ఎంతమంది ఉసురు పోసుకుంటారు?

ఇదంతా చూశాక…బాధితులైన క్రీడాకారులు, వాళ్ళ కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నాయని
అనడంలో ఏమైనా ఆశ్చర్యం ఉన్నదా. పుండు మీద కారం చల్లినట్లు ‘వాళ్లు రోడ్డెక్కింది న్యాయం కోసం
కాదు. రాజకీయాల కోసం’ అన్న దుష్ప్రచారాలను సోషల్‌ మీడియా వేదికగా చూసిన వాళ్లకి బుర్ర
వేడెక్కిపోవాల్సిందే. ప్రస్తుతం కుస్తీ క్రీడాకారిణులు పోరాడుతున్నది ఒక అధికార మదగజంతో అన్నది దేశ
ప్రజలందరికీ అర్థం కావాలి. దేశానికి పతకాలు సాధించి పెట్టి, దేశం పరువు నిలబెట్టిన ఆడపిల్లల్ని
రక్షించుకోవడానికి ఈ దేశ ప్రజ ఏం చేస్తున్నది? ఇది మనందరి ముందు ఉన్న ప్రశ్న!

‘మాకు ప్రాణ హాని ఉంది. మేము నిత్యం వేధింపులకు గురవుతున్నాం’. ఈ ప్రకటన చేసింది వినేష్‌ ఫోగట్‌. దేశానికి పతకాల మీద పతకాలు సంపాదించి పెట్టిన, దేశం పరువు నిలబెట్టిన క్రీడాకారిణి. ‘భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడి మీద ఫిర్యాదు ఇచ్చిన వారితో సహా మా అందరి జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. మా కుటుంబాలకు బెదిరింపులు వస్తున్నాయి’. ఈ మాటలు వినేష్‌ జనవరి 18వ తేదీన మొట్టమొదట జంతర్‌మంతర్‌ దగ్గర ధర్నా చేసిన రోజే చెప్పింది. ‘నేను ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా ఇంత వివరంగా కాకపోయినా… మేం వేధింపులను ఎదుర్కొంటున్నాం. మాకు సహాయం చేయండి… అని విన్నవించుకున్నాన’ని కూడా చెప్పింది. తిరిగి ఏప్రిల్‌ 25వ తేదీన, మే 18వ తేదీన పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాకు చెప్పింది. అయితే ఇవన్నీ ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావడం లేదు. ఇప్పటికి ఐదు నెలలుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఈ మహిళా క్రీడాకారులు నిజంగానే జీవితం ప్రమాదంలో పడేంత తీవ్రమైన ఇబ్బందులు అనుభవిస్తున్నారా. అంటే గతంలో జరిగిన ఘటనలు నూటికి నూరు శాతం నిజమనే చెప్తున్నాయి. ఒకసారి గతంలో ఏం జరిగిందో చూద్దాం.
రుచిక గిర్హోత్రా. గూగుల్‌ తల్లిని అడిగితే ఈమె గురించి అన్ని వివరాలు చెబుతుంది. అభం శుభం తెలియని 14ఏండ్ల బాలిక. టెన్నిస్‌ నేర్చుకునేది. అప్పటి పోలీస్‌ అధికారి అయిన టెన్నిస్‌ అసోసియేషన్‌ నాయకుడి వేధింపులకు బలైంది. న్యాయం దొరకక, తన కారణంగా తమ్ముడు, మొత్తం కుటుంబం వేధింపులకు గురైన కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. అయితే సదరు పోలీస్‌ అధికారి మాత్రం డిజిపిగా పదోన్నతి పొందాడు. ఇదీ మన ఆడపిల్లలకు న్యాయం జరిగే తీరు. రుచిక టెన్నిస్‌ క్రీడాకారిణి. చండీగఢ్‌ లోని సేక్రెడ్‌ హార్ట్‌ గర్ల్స్‌ హైస్కూల్లో 10వ తరగతి చదివేది. తండ్రి యూకో బ్యాంక్‌ మేనేజర్‌. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. సోదరుడు అషు. స్నేహితురాలు ఆరాధనతో కలిసి హర్యానా లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌లో టెన్నిస్‌ నేర్చుకునేది. ఇది ఎక్కడ ఉన్నదంటే, అప్పటి ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా పనిచేస్తున్న ఎస్‌పిఎస్‌ రాథోడ్‌ నివాస గృహం పక్కనే ఉండేది. అప్పట్లో ఇతగాడు హర్యానా లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా పని చేసేవాడు. ఆ హోదాలోనే రుచిక ఇంటికి వెళ్లి ఆ అమ్మాయి తండ్రితో మాట్లాడాడు.
