మన పిల్లలు ఎలా ఎదగాలి?

మన పిల్లలు ఎలా ఎదగాలి? సంతోషంగా ఎదగాలి. ఆరోగ్యంగా ఎదగాలి. సహజంగా ఎదగాలి. సమగ్రంగా ఎదగాలి. అందుకు వ్యవస్థలు, ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. ప్రతి జాతికి బాల్యమే అందమైన ఉషోదయం. సత్యం – శివం – సుందరమైన భవిష్యత్తు. బాల్యం పట్ల నిర్లక్ష్యం వహించే వారి కృషికి అర్ధమేముంటుంది? ప్రపంచంలోని ఏ ఖండంలోని బాలలైనా శారీరక ఆరోగ్యంతోనూ, మానసిక ఆరోగ్యంతోనూ, సామాజిక ఆరోగ్యంతోనూ, ధార్మిక (తత్వజ్ఞాన) ఆరోగ్యంతోనూ దృఢంగా ఎదగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌) నొక్కి చెబుతున్నది. ప్రస్తుతం మనకు ఉన్న విద్యావ్యవస్థ అందుకు రహదారి కావడం లేదు. మరికొద్ది రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా…
      నూతన జాతీయ విద్యావిధానం – 2020, 3 నుండి 18 ఏళ్ల పాఠశాల పిల్లలకు ఒక పక్క నాణ్యమైన విద్యను ఇవ్వాలని అంటూనే, మరోపక్క ఆచరణలో అంతరాలు పెంచేవిధంగా అమలవుతున్నదని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. చరిత్రను వక్రీకరించడం, సైన్స్‌ను తొలగించడం, అశాస్త్రీయ పాఠ్యాంశాలను చొప్పించడం వీరు గమనిస్తూనే వున్నారు. జరిగే నష్టం పట్ల ఆందోళన పడుతున్నారు. ఈ నూతన విద్యావిధానం ఇప్పుడు నాలుగు దశలుగా వర్గీకృతమై వుంది. మొదటిదశ ప్రాథమిక దశ. మూడేళ్ళ నుండి పిల్లలను బడిలో చేర్చుకోవాలి. అంగన్‌వాడీ దశనుండి 1,2 తరగతులు చదివేవరకు 5 సంవత్సరాలు ఈ దశలో పిల్లలు గడపాలి. రెండో దశ చదువుకు సన్నద్ద దశ. ఈ దశలో 3,4,5 తరగతులు చదవాలి. ఈ మూడేళ్లలో చదవడం, రాయడం తప్పక నేర్చుకోవాలి.
      జీవించడం, రక్షణ పొందడం, గుర్తింపు – గౌరవం పొందడం ఎలాగో బాలలు సమగ్రాభివృద్ది చెందడం కూడా (ఆల్‌ రౌండ్‌ డెవలప్‌మెంట్‌) బాలల హక్కు అని గ్రహించాలి.
      ఈ సమగ్రాభివృద్ధిని స్థూలంగా ఎనిమిది భాగాలుగా విభజించి చూసినప్పుడు బాలల వికాసానికి, అభివృద్ధికి పెద్దలుగా మనం వారికి ఎంత అవకాశం ఇవ్వగలుగుతున్నామో అర్ధం చేసుకోవచ్చు. పెద్దల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే గాక పౌరులైన ప్రతి ఒక్కరూ వుంటారని గమనించుకోవాలి.
1. చదువు : జ్ఞానం వేరు, చదువు వేరు. జ్ఞానం పుట్టినప్పటి నుండి వస్తుంది. ఇంద్రియాల ద్వారా లభిస్తుంది. చూడడం (కళ్లు), వినడం (చెవులు), మాట్లాడడం – రుచి (నోరు, నాలుక), వాసన చూడడం (ముక్కు), స్పర్శ (చర్మం)… వీటి ద్వారా మనిషికి కలిగే అనుభూతులను మెదడు సమన్వయ పరుస్తుంది.
చదువు అనేది అక్షర జ్ఞానం. ఒక విధంగా పరోక్ష జ్ఞానం. ఈ పరోక్ష జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానంగా మారి విద్యార్థుల అనుభవంలోకి వచ్చేట్టు పెద్దలు ముఖ్యంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చేయాల్సిన పని. పేదలు, నిరక్షరాస్యులు అయిన తల్లిదండ్రులు ఈ పనులు చేయలేరు గనుక, చాలామంది తల్లిదండ్రులకు ఈ విషయంలో పరిమితులు వుంటాయి. కనుక, ఉపాధ్యాయులే ఆ బాధ్యతను భుజాన ఎత్తుకోవాలి. సమాజంలో ఉపాధ్యాయుని అవసరం అందుకే ఏర్పడింది. అందుకు వారి జ్ఞాన మార్గం – వృత్తి నైపుణ్యం దోహదపడతాయి.
