హాకీవాలి సర్పంచ్‌

Hockey Sarpanchహర్యానాకు చెందిన నీరూ యాదవ్‌ చిన్నతనం నుండి హాకీ పట్ల ఆసక్తి పెంచుకున్నారు. క్రీడతో పాటు చదువుపై దృష్టి పెట్టాలని కుటుంబం పట్టుబట్టింది. దాంతో ఆమె ఆట ఆడాలనే తన కలలను వదులేసుకున్నారు. చాలా ఏండ్ల తర్వాత ఆమె ఇప్పుడు ‘హాకీవాలి’ (హాకీ మహిళ) సర్పంచ్‌గా ప్రసిద్ధి చెందారు. రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలోని లంబి అహిర్‌ గ్రామంలో పితృస్వామ్యాన్ని సవాలు చేస్తూ యువ హాకీ క్రీడాకారుల బృందాన్ని ఆమె ఏర్పాటు చేశారు. అమ్మాయిలకు క్రీడలతో పాటు ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక అక్షరాస్యత, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కూడా నిర్విరామంగా పని చేస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
అభివృద్ధి కోసం పథకాలు
గ్రామంలో ఆమె ప్రధాన్‌ మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన (PMKVY) పథకం కింద బాలికల కోసం నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తద్వారా మహిళలు ఉపాధి కూడా పొందుతున్నారు. ‘సుకన్య సమృద్ధి యోజన కింద ఆర్థిక పథకాల గురించి, వారి మొబైల్‌ ఫోన్‌లలో యూపీఐని ఎలా ఉపయోగించాలో మహిళలకు అవగాహన కల్పించడానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో కూడా కలిసి పనిచేశాము’ అని ఆమె అన్నారు. నీరు తన గ్రామంలో స్వయం-సహాయక బృందాలను స్థాపించారు. అలాగే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ల ప్రభావాన్ని తొలగించడానికి వివాహాల వంటి కమ్యూనిటీ సమావేశాలకు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పాత్రలను అందించడానికి ‘పాత్రల బ్యాంకు’ని కూడా స్థాపించారు. తద్వారా వ్యర్థ రహిత వివాహలు జరిగేలా చర్యలు పెట్టారు.
చాలా రోజుల తర్వాత నీరు అమ్మాయిలతో కలిసి మైదానంలోకి అడుగుపెట్టారు. వారికి వారి జీవితంలో ఉత్తమమైనదాన్ని అందుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ అమ్మాయిలంతా హాకీ ఆడటానికి మూస పద్ధతులు, సంప్రదాయాలను ధిక్కరిస్తున్నారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ‘ప్రస్తుతం మా వద్ద రెగ్యులర్‌గా హాకీ ఆడే అమ్మాయిల గ్రూప్‌ ఉంది. వారిలో కొందరు జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఆడటానికి వెళుతున్నారు. జాతీయ ఎంపికల కోసం కూడా శిక్షణ పొందుతున్నారు’ అని అక్టోబర్‌ 2022లో ఆ గ్రామానికి మొదటి మహిళా సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన నీరు అంటున్నారు. అక్టోబర్‌లో ఆమె సర్పంచ్‌ అయినప్పుడు దేశం కోసం హాకీ ఆడాలనే కొంతమంది అమ్మాయిల కలల గురించి నీరూకి తెలుసు. ఒకప్పుడు తన కలను చంపేసుకున్న ఆమె శిక్షణకు అనుమతించమని అమ్మాయిల తల్లిదండ్రులను ఒప్పించడం ప్రారంభించారు.
