కార్గో నౌకపై హూతీల క్షిపణి దాడి..

నవతెలంగాణ – హైదరాబాద్ : సరకు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకొని హూతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో ‘ట్రూ కాన్ఫిడెన్స్‌’ కార్గో నౌకపై క్షిపణులతో దాడి చేశారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న సిబ్బందిని భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా కాపాడింది. క్లిష్ట పరిస్థితుల్లో అత్యంత సాహసోపేతంగా వారిని రక్షించింది. ఇందుకు సంబంధించిన వీడియోను నౌకాదళ అధికార ప్రతినిధి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘బార్బడోస్‌ జెండా ఉన్న కార్గో నౌక ‘ట్రూ కాన్ఫిడెన్స్‌’పై దాడి జరగడంతో అగ్నిప్రమాదం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. నౌక కూడా తీవ్రంగా దెబ్బతింది. ఈ సమాచారమందుకున్న ‘ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా’ సహాయక చర్యలు చేపట్టింది. హెలికాప్టర్‌, బోట్ల సాయంతో ఒక భారతీయుడు సహా 21 మంది సిబ్బందిని కాపాడింది. క్షతగాత్రులకు అత్యవసర ప్రాథమిక చికిత్స అందించింది. అనంతరం సిబ్బందిని జిబౌటీకి తరలించింది’’ అని నేవీ వెల్లడించింది. యెమెన్‌ నగరం ఎడెన్‌కు నైరుతి దిశగా 55 నాటికల్‌ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఆ నౌక చైనా నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్తున్నట్లు ట్రాకింగ్‌ డేటాలో ఉంది. దాడి సమయంలో నౌకలో మొత్తం 23 మంది ఉన్నారు. సిబ్బందిలో భారత్‌కు చెందిన ఒకరు, నలుగురు వియత్నాం, 15 మంది ఫిలిప్పీన్స్‌ దేశస్థులు కాగా.. మిగతా ముగ్గురు సాయుధ గార్డులు అని నౌక యాజమాన్యం వెల్లడించింది. వీరిలో ఇద్దరు ఘటనా స్థలంలోనే మరణించగా.. మిగతా 21 మందిని నేవీ కాపాడింది. అనంతరం చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న నౌక శాటిలైట్‌ చిత్రాలను అమెరికా ఆర్మీ విడుదల చేసింది.

Spread the love