కళలు అరవై నాలుగు. అందులో మంచివి కొన్ని. ముంచేవి మరికొన్ని. సాధారణంగా ఒకరికి ఒకటి లేదా రెండు, మూడు కళలలో ప్రవేశం ఉంటుంది. ఇది మొదటి రకం. ఒకే వ్యక్తికి అనేక కళలలో ప్రవేశమే కాదు ప్రావీణ్యం ఉంటే వారు రెండో కోవకు చెందినవారు. నేటి రాజకీయ నాయ కులను చూస్తుంటే వారిలో ఎన్ని కళలు దాగి ఉన్నాయో అన్న సందేహాం కలగక మానదు. నేతలలో దాగి ఉన్న ‘కళ’లు బయట పడేది ఈ ఎన్నికల కాలంలోనే. ఓట్ల పండగ వచ్చిందంటే ఓటరు దేవుడవుతాడు. ఐదేండ్లు ప్రజలను పట్టించుకోనోడే ఇప్పుడు వారి చుట్టూ తిరుగుతుంటారు. ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకోవడానికి ‘దోసెలు వేస్తూ, బట్టలు ఉతు కుతూ, ఇస్త్రీ చేస్తూ, చంటి పిల్లలకు సాన్నాలు చేయిస్తూ’ ఇలా ఒకటేమిటి ఓటర్లను మెప్పించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఓటర్లను ఆకట్టు కునేలా అభ్యర్థులు ప్రచార పర్వానికి సిద్ధమవుతున్నారు.
ప్రాంతీయ పార్టీలతోపాటు ప్రధాన జాతీయ పార్టీలు గాడి తప్పుతుండటం ఒక అవాంఛనీయ పరిణామం. రాజకీయపక్షాలు మునుపెన్నడూ లేని స్థాయిలో వాగ్దానాల వర్షాన్ని కురిపిస్తున్నాయి. అధికారం కోసం పరుగులో అమలు చేయగలిగే, ఆచరణయోగ్య హామీలే ఇవ్వాలనే ఔచిత్యం లోపిస్తున్నది. తమిళనాడుకు చెందిన ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి ఏకంగా చంద్ర మండలం మీదికే తీసుకెళ్తానని ప్రకటించటం ఈ వాగ్దానాల పోకడకు పరాకాష్ట. ఏం చేసైనా అధికారం చేజిక్కించుకోవాలనే తాపత్రయంతో ఇస్తున్న ఎన్నికల హామీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి అనడంలో సందేహామే లేదు. రాజకీయ నాయకుల నినాదాలకు, వాళ్ల వాగ్దానాలకు ప్రజలు అసలు బలికావద్దు. రాజకీయ నైతిక విలువలకు కట్టుబడని ఖద్దరు బట్టల నాయకులు ఎన్నికల్లో అమలు సాధ్యంకాని హామీలిచ్చి నెరవేర్చకున్నా వాళ్లకు ఎలాంటి శిక్షలు లేని భూస్వామ్య, నియంతృత్వ భావ జాలం నిండిన ప్రజలస్వామ్యం మనది. దళారీ రాజకీయ నాయకుల స్వభావాన్ని జంతువులతో పోల్చి అలిశెట్టి ప్రభాకర్ చెప్పిన ‘రాజకీయం’ కవిత నేటికీ ఆలోచనల్లో పడేస్తుంది. ”ఒక నక్క/ ప్రమాణ స్వీకారం చేసిందట / ఇంకెవర్నీ మోసగించననీ/ ఒక పులి/ పశ్చాత్తాపం ప్రకటించిందట/ తోటి జంతువుల్ని సంహరించినందుకు / ఈ కట్టు కథ విని గొర్రెలింకా పుర్రెలూపు తూనే ఉన్నారు” అని ఓటర్లను హెచ్చరిస్తాడు.
