ఉప్పల్‌ భగాయత్‌లో పోకిరీలు

ఉప్పల్‌ భగాయత్‌లో పోకిరీలు– ప్రేమ జంటపై యువకుల బెదిరింపులు
– పోలీస్‌స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు
– విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్‌ఐపై బదిలీ
నవతెలంగాణ-ఉప్పల్‌
హైదరాబాద్‌ ఉప్పల్‌ భగాయత్‌తో పోకిరీల ఆగడాలు పెరుగుతున్నాయి. రాత్రి వేళల్లో జంటలను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాగే ఓ ప్రేమ జంటను కొందరు యువకులు ఫొటోలు తీసి బెదిరించారు. ఆ పై బ్లాక్‌ మెయిలింగ్‌ చేశారు. బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దాంతో ఎస్‌ఐపై బదిలీ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్‌ కళ్యాణపురిలో నివసిస్తూ ఢిల్లీలో ఎల్‌ఎల్‌బి చదువుతున్న ఆదర్శ్‌, తన ప్రియురాలితో కలిసి ఈ నెల 14న రాత్రి 1:30 గంటలకు ఉప్పల్‌ హెచ్‌ఎండీఏ (భగాయత్‌)కు కారులో వచ్చారు. కారులో ఉండి మాట్లాడుకుంటున్న సమయంలో పీర్జాదిగూడకు చెందిన ఐదుగురు యువకులు అక్కడికి వచ్చారు. ప్రేమ జంట ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఆపై డబ్బుల కోసం బ్లాక్‌ మెయిల్‌ చేశారు. ఆదర్శ్‌ వెంటనే 100 నెంబర్‌కు డయల్‌ చేశాడు. ఆ తర్వాత యువకుల నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్లిపోయారు. మరుసటి రోజు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. తమపై బెదిరింపులకు పాల్పడిన వారిని పిలిపించి కౌన్సెలింగ్‌ చేసి.. ఇతరులను అలా చేయకుండా హెచ్చరించి పంపించాలని కోరారు. దాంతో ఇన్‌స్పెక్టర్‌ ఎలక్షన్‌ రెడ్డి ఆదేశాల ప్రకారం సెక్టర్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారు ఎవరన్నది తెలుసుకోవడానికి ఇద్దరు యువకులు శివ, సంతోష్‌ను అర్థరాత్రి రంగంలోకి దింపారు.
వీరిచ్చిన సమాచారం ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించారు. పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్‌ సోదరుడు అమరేందర్‌, ఉదరు, మారుతి, రామ్‌చరణ్‌, శశివలిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పెట్టీ కేసు పెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ చేయించకుండా పెట్టీ కేసు మాత్రమే పెట్టించామని, అందువల్ల ఎస్‌ఐ శంకర్‌కు రూ.మూడు లక్షలు ఇవ్వాలని నిందితులను మధ్యవర్తులైన శివ, సంతోష్‌ డిమాండ్‌ చేశారు.
చివరకు వారి నుంచి రూ.2.70 లక్షలు తీసుకున్నట్టు తెలిసింది. అయితే, ఈ ఘటనలో ఎస్‌ఐ నిర్లక్ష్యంపై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అతన్ని డీసీపీ ఆఫీస్‌కు అటాచ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఐదుగురు పోకిరీలను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం.

Spread the love