బీఆర్‌ఎస్‌ ప్రచారంతో హో రెత్తిన ఆర్మూర్

నవతెలంగాణ- ఆర్మూర్: బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి  వినూత్న రీతిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంతో ఆర్మూరు హోరెత్తింది. బీఆర్ఎస్  శ్రేణులంతా ఐక్యంగా కదం తొక్కి రేయనక, పగలనక చేసిన ప్రచారంతో నియోజకవర్గంలో హద్దులు లేని “కారు” జోరుకు ప్రత్యర్థులు బేజారెత్తారు. ఊరూరు, వాడవాడ ల్లో జీవన్ రెడ్డి సుడి గాలి పర్యటనలు చేసి ప్రజలను కలిశారు. ఆర్మూరు పట్టణంతో పాటు గ్రామగ్రామాన ప్రజలు జీవన్ రెడ్డికి నీరాజనాలు పలికారు. ఏ పల్లెల్లో చూసినా మహిళలు బోనాలతో, యువకులు బైక్ ర్యాలీలతో జీవన్ రెడ్డికి బ్రహ్మ రథం పట్టారు. జీవన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజలు టపాసులు కాలుస్తూ, పూల వర్షం కురిపిస్తూ అక్కున చేర్చుకొని ఆదరించారు. పదేళ్ళలో అన్ని గ్రామాలకు తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడమే కాకుండా మళ్లీ గెలిస్తే ఏ చేస్తానో చెప్పి ప్రజలను ఆకట్టు కుంటున్నారు. ఎవరికీ అంతుపట్టని విధంగా వ్యూహాలను అమలు చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డి ప్రత్యర్ధులపై పెద్దగా విమర్శలు చేయకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలనే తన ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా పేర్కొన్నారు.  గ్రామాల అభివృద్ధి నివేదికలను ప్రజల ముందు పెడుతూ ఇన్ని పథకాలు ఇచ్చింది కేసీఆర్, తెచ్చింది నేను, అవునా? కాదా? అని అడుగుతూ ప్రజలకు చేరువయ్యారు. రోజుకు అయిదారు ప్రజాశీర్వాద సభలు, రోడ్డుషో లు నిర్వహించి  హాల్ చల్ చేశారు.  అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అస్త్రాలుగా దూసుకుపోయిన జీవన్ రెడ్డి  ప్రతీరోజు తెల్లవారు జామునే  ప్రచారంలోకి దిగి అన్ని వర్గాలకు చెందిన పెద్దలు, మేధావులు, కుల, మత పెద్దలను కలిసి ఆశీస్సులు పొందారు. కాగా జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఆమె  గ్రామగ్రామంలో  తిరుగుతూ బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రతులను అందించి తన భర్త జీవన్ రెడ్డి ని మళ్లీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గం నుంచి ఎవరు తమ ఇంటికొచ్చినా వారిని ఆప్యాయంగా పలకరించి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడమే కాకుండా కడుపు నిండా అన్నం పెట్టి ఆదరించే మంచి మనిషిగా పేరున్న రజితారెడ్డి తమ గ్రామలకొచ్చినప్పుడు కూడా ఆమెను అదే రీతిలో ప్రజలు ఆదరించారు. ముఖ్యంగా మహిళలు రజితారెడ్డి ప్రచారంలో ప్రముఖంగా పాన్నారు. జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొని కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. మొదటి నుంచీ ప్రచారంలో ఉత్సాహంతో పనిచేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితల సభలకు ఆర్మూరు ప్రజలు  బ్రహ్మ రథం పట్టిన నేపథ్యంలో రెట్టింపు జోష్ తో పని చేశారు. జీవన్ రెడ్డి మా కుటుంబ సభ్యుడని సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలు స్వయంగా చెప్పడమే కాక గెలిచిన తరువాత ఆయనకు ప్రమోషన్ కూడా వస్తుందని చెప్పడం జీవన్ రెడ్డికి బాగా కలిసొచ్చింది. కాగా బీఆర్ఎస్ కు మద్దతుగా పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. దాదాపు అన్ని కుల సంఘాలు స్వచ్ఛందంగా సమావేశాలు నిర్వహించి మరీ జీవన్ రెడ్డికి మద్దతు ప్రకటించి ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. జీవన్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ వివిధ వర్గాలు, పలు పార్టీల నుంచి నిత్యం బీఆర్ఎస్ లోకి వలసల వరద కొనసాగింది. మంగళవారంతో ఎన్నికల ప్రచారఘట్టం ముగియడంతో బీఆర్ఎస్ శ్రేణులు తమతమ గ్రామాలపై దృష్టి సారించి ఓటర్లను కలుస్తున్నారు. కాగా జీవన్ రెడ్డి పోలింగ్ ఏజెంట్ల ఏర్పాటు, వారికి శిక్షణ వంటి అంశాలపై బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మంగళవారం దిశానిర్దేశం చేశారు. సాయంత్రం ముగిసిన ప్రచార కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Spread the love