మళ్ళీ కలుస్తావనే ఆశ…

ప్రియాతి ప్రియమైన నీకు,
ఎలా ఉన్నావు? నువ్వు బాగున్నావని అనుకుంటున్నాను. బాగుండాలని, నీ జీవితంలోని ప్రతి క్షణం సంతోషంగా గడవాలని మనసారా కోరుకుంటున్నాను. నిన్ను కలవక నీతో మాట్లాడక చాలా రోజులవుతుంది. మనమిద్దరం కలిసి ఒకరి కళ్ళలో ఒకరం చూసుకుంటూ చేతులు పట్టుకొని మాట్లాడుకుంటూ నడిచి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది. హైదరాబాద్‌ నగరవీధులలో గంగా జమున తెహజీబ్లా మనం మాట్లాడుతూ చార్మినార్‌ దగ్గర నుంచి మదీనా వైపుగా నడుచుకుంటూ వెళ్తూ ఒక ప్రవాహంలా మాట్లాడము గుర్తుందా..!! మళ్ళీ అలా మాట్లాడుకుందాం అప్పుడైనా మన మధ్య ఏర్పడ్డ ఈ అపార్థపు తెరలు తొలిగిపోతాయి. నీకు గుర్తుందో లేదో కానీ ఆరోజు సికింద్రాబాద్‌ హౌటల్లో కూర్చొని తింటున్నప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడావు.. నువ్వు మాట్లాడిన మధురాతి మధురమైన మాటలు నువ్వు ప్రేమతో చూసిన ఆ చూపులు జ్ఞాపకాలైపోయాయి. అవి నా మదిలో మెదిలిన ప్రతిసారి మళ్ళీ అలాంటి రోజు రావాలని అనిపిస్తుంటుంది. నువ్వు నా పక్కన ఉన్నప్పుడు వర్తమానంలో ఉండలేకపోయా వర్తమానం గతమైపోయిన తర్వాత గతపు జ్ఞాపకాల దారుల్లో తిరుగుతున్నాను. మనమిద్దరం కలిసున్నప్పుడు కోపాలు, తాపాలు, చిన్న చిన్న విషయాలకే గిల్లికజ్జాలు, అలగడాలు.. అవ్వన్నీ ప్రేమలోనైనా ఏ బంధంలోనైనా మామూలే. ఇప్పుడు ఆ చేష్టలు గుర్తొస్తే భళే నవ్వొస్తుంది. నువ్వన్నట్టు నిజంగానే అంతలా అన్మెచ్యూర్గా ప్రవర్తించానా..! నువ్వు నన్ను డ్రామా రాజా అన్నావు కదా… నిజంగా అంతలా డ్రామా క్రియేట్‌ చేశానా…!! ఏది ఏమైనా మనిద్దరి మధ్య ఏర్పడ్డ ఈ దూరం నా హృదయాన్ని బాధపెడుతుంది. ప్రతిక్షణం వేడి వేడి నిట్టూర్పులు… నా కాళ్ళ కింద భూమి కంపించినట్టు, ఆకాశం బద్దలై నా మీద అగ్ని వర్షం కురిసినట్టు అనిపిస్తుంది. ప్రేమంటే ఇదేనా? దూరం బాధపెడుతుందా? కాదు కానే కాదు. ప్రేమ, మనిద్దరి మధ్య ఏర్పడ్డ దూరం 40 శాతం బాధపెడుతుంది. దీని కన్నా నువ్వు నా మీద మోపిన నిందలు, నాతో మాట్లాడకుండా అపార్థం చేసుకొని నన్ను దూరం పెట్టావు కదా…! అదిగో ఆ నింద ఆ దూరం ఎక్కువగా బాధపెడుతుంది. నువ్వు ఏదైతే అనుకున్నావో అది నిజం కాదు. నువ్వు ఏదైతే అనుకోలేదో అది నిజం. ఈ విభజించబడ్డ విభజించబడుతున్న సమాజంలో కులం,మతం, దేశ సరిహద్దులు మనుషుల మధ్య ఒక కంచెలా ఉంటాయి. ఇవి రెండు వైపులా పదునున్న కత్తుల్లా పనిచేస్తాయి. మన