– రాజ్యసభలో ప్రతిపక్షాల డిమాండ్ ఆర్టికల్ 370 రద్దు ఒక ”నల్లచట్టం” ఆ పదాలను రికార్డుల్లోంచి తొలగింపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర హౌం, రక్షణ శాఖలపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సోమవారం రాజ్యసభలో పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ డిమాండ్స్ అండ్ గ్రాంట్స్‌పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హౌం, రక్షణ మంత్రిత్వ శాఖలపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ రెండు శాఖలు చాలా ముఖ్యమైనవని, వాటిపై చర్చ అవసరమని డిమాండ్ చేశాయి. అయితే ఈ డిమాండ్‌ను రాజ్యసభ చైర్మెన్ తిరస్కరించారు. రాజ్యసభలో రైతులు పండించే పంటలకు ఎంఎస్పీ చట్టం చేయాలని, రుణమాఫీ చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఎరువులు, విత్తనాల సబ్సిడీని పెంచాలని, అలాగే నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలని సూచించారు. రైతుల ఆత్మహత్యలను నియంత్రించాలని కోరారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ”మేము కిసాన్ సమ్మాన్ నిధి గురించి చర్చిస్తున్నాం. రైతులకు ప్రత్యక్ష సహాయం గురించి కాంగ్రెస్ మాట్లాడింది. కానీ కాంగ్రెస్ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాన్ని ఎప్పుడూ చేయలేదు. ప్రధాని మోడీ ఈ పథకాన్ని రూపొందించారు. వారికి (ప్రతిపక్షం) అర్థం కాదు. కానీ చిన్న రైతులకు రూ.6,000 అందుతుంది. ఈ కిసాన్ సమ్మాన్ నిధి వల్ల రైతులు స్వావలంబన పొందారు. రైతుల పట్ల కూడా గౌరవం పెరిగింది. ప్రతిపక్షాలు రైతుల గౌరవాన్ని చూడలేవు” అని విమర్శించారు.
మత్స్యకార, రైతులకు ఆదాయ భద్రత కల్పించాలి
లోక్‌సభలో కేంద్ర ఫిషరీస్, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డిమాండ్స్ అండ్ గ్రాంట్స్‌పై చర్చ జరిగింది. టీఎంసీ ఎంపీ సయానీ ఘోష్ మాట్లాడుతూ దేశంలో పశుగ్రాసం సంక్షోభాన్ని ఎత్తిచూపారు. జాతీయ పశుగ్రాసం కొరత ఉందని కేంద్ర మంత్రి గుర్తించారని, ప్రభుత్వ ఆధీనంలోని గోశాలలో, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆవులు ఆహారం లేకపోవడంతో చనిపోవడం ఆందోళన కలిగిస్తోందని ఆమె ఎత్తిచూపారు. కాంగ్రెస్ ఎంపీ బెన్నీ బెహనాన్ మాట్లాడుతూ మత్స్యకార, రైతు సంఘాలకు మద్దతు ఇవ్వాలని, ఆదాయ భద్రత కల్పించాలని కోరారు. ఈ కమ్యూనిటీలను రక్షించడానికి సకాలంలో, తగిన పరిహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. తీర ప్రాంత పర్యాటక కార్యక్రమాలను కూడా విమర్శించారు. అవి సముద్ర పర్యావరణ వ్యవస్థకు విఘాతం కలిగిస్తున్నాయని, మత్స్యకారుల జీవనోపాధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు.
కేరళలో ఎందుకు ఎయిమ్స్ పెట్టరూ?
కేరళలో ఎందుకు ఎయిమ్స్ పెట్టరని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి జేపీ నడ్డాను ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కాంగ్రెస్ ఎంపీ కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ ‘కేరళకు ఎయిమ్స్ సౌకర్యం కల్పిస్తామని కేంద్ర మంత్రి జెపి నడ్డా గతంలోనే హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా అనేక ఎయిమ్స్ మంజూరు చేసినప్పటికీ కేరళను పట్టించుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో ఉంది.కేంద్ర ప్రభుత్వం 22 ఎయిమ్స్ ప్రాజెక్టులను ఆమోదించింది. కేరళను ఎందుకు చేర్చలేదు” అని ప్రశ్నించారు.
ఆర్టికల్ 370 రద్దు ఒక ”నల్ల చట్టం”
ఐదేండ్ల కిందట ఆర్టికల్ 370 రద్దును నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ సయ్యద్ రుహుల్లా మెహదీ తీవ్రంగా ఖండించారు. ఈ చర్యను ”నల్ల చట్టం”గా అభివర్ణించారు. లోక్‌సభలో ఆయన మట్టాడుతూ దీనిని ద్రౌపది చారిత్రక వస్త్రాలను తొలగించడంతో పోల్చారు. జమ్ము కాశ్మీర్ గౌరవం, స్వయంప్రతిపత్తిని కోల్పోయినందుకు ప్రభుత్వం నవ్వుతోందని ఆరోపించారు. అయితే ఎంపీ సయ్యద్ రుహుల్లా మెహదీ వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రారు స్పందించారు. ఆయన వ్యాఖ్యలను తొలగించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ప్యానల్ స్పీకర్ జగదాంబికా పాల్ వ్యాఖ్యలను అధికారిక రికార్డు నుంచి తొలగించాలని సూచించారు.