ఇది జరిగింది 1990 ఆగస్టు 11వ తేదీన. ‘అమ్మాయి బాగా పైకి వస్తుంది. నా ఇంటికి పంపించండి. కోచింగ్‌ ఇస్తాను’ అని చెప్పి వచ్చాడు. 12వ తేదీన స్నేహితురాలు ఆరాధనతో కలిసి రుచిక రాథోడ్‌ ఆఫీస్‌కి వెళ్లి కలిసింది. ఆ ఇద్దరు అమ్మాయిల్ని చూసిన ఈ పెద్ద మనిషి టెన్నిస్‌ కోచ్‌ని తీసుకురమ్మని చెప్పి ఆరాధనను బయటకు పంపించాడు. ఆ అమ్మాయి బయటకు వెళ్లిందో లేదో ఒంటరిగా ఉన్న రుచికను గట్టిగా పట్టుకొని దగ్గరకు తీసుకొని చెప్పరాని విధంగా ప్రవర్తించసాగాడు రాథోడ్‌. ఏదో విధంగా అమ్మాయి అతన్ని బయటకు నెట్టేసి ఇవతలకు వచ్చింది. అయినా అతని ధోరణి మారలేదు. బయటికి వెళ్లిన ఆరాధన లోపలికి వచ్చి జరిగిందంతా చూసింది. జరిగిన విషయం ఆడపిల్లలు ఇంట్లో వాళ్లకి చెప్పలేదు. అందరు ఆడవాళ్లు, ఆడపిల్లల్లాగే భయపడ్డారేమో. ఆ తర్వాత రోజున మళ్లీ టెన్నిస్‌ నేర్చుకోవడానికి వెళ్లారు. ఆ పిల్లలిద్దరినీ తన ఆఫీసుకు పిలిపించాడు రాథోడ్‌. ఇక దీంతో వారిద్దరు ఇంట్లో వాళ్లకి చెప్పారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఏదో ఒకటి చేయాలని నిర్ధారణకు వచ్చారు. పైఅధికారుల దృష్టికి తీసుకురావాలనుకున్నారు. ఆగస్టు 17 తేదీన హోం సెక్రటరీకి ఫిర్యాదు ఇచ్చారు. అధికారులు చర్యలు తీసుకుంటారని భ్రమపడతాం కదా! వారూ అలాగే అనుకున్నారు. అయితే కథ అక్కడితో ఆగలేదు. ముఖ్యమంత్రులు, హోంమంత్రులతో కలిసి నేరస్తుడ్ని రక్షించడానికి నాటకాలు మొదలెట్టారు.
ఆ తర్వాత జరిగినదంతా తెలుసుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది. క్రైమ్‌స్టోరీని తలపిస్తుంది. న్యాయం జరగకపోగా రుచిక కుటుంబాన్ని, మద్దతునిచ్చిన స్నేహితురాలు ఆరాధన కుటుంబాన్ని సర్వనాశనం చేశారు. ఇదంతా అధికారంలో ఉన్న పెద్దల అండతోనే సాగింది. సెప్టెంబర్‌ 17వ తేదీన హోం సెక్రటరీకి ఫిర్యాదు ఇచ్చాక… హోం సెక్రటరీ ఆర్‌.ఆర్‌. సింగ్‌ నివేదిక ఇచ్చారు. దాంట్లో స్పష్టంగా నేరం జరిగినట్లు చెబుతూ ఎఫ్‌ఐఆర్‌ తక్షణమే నమోదు చేయాలని సిఫార్సు చేశారు. ఆ కొద్ది కాలానికి ఆర్‌.ఆర్‌.సింగ్‌ స్థానంలో దుగ్గల్‌ హోం సెక్రటరీగా వచ్చాడు. సింగ్‌ ఇచ్చిన రిపోర్టు ఎక్కడ చెదలు పట్టిపోయిందో తెలియదు. నేరం చేసిన రాథోడ్‌కి స్థానిక ఎమ్మెల్యేతో సహా అప్పటి ముఖ్యమంత్రి హుకుమ్‌ సింగ్‌, ఆ తరువాత వచ్చిన ఓం ప్రకాష్‌ చౌతాలా ప్రభుత్వాల అండదండలు దండిగానే ఉన్నాయట. బాలిక కుటుంబానికి మాత్రం వేధింపులు తారాస్థాయికి చేరాయి. మొదట స్కూల్‌ ఫీజు ఎగ్గొట్టిందని ఆరోపించి ఆ పిల్లని స్కూలు నుంచి బహిష్కరించారు. ఫీజులు కట్టని 135 మంది మీద మాత్రం ఒంటి మీద ఈగ వాల లేదు. ఈ బహిష్కరణను అడ్డం పెట్టుకొని ఆ పిల్ల మీద నిందా ప్రచారం తారాస్థాయిలో చేశారు. ఆ తల్లి లేని పిల్ల ఒకవైపు మానసిక వేదనతో గది నాలుగు గోడల మధ్య మగ్గిపోయింది. రాథోడ్‌ చెప్పుచేతల్లో ఉన్న పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్ళు తెల్ల చొక్కాల ముసుగులో ఆ కుటుంబం మీద ఒక కన్నువేశారు. తండ్రి మీద, పది సంవత్సరాల తమ్ముడి మీద మర్డర్‌ కేసు, దొంగతనం కేసుతో సహా పెట్టని కేసులు అంటూ లేవు. కేసులు పెట్టి వేధించారు. పోలీస్‌ స్టేషన్లో పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. సినిమాల్లో తప్ప మరెక్కడ చూడం ఇట్లాంటి చిత్రహింసలు. ఆ పిల్లాడు ఎట్లా బతికి బయటపడ్డాడో తెలియదు.
