– కోపోద్రిక్తులైన అంగన్‌వాడీల
– రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు.. రాస్తారోకోలు..
– తోపులాటలు.. దౌర్జన్యాలు
– పోలీసుల ప్రవర్తనపై ఆగ్రహం
– ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత, రంగారెడ్డిలో అరెస్టులు
– గాయపడిన తెలంగాణ అంగన్‌వాడీ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి
– సమస్యలు పరిష్కరించకుంటే బీఆర్‌ఎస్‌కు పతనం తప్పదు
– సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు పాలడుగు భాస్కర్, చుక్క రాములు
వేతన పెంపు, ఉద్యోగ క్రమబద్దీకరణ, పనిభారం తగ్గింపు.. వంటి డిమాండ్లతో అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె బుధవారం పదవ రోజుకు చేరుకున్నది. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడంతో ఆగ్రహించిన అంగన్‌వాడీలు.. తెలంగాణ అంగన్‌వాడీ, హెల్పర్స్ యూనియన్ జాయింట్ రాష్ట్ర కమిటీల (సీఐటీయూ, ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పలు జిల్లాల్లో భారీగా అంగన్‌వాడీలు ధర్నాల్లో పాల్గొని.. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. కలెక్టర్ బయటకి వచ్చి తమ సమస్యలు తెలుసుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. కలెక్టరేట్లలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన అంగన్‌వాడీలు, నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నాయకులను ముందుగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించడంతో అంగన్‌వాడీలు అడ్డుకొని పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. ఈ క్రమంలో అంగన్‌వాడీలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పలు జిల్లాల్లో మగ పోలీసులు మహిళలపై చేయి చేసుకున్నారు. వారిని ఈడ్చుకెళ్లి వ్యాన్‌లలో పడేశారు. దాంతో వందలాంది అంగన్‌వాడీలు గాయాలపాలయ్యారు. కొందరు సొమ్మసిల్లిపోయారు. పోలీ సుల లాఠీచార్జిలో రంగారెడ్డి జిల్లా ముట్టడిలో పాల్గొన్న అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి తీవ్రంగా గాయలయ్యాయి. కొట్టి, ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో నిర్భంధించారు. లక్ష్మి అనే అంగన్‌వాడీ కార్యకర్త పోలీసుల లాఠీచార్జిలో స్పృహ కోల్పోతే ఆమెను తీసుకెళ్ళి అడవిలో వదిలేశారు. ఆదిలాబాద్‌లో పోలీసులు దౌర్జన్యం చేసి అంగన్‌వాడీలను గాయపరిచారు. మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్, వనపర్తి, హైదరాబాద్ సెంట్రల్, మేడ్చల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, భువనగిరి, వికారాబాద్ తదితర జిల్లాల్లో పోలీసుల తోపులాటలు, దౌర్జన్యం చేయడం, ఈడ్చుకెళ్ళడం, లాఠీలతో కొట్టడం లాంటి చర్యల వల్ల వందలమంది అంగన్‌వాడీలు గాయపడ్డారు. అనేకమంది గాయాలపాలైనా, లాఠీచార్జ్ చేసినా 3, 4 గంటల పాటు కలెక్టరేట్‌ను దిగ్భంధం చేశారు. పోలీసుల దౌర్జన్య కాండ, ప్రభుత్వ దమన నీతిని సీఐటీయూ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. అరెస్టులు, లాఠీచార్జీలు తమ ఉద్యమాన్ని ఆపలేవని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే.. ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
నవతెలంగాణ- విలేకరులు
రంగారెడ్డిలో సీఐటీయూ నేత గొంతుపై పోలీసు బూట్లు
రంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడిలో జిల్లా నలుమూలల నుంచి 3,000 మందికిపైగా అంగన్‌వాడీలు, హెల్పర్స్ పాల్గొనగా.. వారిలో సగం మందికిపైగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పాల్గొన్న అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడారు. మట్టిఖర్చులతో సరిపెడితామంటే ఊరుకోబోమని, రాష్ట్ర ప్రభుత్వాన్నికి మట్టికరిపిస్తామని హెచ్చరించారు. కాగా, ధర్నా అనంతరం అంగన్‌వాడీలు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు అంగన్‌వాడీలు సొమ్మసిల్లిపోయారు. దాంతో పోలీసులకు, అంగన్‌వాడీలు, నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. జిల్లా సీఐటీయూ నాయకులు కిషన్ గొంతుపై బూట్లతో తొక్కారు. రవికుమార్‌కు పక్కటెముకలు విరిగాయి. జిల్లా అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి ఎం. చంద్రమోహన్, ఆఫీస్ బేరర్స్ డి. జగదీష్, ఇ. నర్సింహా, శేఖర్, కురుమయ్య తదితర నాయకులపై దౌర్జన్యం చేశారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరికి బలమైన దెబ్బలు తగిలాయి. అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజ్యలక్ష్మి, కవితలకు గాయాలయ్యాయి.