      ఇంతవరకు మన పాఠశాల విద్యాబోధనా పద్ధతి ఉపాధ్యాయుడు (టీచర్‌) కేంద్రంగానే సాగింది. సాగుతున్నది. ఓ పాఠ్యపుస్తకం, ప్రణాళిక వుంటుంది. తదనుగుణంగా టీచర్‌ ఆ పాఠాన్ని బోధించాలి. వీలైతే అందుకు బ్లాక్‌ బోర్డ్‌ను ఉపయోగించుకుంటాడు. విద్యార్థులు అదే చదవాలి. అర్ధం కాకపోయినా బట్టీయం పట్టాలి. పరీక్షల్లో అవే సమాధానాలు రాయాలి. ఆ ప్రశ్నలు – సమాధానాలు – మార్కులు ఆధారంగానే గైడ్స్‌ కూడా వచ్చాయి. మార్కుల కోసం, ర్యాంకుల కోసమే చదువు అనే పద్ధతిగా మారిపోయింది. కొండకచో కాపీలు కొట్టడం, రాయించడం షరా మామూలైపోయింది. ప్రశ్నాపత్రాలు లీక్‌ అవడం కూడా ఈ మామూలులో చేరిపోయింది ఇప్పుడు. అందుకే నాణ్యత లేని అవకతవక చదువులు విద్యార్థులకు భారంగా పరిణమించాయి. చివరకు విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు చేరువయ్యే దుస్థితి దాపురించింది. మాతృభాషైన తెలుగును మాట్లాడతారు. వింటారు కానీ, సక్రమంగా రాయలేరు, చదవలేరు. పది – ఇంటర్‌ – డిగ్రీకి వచ్చినా ఇదే పరిస్థితి. బాగా చదువుకుని ర్యాంకులు తెచ్చుకున్నా, ఈ విషయంలో నిరక్షరాస్యులతో సమానమైపోతున్నారు.       ఈ భాషా పతనానికి ఎవర్ని తప్పుపట్టాలి? భాషను సజీవంగా బతికించుకునేందుకు ఏయే పనులు, ఎలాంటి దశలో చేపట్టాలి? ఇదంతా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నదిప్పుడు.
      ఏదేని ఒక అంశాన్ని (పాఠ్యాంశాన్ని) చదువుకోవడం, అర్ధం చేసుకోవడం, ఆ అంశంపై అవగాహన పెంచుకోవడం, ఆ అంశంలోని మంచి, చెడులను తర్కించుకోవడం, అనుభూతి చెందడం, ఆస్వాదించడం, విశ్లేషించడం, ఇవన్నీ చదువులోని వివిధ స్థాయిలు, దశలు. వీటిని అర్ధం చేయించకపోతే విద్యార్థి జడత్వానికి లోనయ్యే ప్రమాదం వుంటుంది. దాదాపు అందరి అనుభవంలోకి వస్తున్న విషయమే ఇది.
2. ఆటలు – క్రీడలు – యోగా – ధ్యానం :
      చాలా పాఠశాలల్లో ఆట స్థలాలు లేవు. వ్యక్తిగతంగా ఆడే ఆటలు, సమిష్టిగా ఆడే క్రీడల నుండి దాదాపు డెబ్బై శాతం బాల్యం దూరంగా వుండిపోవడం అతిశయోక్తి కాదు. ప్రాత:కాల వేళల్లో లేచి స్వచ్ఛమైన స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ఉషోదయ కాంతుల్లో పరుగులిడడం… అవకాశం లేక కొందరు, అవకాశం వుండి కూడా మరికొందరు ఈ శారీరక ఆరోగ్యానికి దూరమవుతున్నారు. బద్దకానికి బానిసలవుతున్నారు. గెలుపు ఓటములను సమంగా చూడడం, భావోద్వేగాల నియంత్రణ, క్రీడాస్ఫూర్తి మొదలైనవి చిన్నప్పటి నుండే ఆటల ద్వారా సాధ్యమవుతుంది. అంతరాలు లేని స్నేహం అక్కడి నుండే చిగురిస్తుంది. యోగా – ధ్యానంతో ఆత్మవిశ్వాసం, స్వీయ క్రమశిక్షణ పెరుగుతాయి. ధ్యానాన్ని ఒక పనిగా పెట్టుకోకుండా, పనిలోనే ధ్యానం వుంటే శ్రద్ధ అలవడుతుంది. బలహీనతలను తనకు తానుగా అధిగమించుకునేందుకు ప్రయత్నం ప్రారంభమవుతుంది.
3. పాటలు – సంగీతం – వాద్యం :
      వినికిడి జ్ఞానం బాగా అబ్బుతుంది. ‘వినదగు నెవ్వరు చెప్పిన’ అన్న రీతిలో ఓర్పు – సహనం – కుదురు అలవడతాయి. శృతి – లయలతో తన్ను తాను సరిదిద్దుకోగలడు. శబ్ద మాధుర్యాన్ని అర్థం చేసుకుంటాడు. చాలా దేశాల్లో విద్యార్థులు చిన్నప్పటి నుండే ఏదో ఒక సంగీత వాద్యాన్ని నేర్చుకుంటారు. పాట – ఆట – వాద్యం ఏక కాలంలో కలగలసి అందరూ భాగస్వామ్యం అయ్యే కోలాటం, చక్కభజన వంటి జానపద కళారూపాలు మనకు కోకొల్లలు.
