ప్రకతి మనకందించిన అద్భుతమైన ఔషధం తేనె… దీని వల్ల ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. మన చర్మ పరిరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అయితే అందుకు పార్లర్‌లో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పని లేదు. మనకు సహజంగా లభించే తేనెతోనే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.
ఎండ వల్ల నల్లగా మారి, కమిలిపోయిన చర్మానికి ఔషధంగా తేనె చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం ఒక వంతు తేనెలో రెండు వంతుల కలబందను వేసి కలుపుకొని ఆ మిశ్రమాన్ని గాలి చొరబడని ఓ డబ్బాలో నింపుకొని పెట్టుకోవాలి. అదే మిశ్రమాన్ని ఎండ తగిలి నల్లబడిన చర్మానికి అప్లై చేసుకొని 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.
చాలామంది మత చర్మాన్ని తొలిగించేందుకు మార్కెట్లో దొరికే రకరకాల క్రీములను వాడుతుంటారు. ఇవి మన చర్మానికి హాని కలిగించవచ్చు. అందుకే సహజమైన స్క్రబ్‌లను వాడాలి. అవి చర్మంపై మంచి ప్రభావం చూపిస్తాయి. అలాగే టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్ కలిపి దాన్ని చర్మానికి అప్లై చేసుకోవాలి. తేనె, ఓట్ మీల్ కలిపి తయారుచేసిన మిశ్రమం చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. చర్మం పై పేరుకుపోయిన దుమ్ము, ధూళితో పాటు మత చర్మాన్ని కూడా తొలగిస్తుంది. అలాగే మంచి ఫేస్ ప్యాక్‌లా కూడా పనిచేస్తుంది.
తేనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. ఇది కేవలం చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడం మాత్రమే కాదు.. జుట్టును కూడా కండిషనింగ్ చేసేందుకు తోడ్పడతాయి. ఇందుకోసం టేబుల్ స్పూన్ తేనెలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ హెయిర్ మాస్క్‌ని తలకి అప్లై చేసుకొని ఓ గంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూ ఉపయోగించి తలస్నానం చేయాలి. అంతే జుట్టు.. పట్టులా మెరుస్తూ తయారవుతుంది.