సేవపై ఆసక్తితో…
”ఒకప్పుడు అమ్మాయిలు ఆడుకోవడానికి మైదానం లేదు. అందుకే సమీపంలోని ఒక ప్రైవేట్‌ విశ్వవిద్యాలయ మైదానంలో ఆడుకునేవారు. జట్టును ఏర్పాటు చేయడానికి, అమ్మాయిలకు శిక్షణ ఇవ్వడానికి కోచ్‌ని నియమించడానికి నా జీతం విరాళంగా ఇస్తున్నాను. ఇప్పుడు మేము గ్రామంలో మా సొంత మైదానాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం” అని ఆమె అంటున్నారు. బీఈడీ, ఎంఈడీ డిగ్రీలతో పాటు గణితంలో ఎంఎస్సీ డిగ్రీ చేసిన నీరు ప్రస్తుతం పీహెచ్‌డీ కూడా చేస్తున్నారు. అయితే సర్పంచ్‌ సీటును మహిళా ప్రతినిధికి ప్రకటించినప్పుడు ఆమె లంబి అహిరిలో నివసిస్తున్న గృహిణి. లోకల్‌ గవర్నెన్స్‌పై ఎలాంటి ముందస్తు అవగాహన లేదు. కేవలం సామాజిక సేవపై ఉన్న ఆసక్తితో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. వెంటనే రైతుల జీవితాలు మెరుగుపరచుకోవడానికి, మంచి ధర, మార్కెట్‌ సౌకర్యం కల్పించడం కోసం ఆమె రైతుల ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీఓ) ఏర్పాటు చేయడానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. ”రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులు కొనాలంటే గ్రామం నుంచి 10 కి.మీ.వెళ్ళాలి. ఎఫ్‌పీఓ ద్వారా ఆ సమస్యలన్నీ పరిష్కరించుకుని ప్రభుత్వ పథకాలను ఎలా పొందాలో కూడా రైతులు అవగాహన కలిగివున్నారు’ అని ఆమె చెప్పారు.
అతి పెద్ద సవాలుగా…
”మేము తక్కువ వ్యవధిలో సోక్‌ పిట్‌లను కూడా తవ్వాము. వర్షపు నీటి సంరక్షణను ప్రారంభించాం, రోడ్లు వేశాం” అని ఆమె చెప్పారు. ఒక మహిళా సర్పంచ్‌గా నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈ పురుషాధిక్య సమాజంలో అతిపెద్ద సవాలుగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ”గ్రామాల్లో నిర్ణయం తీసుకునేటపుడు పురుషుల ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. నేను బాధ్యతలు స్వీకరించినప్పుడు కొందరి అహంభావాలు దెబ్బతిన్నాయి, కొంత అసంతృప్తి ఉంది. కానీ నేను చేస్తున్న పని ఫలితాలను చూసి వారు ఇప్పుడు నన్ను అంగీకరించడం ప్రారంభించారు’ అని నీరు చెప్పారు. స్థానిక పాలనలో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించడం ఒక గొప్ప అడుగు అని ఆమె అంటున్నారు. భర్తలు తమ భార్యల పంచాయితీల బాధ్యతలు చేపట్టడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహిళలు ఎన్నికల్లో పోరాడవచ్చు, గెలవగలరు, సొంతంగా పరిపాలించగలరు అని ఆమె బలంగా నమ్ముతారు.
సామర్ధ్యాలన్నీ మహిళలకు ఉన్నాయి
‘పై స్థాయి నుండి మహిళలు వారి భర్తల జోక్యం లేకుండా పాలించినట్లయితే అప్పుడు పంచాయతీ స్థాయిలో కూడా మార్పు వస్తుంది’ అని ఆమె అంటున్నారు. మహిళలు సమయ నిర్వహణ, మల్టీ టాస్కింగ్‌లో సమర్ధవంతంగా ఉంటారు. మంచి నాయకులుగా ఉండడలిగే సామర్ధ్యాలన్నీ మహిళలకు ఉన్నాయి. ఇటీవల కాలంలో గ్రామసభలకు ఎక్కువ మంది మహిళలు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే నీరు కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో కూడా కనిపించారు. అక్కడ ఆమె లంబి అహిర్‌లో సానుకూల మార్పు గురించి పంచుకున్నారు. ఈ షోలో ఆమె రూ. 6.70 లక్షలు గెలుచుకున్నారు. ఈ డబ్బును ఆమె బాలికల క్రీడలను ప్రోత్సహించడానికి, పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె నిర్వహించే అదిత్రి ఫౌండేషన్‌కు ఇచ్చారు. ఆమె పదవీ కాలానికి ఇంకా రెండేండ్లు ఉన్నందున తన గ్రామ అభివృద్ధి పట్ల నీరు మరింత దృష్టి పెట్టారు. ”గ్రామంలో స్టేడియం నిర్మించాలన్నది నా కల. అలాగే గ్రామంలోని మహిళలకు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి నిర్దిష్ట స్థలం లేదు. వారి కోసం ఓ లైబ్రరీ ఏర్పాటు చేయాలి. దేశం కోసం హాకీ ఆడే అమ్మాయిల కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను’ అంటూ ఆమె తన మాటలు ముగించారు.

Spread the love