– వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం
– మంత్రి ప్రకటనతో అర్హులైన లబ్ధిదారుల్లో ఆనందం
– ఉమ్మడి జిల్లాలో 7.57లక్షల మంది ఎదురుచూపు
సొంతింటి కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ఆశలు నెరవేరనున్నాయి. వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించడంతో అర్హులైన వారిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రభుత్వం ఇది వరకే వివిధ పథకాలను అమలు చేస్తోంది. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 200యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500లకే గ్యాస్ సిలిండర్ తదితర వాటిని అందజేస్తోంది. వీటితో పాటు ఇందిరమ్మ ఇండ్లు కూడా అందజేస్తామని ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది నిరుపేదలు సొంతింటి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇది వరకే ప్రజాపాలన పేరిట సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించింది. వీటిలో అర్హులను గుర్తిస్తున్న అధికార యంత్రాంగం.. లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచి ఇందిరమ్మ ఇండ్లను మంజూరుచేయనున్నట్లు తెలిసింది. ఈ పథకం అమలైతే ఉమ్మడి జిల్లాలో అనేక మందికి ప్రయోజనం చేకూరనుంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి, తలమడుగు
సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రతి ఒక్కరు ఆశపడుతుంటారు. డబ్బులున్న వారు సొంతంగా నిర్మించుకోగా.. ఆర్థికంగా లేని నిరుపేదలు ప్రభుత్వాలు అందించే సాయం మీద ఆధారపడుతుంటారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించగా.. తెలంగాణ వచ్చిన 2014 తర్వాత రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. పదేండ్ల పాటు పాలించిన ఆ పార్టీ డబుల్ బెడ్‌రూంలు అందిస్తామని హామీనిచ్చింది. జిల్లా కేంద్రాలతో పాటు కొన్ని మండల కేంద్రాలు, మరికొన్ని గ్రామాల్లో మాత్రమే డబుల్ బెడ్‌రూంలు నిర్మించింది. కొన్నిచోట్ల మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేయగా.. అనేక చోట్ల నిర్మించి వదిలేశారు. ప్రస్తుతం లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో రూ.కోట్లు వెచ్చించి నిర్మించి డబుల్‌బెడ్‌రూంలు వృధాగా ఉండిపోయాయి. గత పదేండ్ల నుంచి ఇండ్లు మంజూరు చేయకపోవడంతో అనేక మంది అర్హులైన నిరుపేదలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల నుంచి వేరు పడి జీవనం సాగిస్తున్న అనేక జంటలు వారి పిల్లలతో పూరి గుడిసెలు, రేకుల షెడ్డుల్లో ఉంటూ జీవనం సాగించాల్సి వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీనివ్వడం.. అనుకున్నట్లుగానే అధికారంలోకి రావడంతో అందరి దృష్టి వీటిపైనే కేంద్రీకృతమవుతోంది.
వచ్చే నెలలో శ్రీకారం..!
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం 7,57,809 దరఖాస్తులు రాగా ఆదిలాబాద్ జిల్లాలో 199803, నిర్మల్‌లో 193647, ఆసిఫాబాద్ 154141మంది, మంచిర్యాల జిల్లాలో 210216 మంది దరఖాస్తులు అందించారు. మరోపక్క సొంతజాగా లేని వారికి 250 గజాల చొప్పున స్థలం ఇస్తామని ప్రకటించడంతో వీటి కోసం ఉమ్మడి జిల్లాలో మరో 1151 మంది దరఖాస్తులు అందించారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో 335మంది, నిర్మల్‌లో 349మంది, ఆసిఫాబాద్‌లో 144మంది, మంచిర్యాల జిల్లాలో 323మంది దరఖాస్తులు అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే కొన్నింటినీ అమలు చేస్తోంది. ఆర్టీసీలో మహిళకు ఉచిత ప్రయాణం, రూ.500లకే వంటగ్యాస్ పంపిణీ, 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకంతో పాటు తాజాగా రైతులకు రుణమాఫీని అమలు చేసింది. వీటితో పాటు రానున్న ఆగస్టు నెలలో ఇందిరమ్మ ఇండ్లను కూడా అందజేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించడంతో ఉమ్మడి జిల్లాలో అర్హులైన నిరుపేదలకు ప్రయోజనం చేకూరనుంది.
తొలుత నియోజకవర్గానికి 3500చొప్పున అందజేయనున్నట్లు తెలిసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5లక్షల వరకు ఆర్థిక సాయం అందించనుంది. ఇప్పటికే గతేడాది డిసెంబర్ 28 నుంచి ఈ ఏడాది జనవరి 6వ తేదీ వరకు ప్రభుత్వం గ్రామాలు, వార్డుల వారీగా ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరించింది. ఐదు పథకాలకు ఒకే దరఖాస్తు తీసుకోవడంతో వీటిలో అర్హులైన లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టే పనిలో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
తలమడుగు మండల కేంద్రానికి చెందిన శంకుతల కుటుంబానికి పక్కా ఇల్లు లేదు. సొంతిల్లు లేకపోవడంతో అనేక ఏండ్లుగా గుడిసెలోనే నివాసముంటున్నారు. ఇరుకు ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి సొంతిళ్లు లేకుండా అర్హులైన పేదలు జిల్లాలో అనేక మంది ఉన్నారు. ఇలాంటి వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యే అవకాశం ఉంది.