‘ప్రజాస్వామ్యంలో ఒక ఓటరు అజ్ఞానం- మిగిలిన వారందరి భద్ర తనూ ప్రమాదంలో పడేస్తుంది’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ చేసిన హెచ్చరికను యువత అర్థం చేసుకోవాలి. తమ భవితను తామే నిర్దేశించు కోవాలంటే- ప్రజాస్వామ్య యజ్ఞంలో వారు పాలు పంచుకుని తీరాలి. ‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పాడుగాలిగా మారి/ విషం చిమ్ముతుంటాయి/ ప్రజాస్వామ్యానికి ఊపిరిపోయాల్సిన ఎన్నికలు/ దారి తప్పి ఉరితాడు పేనుతున్నాయి’ అని యువకవి తగుళ్ల గోపాల్ ఆవేదన చెందినట్టు వెగటు పుట్టిస్తున్న ధన, రౌడీ రాజకీయాలతో పరువుమాస్తున్న ఎన్నికల ప్రక్రియను ఏవగించుకునే వారూ లేకపోలేదు. అవినీతి అక్రమాల చెరలోంచి జనస్వామ్యానికి స్వేచ్ఛ ప్రసాదించగలిగే ప్రజా ఉద్యమానికి యువతే నేతృత్వం ఎందుకు వహించకూడదు? ప్రజాసంక్షేమానికి పాటు పడని నేతలను నిగ్గదీయడమే కాదు… దేశం తలరాతను మార్చి రాసే విధాతలుగా యువత అవతరించాలి!
ఎన్నికల ప్రచారంలో హామీలతో బురిడీ కొట్టించే నాయకుల ప్రసంగాలకు, మోసపూరిత వాగ్దానాలకు సామాన్య ఓటర్లకు ప్రతీసారి ఓటమే. అదుపులోని లేని అధిక ధరలు పేదలను మరింత నిరుపేదలుగా మారుస్తు న్నాయి. నమ్ముకున్న ఓటర్లను ప్రభుత్వాలు గెలిచిన తర్వాత వివిధ రకాలైన టాక్స్‌ల పేరుతో నట్టేట ముంచుతున్న తీరు ”ఉండబట్ట లేక / ఓటేస్తే / ఉన్న బట్టా / లాక్కునట్లు” అని విమర్శిస్తాడు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలతంతు నియమనిబంధనల్లో చెప్పుకున్నంత గొప్పగా అమలు జరగడం లేదు. అక్రమ మార్గాల్లో దేశ సంపదను కొల్లగొడుతున్న అవినీతిపరులు ఓటుకు నోటు ఆశ చూపి పార్లమెంటులో పాగావేసి ధనార్జనకు పాల్పడుతున్నారు. ఈ అప్రజా స్వామిక పరిస్థితులను పరిశీలించిన నిబద్ధత కలిగిన కవిగా ప్రజాపక్షంగా నిలబడి ప్రశ్నించారు.
”అయిదేళ్లకోసారి / అసెంబ్లీలో మొసళ్ళు / పార్లమెంటులోకి తిమింగ లాలూ / ప్రవే శించటం పెద్ద విశేషం కాదు / జనమే / ఓట్ల జలాశయాలై / వాటిని బతికించటం / విషాదం..?” అన్న అలిశెట్టి చురక అక్షర సత్యం. ప్రజల్లో రాజకీయ చైతన్యం రానంత వరకు చట్టసభల ప్రక్షాళన సాధ్యం కాదు. ఓటింగ్‌లో పాల్గొని మోస పోవడానికి పద్దె నిమిదేండ్ల పౌరుడే కానక్కరలేదు. ‘మంచివాళ్లు ఓటింగ్‌కు దూరంగా ఉండటం- చెడ్డ ప్రభుత్వాల ఏర్పాటుకు దారి తీస్తుందన్నది’ అని ఎన్నికల నిర్వహణలో తనదైన ముద్ర వేసుకున్న మాజీ సీఈసీ శేషన్ మాటలు ప్రజలందరికి ఒక హెచ్చరిక!