరకు ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న స్నేహపూర్వక పారిశ్రామిక వధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఆటంకాలు లేని అనుమతుల వ్యవస్థ వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపారం చేసేందుకు హెచ్‌ఎంఐఈ లాంటి అత్యుత్తమ కంపెనీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. హెచ్‌ఎంఐఈ ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించే అవకాశముందని సీఎం ఈ సందర్బంగా అభిప్రాయపడ్డారు.