ఆర్టికల్ 370 రద్దుతో పురోగతి : ప్రధాని మోడీ
ఆర్టికల్ 370 రద్దుపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ”మన దేశ చరిత్రలో కీలకమైన ఆర్టికల్ 370, 35(ఎ)లను పార్లమెంటు రద్దు చేసి నేటికి ఐదేండ్లు పూర్తయింది. ఈ నిర్ణయం జమ్మూ కాశ్మీర్, లడఖ్‌ల పురోగతి, శ్రేయస్సుకు సంబంధించి కొత్త శకానికి నాంది పలికింది.
దేశ రాజ్యాంగ రూపకర్తలు ఊహించిన విధంగా రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం వల్ల మహిళలు, యువత, అట్టడుగు వర్గాలకు మెరుగైన భద్రత, గౌరవం, అవకాశాలు లభించాయి. జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకువెళ్లడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే సంవత్సరాల్లో వారి అభివృద్ధి కోసం నిరంతరం .కృషి చేస్తుందని నేను హామీ ఇస్తున్నాను” అని పేర్కొన్నారు.
కుల గణనకు కేంద్రం సిద్ధంగా లేదు
ఓబీసీ క్రిమి లేయర్‌కు సంబంధించి లోక్‌సభలో తన వాయిదా తీర్మానం నోటీసును కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ ఇచ్చారు. ”2017 నుంచి పెండింగ్‌లో ఉన్న ఓబీసీ క్రిమిలేయర్ సమస్యపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. తాను ఒబిసి అని ప్రధాని మోడీ అంటారు. ఆయన ప్రభుత్వంలో 2017 నుంచి క్రిమిలేయర్ ఉంది. కానీ వారు పట్టించుకోలేదు. వారి ఉద్దేశం కేవలం ఒబిసి పేరుతో పబ్లిసిటీ చేసుకోవడమే. కుల గణన అనేది చాలా కీలకమైన అంశమని అందరికీ తెలుసు. ఇప్పుడు, ఈ ప్రభుత్వం జనాభా గణనతో పాటు కుల గణనను కూడా నిర్వహించడానికి పూర్తిగా సిద్ధంగా లేదు” అని అన్నారు.
ప్రతికా స్వేచ్ఛలో ఇండియా స్థానం చాలా దారుణంగా…
ప్రతికా స్వేచ్ఛలో ఇండియా స్థానం చాలా దారుణంగా ఉందని సీపీఐ(ఎం) ఎంపీ వి. శివదాసన్ అన్నారు. రాజ్యసభలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో 180 దేశాల్లో 159వ స్థానంలో ఉన్న పరిస్థితిని ఆయన లేవనెత్తారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఉటంకిస్తూ, పోలీసు కేసులు, అరెస్టులు, ఉపా వంటి చట్టాల ప్రకారం జైలు శిక్షలు కూడా ఉన్నాయి. జర్నలిస్టులు ప్రబీర్ పుర్కాయస్తా, సిద్ధిక్ కప్పన్‌ల అరెస్టులను ఆయన ప్రస్తావించారు. గత దశాబ్ద కాలంలో దేశంలో ప్రముఖ ఎడిటర్ గౌరీ లంకేశ్‌తో సహా 100 మందికి పైగా జర్నలిస్టులు హత్యకు గురయ్యారని శివదాసన్ ఎత్తి చూపారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారికి సరైన వేతనాలు అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
సహారా డబ్బులు వాపస్‌పై జోక్యం చేసుకోం : నిర్మలా సీతారామన్
లోక్‌సభలో సహారా గ్రూప్, పీఏసీఎల్ లిమిటెడ్‌లో డిపాజిట్ చేసిన డబ్బు వాపసుకు సంబంధించిన అంశాన్ని ఎంపీలు ప్రస్తావించారు. దీనికి స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో రీఫండ్‌లపై కేంద్రం చురుగ్గా పనిచేస్తోందని ఆమె తెలిపారు. కోర్టు సంబంధిత విషయాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని సీతారామన్ పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా వాపసులో జాప్యం జరిగిందని ఎంపిలు సూచిస్తున్నారని విమర్శించారు. తమిళనాడు ఎంపీ డి.రవికుమార్ రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం కొనసాగింపుపై ప్రశ్నించారు. దీనికి స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత జీఎస్టీ పరిహార సెస్, కోవిడ్-19 మహమ్మారి సమయంలో తీసుకున్న రుణాలను రాష్ట్రాలకు పరిహారంగా చెల్లించడానికి ఉపయోగించబడుతుందని వివరించారు. జిఎస్‌టి పరిహారం సెస్ అధికారికంగా జూన్ 2022లో ముగిసిందని, జీఎస్టీ కౌన్సిల్ సమిష్టి నిర్ణయంతో దానిని మార్చి 2026 వరకు పొడిగించినట్లు అన్నారు.
గోవా అసెంబ్లీలో ఎస్‌టీ సీట్ల రిజర్వ్ బిల్లు
గోవా శాసనసభలో షెడ్యూల్డ్ తెగలకు సీట్లను రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.