మరో బాలిక ఆరాధన మీద పదికి పైగా కేసులు పెట్టారట. ఆమెను తండ్రి హర్యానా ప్రభుత్వంలో చీఫ్‌ ఇంజినీరుగా పనిచేసేవాడు. మచ్చలేని మనిషి. అటువంటి ఆయన మీద కేసులు మీద కేసులు పెట్టి చివరికి ఉద్యోగంలో నుంచి సస్పెండ్‌ చేయించారు.ఇవన్నీ చూసిన బాధితురాలు రుచిక మూడేళ్ల తర్వాత అంటే 1993 డిసెంబర్‌ 28న విషం తిని చనిపోయింది. అక్కడికి ఆ దుర్మార్గుడు కక్ష తీరలేదు. తండ్రి చేత బలవంతంగా తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని గాని ఆ అమ్మాయి మతదేహాన్ని తండ్రికి అప్పగించలేదు. ప్రభుత్వం ఈ కేసు ఫైలు మూసివేసింది. వేధింపులు తట్టుకోలేక కుటుంబం చండీగఢ్‌ నుంచి సిమ్లా దగ్గరకు పోయి మట్టి పని చేసుకుని బతికిందట. రాథోడ్‌ మాత్రం సంవత్సరం తర్వాత 1994లో అడిషనల్‌ డిజిపిగా పదోన్నతి పొందాడు. ఆ తర్వాత 1999లో ఓం ప్రకాష్‌ చౌతాలా ప్రభుత్వంలో డిజిపిగా పదోన్నతి వచ్చింది. ఈ మొత్తం ఘటన మీద అప్పటి రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకుడు స్పందించాడట. అయితే కేంద్రంలో ఉన్నది వాజ్‌పేయి ప్రభుత్వమే కదా. వాజ్‌పేయి ప్రభుత్వానికి ఓం ప్రకాష్‌ చౌతాలా ప్రభుత్వం మద్దతు ఉంది కాబట్టి అన్ని రకాల మద్దతులు కలిపి ఒక ఆడపిల్లకి, ఒక భావి భారత క్రీడాకారిణికి అన్యాయం చేశారు. ఇదంతా పార్లమెంట్‌ వేదికగా కూడా చర్చ జరిగింది. అప్పుడు పార్లమెంటు సభ్యురాలుగా ఉన్న బృందాకరత్‌ కూడా రుచికకు న్యాయం జరగాలని పార్లమెంటును వేదికగా చేసుకుని పోరాడారు. ఇవన్నీ ఆనాటి ఇంగ్లీషు, హిందీ అన్ని పత్రికల్లోనూ ప్రముఖంగా ప్రచురించబడ్డాయి. చివరికి కేసు సిబిఐ చేతుల్లోకి వెళ్ళింది. సుప్రీంకోర్టు దాకా వచ్చింది. నేరం జరిగిన 20 సంవత్సరాల తర్వాత 2010లో రాథోడ్‌ నేరం చేశాడని అంగీకరిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఏమైనప్పటికీ నేరస్తుడికి పదోన్నతి, బాధితురాలికి మరణం సంప్రాప్తించాయి.
ఇదంతా చూశాక...బాధితులైన క్రీడాకారులు, వాళ్ళ కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నాయని అనడంలో ఏమైనా ఆశ్చర్యం ఉన్నదా. పుండు మీద కారం చల్లినట్లు ‘వాళ్లు రోడ్డెక్కింది న్యాయం కోసం కాదు. రాజకీయాల కోసం’ అన్న దుష్ప్రచారాలను సోషల్‌ మీడియా వేదికగా చూసిన వాళ్లకి బుర్ర వేడెక్కిపోవాల్సిందే. ప్రస్తుతం కుస్తీ క్రీడాకారిణులు పోరాడుతున్నది ఒక అధికార మదగజంతో అన్నది దేశ ప్రజలందరికీ అర్థం కావాలి. దేశానికి పతకాలు సాధించి పెట్టి, దేశం పరువు నిలబెట్టిన ఆడపిల్లల్ని రక్షించుకోవడానికి ఈ దేశ ప్రజ ఏం చేస్తున్నది? ఇది మనందరి ముందు ఉన్న ప్రశ్న!
– ఎస్‌. పుణ్యవతి

Spread the love