ఆదిలాబాద్‌లో తోపులాట
ఆదిలాబాద్ జిల్లాలో అంగన్‌వాడీలు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టరేట్ ఎదుట నిరసన చేపడుతున్న అంగన్‌వాడీలు నేరుగా కలెక్టర్‌కు సమస్యలను విన్నవించేందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. ఈ క్రమంలో ఓ మహిళా ఎస్‌ఐ.. అంగన్‌వాడీలను అడ్డుకునేందుకు ప్రయత్నిం చగా.. కోపోద్రిక్తులైన వారు.. ఎస్‌ఐతో వాగ్వివాదానికి దిగారు. దాంతో అంగన్ వాడీలను అరెస్ట్ చేసేందుకు యత్నిం చగా.. పోలీసులు, నాయకులు, కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో ఓ అంగన్‌వాడీ కార్యకర్త స్పృహతప్పి పడిపోయారు. అంబులెన్స్‌లో ఆమెను ఆస్పత్రికి తరలించారు. పలువురు గాయ పడ్డారు. నాయకుల అరెస్టుతో ఆగ్రహం చెందిన అంగన్‌వాడీలు సుమారు మూడు గంటల పాటు కలెక్టరేట్ వద్ద రోడ్డుపై ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీ యూ) రాష్ట్ర అధ్యక్షులు కె.సునీత మాట్లాడుతూ.. అధికారులు, పోలీసులు అంగన్‌వాడీలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, మగ పోలీసులు మహిళ ఉద్యోగులని చూడకుండా దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్‌ల ఎదుట అంగన్‌వాడీలు పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళనలతో కలెక్టరేట్లు దద్దరిల్లాయి. ఈ క్రమంలో పోలీసులు అంగన్‌వాడీలను అడ్డుకొని ఈడ్చుకెళ్లడంతో పలువురికి గాయాలయ్యాయి. ములుగు జిల్లా కేంద్రంలో డీఎల్‌ఆర్ ఫంక్షన్ హల్ నుంచి కలెక్టరేట్ వరకు అంగన్‌వాడీలు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. అనంతరం అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందించారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీల నిరసన అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ ధర్నాలో అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్సవకు వినతిపత్రాన్ని ఇచ్చారు. హన్మకొండ జిల్లాలో ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అడిషనల్ కలెక్టర్ మహేందర్‌జీకి వినతిపత్రం అందజేశారు.
ఖమ్మం జిల్లాలో వందలాంది మంది అంగన్‌వాడీ కార్యకర్తలు ఒక్కసారిగా కలెక్టరేట్ వద్దకు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో గేటు ఎదుట బైటాయించి నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఐసీడీఎస్ పీడీకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వం చలో కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వ రరావు ఇంటిని ముట్టడించి ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు.
నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు వేలాదిమంది అంగన్‌వాడీలు ఉద్యోగులు కలెక్టరేట్ ముట్టడించారు. దీంతో కార్యాలయం స్తంభించిపోయింది. కలెక్టరేట్ ప్రధాన గేటుకు తాళాలు వేసి అంగన్‌వాడీ ఉద్యోగులు నాలుగు గంటల పాటు బైటాయించడంతో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు కార్యాలయానికి రాకుండా వెనుతిరిగారు. ఈ సందర్భంగా వారికి మద్దతు తెలుపుతూ పాల్గొన్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేసి కనీస వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీలు గంటకుపైగా రాస్తారోకో నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) వెంకట్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
సంగారెడ్డిలో భారీ ర్యాలీ
సంగారెడ్డిలోని పీఎఐస్‌ఆర్ గార్డెన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట మండుటెండలో రెండు గంటల పాటు బైటాయించి.. పెద్ద ఎత్తున నినాదాలతో హౌరెత్తించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పాల్గొని మాట్లాడారు. గత పదిరోజులుగా సమ్మె చేస్తుంటే.. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. అందుకు భిన్నంగా సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. మెదక్ కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను పోలీసులు అడుగడుగునా అడ్డగిస్తూ, ఆంక్షలు విధించి అత్యుత్సాహం ప్రదర్శించారు. అంగన్‌వాడీల యూనిఫామ్‌ని చూసి పోలీసులు అడ్డుకోవడాన్ని గమనించిన వారు.. అప్పటికప్పుడు కొత్త చీరలు కొనుగోలు చేసి ధరించి ధర్నాలో పాల్గొన్నారు. పది రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్త శుద్ది, సోయి లేకుండా పోయిందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే. మల్లికార్జున్ అగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో రాస్తారోకో.. ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిలో పోలీసులు సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులను ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి పోలీస్ వ్యాన్‌లో పడేసి అరెస్టు చేశారు. ఈ పరిణామంతో కోపోద్రిక్తులైన అంగన్‌వాడీ ఉద్యోగులు కలెక్టర్ ఆఫీస్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ తోపులాటలో అంగన్‌వాడీల చేతులకు దెబ్బలు తగిలి రక్తాలు కారాయి. ఈ సందర్భంగా 105 మంది అంగన్‌వాడీ ఉద్యోగులను అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ధర్నాలో పాల్గొన్న సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ ఉద్యోగులతో పెట్టుకుంటే గతంలో చంద్రబాబు నాయుడుకి పట్టిన గతే కేసీఆర్‌కు, ఆయన ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. జేఏసీతో జరిగిన చర్చల సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ ఇచ్చిన హామీలు సైతం తుంగలో తొక్కి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్‌వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.లక్ష, ఆయాలకు రూ.50వేలు ఇస్తామని, చనిపోయిన తర్వాత మట్టి ఖర్చుల కింద టీచర్లకు రూ.20 వేలు, ఆయాలకు రూ.10వేలు ప్రకటించడం దారుణమన్నారు. అంగన్‌వాడీల సమ్మెకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. సమస్యలను ఈనెల 30లోపు పరిష్కరించకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తారమని హెచ్చరించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌కు వెళ్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, సీఐటీయూ నాయకులను పోలీసులు కలెక్టరేట్‌కు సమీపంలోని దొంగల మైసమ్మ సర్కిల్ మెయిన్ రోడ్డుపై అడ్డుకుని అరెస్టు చేశారు. కొంతమందిని శామిర్‌పేట, మరికొంత మందిని అల్వాల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
అంగన్‌వాడీల అరెస్టుకు సీపీఐ ఖండన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలో ఉండి నిరసనలు వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీ ఉద్యోగులను పలుచోట్ల అరెస్టు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ పది రోజులకుపైగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికార పార్టీ ప్రాయోజిత సంఘంతో తూతూమంత్రంగా చర్చలు జరిపి క్షేత్రస్థాయిలో సమ్మె చేస్తున్న అంగన్‌వాడీల పట్ల నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వ దుర్నీతికి నిదర్శనమని విమర్శించారు.