మధ్య దీంట్లో నుంచి ఏది అడ్డొచ్చిన దాన్ని తొలిగించి నీకు, నీ అభిమానానికి, నీ స్నేహానికి, నీ ప్రేమకు చేరువవుతాను. ఎంత స్వార్థం ముజాహిద్‌ అంటావా..! అవును ఇది స్వార్థమే స్వార్థంలా కనబడే నిస్వార్థం. నువ్వు నా వల్ల సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వల్లే నువ్వు అభివృద్ధి చెందాలని అనుకుంటున్నాను. ఇంత క్లారిటీగా చెప్పిన నువ్వు అపార్థం చేసుకుంటే ఇక నేనేం చేయలేను. కేవలం క్రిష్ణున్ని ఆరాధించే మీరాబాయిలా, రాధను మనస్పూర్తిగా ప్రేమించే క్రిష్ణునిలా నిన్ను జీవితాంతం ప్రేమిస్తుంటాను. ఇంకా చాలా రాయాలని ఉంది కానీ నీ ముందు నిలబడినప్పుడు నా నోరు ఎలా అయితే పెగలదో ఇప్పుడు ప్రేమైక భావోద్వేగం నా మనసును బలహీనున్ని చేసింది అందుకే నా మనసులోని భావాన్ని సరిగ్గా చెప్పలేకపోతున్నాను. మళ్ళీ ఇంకో ఉత్తరం రాస్తాను. ఇక ఉంటాను. చెరగని చిరునవ్వుతో నీ మోము ఎప్పుడూ కళకళలాడాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే ఈ కష్టం తీరిపోతుంది. సుఖం చేరువవుతుందని అనుకో నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. నేను రాసే కవిత్వమంటే నీకు ఇష్టం కదా… నీ కోసం ఓ కవిత్వం రాసాను.
నీ హృదయాన నిలుపుకో…
శరీరంలోని ఆత్మ నీటి నుంచి విడిపడ్డ చేపలా
నీ గురించి ఆలోచిస్తూ నీ కోసమే తల్లడిల్లుతుంది.
వేసవికాలపు అకాల వర్షంలానైనా చిరునవ్వుతో నాకు చేరువవ్వవా..!
నీ పెదవుల నుంచి వచ్చే ప్రతి శబ్దం
నన్ను నిత్య యవ్వనంలోకి తీసుకువెళ్ళి మొఖాన్ని చిరునవ్వుతో ముద్దెడుతుంటుంది.
ఒక్క సారి సానుభూతితో కాకుండా ప్రేమ నిండిన హృదయంతో పిలిచి చూడు,
నా ప్రతి అణువు పులకించి పోతుంది.
నువ్వు ఎంత దూరం జరగినా నా హృదయంలో నిలిచే ఉంటావు…
నీ చుట్టూ నువ్వు ఎంత గిరిగీసుకున్న నా ఊహలలో విహరిస్తునే ఉంటావు…
నేనేం చేసానని, అనర్హున్నైన నన్ను ఈ మానసిక శిక్షకు అర్హున్ని చేసేసి జీవమున్న శవంలా మార్చావు?
ఈ మానసిక శిక్షా సంకెళ్ల నుంచి విముక్తిని ప్రసాదించి నన్ను నీ హృదయాన నిలుపుకో..
నా ఈ ఉత్తరానికి ప్రత్యుత్తరం రాస్తావని… ఆ ప్రత్యుత్తరంలో నేను రాసిన కవిత్వం మీద నీ అభిప్రాయాన్ని తెలియజేస్తావని.
మనిద్దరి మధ్య ఏర్పడ్డ ఈ అపోహల అపార్థాలు చెరిగిపోయి మళ్ళీ నువ్వు నాతో మాట్లాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
నిన్ను నిన్నుగా ప్రేమించే నేను నీ
సయ్యద్‌ ముజాహిద్‌ అలీ

Spread the love