4. కథలు – కవితలు – సాహిత్యం :
      కథలు, సాహిత్యం ద్వారా మానసిక వికాసం అద్భుతంగా పరిణమిస్తుంది. ఊహాశక్తి పెరుగుతుంది. పాత్రలతో మమేకం అవుతారు. పాత్రలో పరకాయ ప్రవేశం కావడం చిన్నప్పటి నుండే అలవడి, మానసిక వికాసానికి ద్వారాలు తెరుస్తుంది. కవిత్వం, కథలు, వ్యాసరచనా వ్యాసంగం, జర్నలిజం, ప్రజల్ని చైతన్య పరిచే గొప్ప అంశాలుగా గుర్తెరుగుతారు. ఆ దిశగా ఎదగడం తరతరాలకు భావిసంపద. ఆ ఎదుగుదల వారికే కాదు యావత్‌ సమాజానికే ప్రయోజనకరం.
5. అభినయం – నాటకం – నాట్యం – ప్రదర్శనా కళలు – ఫిల్మ్‌ :
      ‘చెప్తే వినపడుతుంది, చూస్తే కనపడుతుంది’. టీవీ, ఫిల్మ్‌, సెల్‌ఫోన్లు ఇంత వరకే పరిమితం. కానీ చేస్తేనే అర్ధమవుతుంది. అది రంగస్థలం. సజీవమైన ప్రదర్శన కళ. విజన్‌ మీడియా పరిధిని అతిక్రమించగలదు. ఏకకాలంలో ఈ ప్రదర్శనా కళలు శరీరం – మనస్సును ఉచ్ఛస్థాయిలో నిలపగలవు. కేవలం కాళ్లు, చేతులు కట్టేసుకుని కూర్చునే మాంసపు ముద్దలుగా పిల్లలు మారరు. పిల్లలు తమ స్థాయిని, తమ జీవితాన్ని అనుభవ పూర్వకంగా ఈ ప్రదర్శనా కళల ద్వారా తెలుసుకోగలరు. వారిదైన సృజన శీలత, ప్రత్యేకత, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, సమాచార నైపుణ్యాలు, జీవన నైపుణ్యాలు, అన్నింటికీ మించి ఆత్మ స్థైర్యాన్ని సాధించగలరు. పార్ట్‌ ఫిల్మ్‌ మేకింగ్‌నూ చేపట్టగలరు.
6. చిత్రలేఖనం, శిల్పం, క్రాఫ్ట్‌, ఒరిగామి (పేపర్‌వర్క్‌) :
      బొమ్మలు గీయడం, రాయడం వలన హస్త నైపుణ్యం, ఆలోచనాశక్తి (మోటార్‌ స్కిల్స్‌) వృద్ధి అవుతాయి. తాము ఆలోచించుకునేదేదో చేతితో గీయడానికి పిల్లలు చిన్నప్పటినుంచే ఉపక్రమిస్తారు. తద్వారా చేతికి – మెదడుకు దృఢమైన బంధం ఏర్పడుతుంది. మనిషికి మాత్రమే ఉండే ప్రత్యేకత ఇది. సంక్లిష్టత నుండి స్పష్టతకు వచ్చే ఈ రాత – గీత ఓ గొప్ప అభివ్యక్తీకరణ సాధనం. ఆ తర్వాత పేపర్‌ బొమ్మలు, అట్ట బొమ్మలు, గుడ్డ బొమ్మలు, మట్టి బొమ్మలు (పప్పెట్రీ), బొమ్మలాటలు, శిల్పాలు, కళా ఖండాలు ఇలా ఎన్నైనా సృష్టించవచ్చు.
7. శాస్త్ర, సాంకేతిక ప్రయోగాలు – పరిశోధనలు :
      అందరూ పరిశోధకులు, శాస్త్రవేత్తలు కాలేరు. కొందరు అన్వేషణను తపస్సుగా భావిస్తారు. దీక్షగా పనిలో నిమగమై పోతారు. కఠోర పరిశ్రమ చేస్తారు. పరిశోధన అంటేనే పరిశ్రమ. వారి సృజనశీలతను, పరిశ్రమను గమనించి ప్రోత్సహించాలి. తత్సంబంధమైన ప్రాజెక్టు వర్క్‌లు ఇచ్చి పని చేయించాలి. మనకు ఎన్ని సమస్యలు లేవు? రైతులు, మహిళలు, బాలలు… ఇలా ఎన్నింటిపైనో కిశోర వయసు బాలలకు ప్రాజెక్ట్‌ వర్క్‌లు ఇవ్వొచ్చు. అలా సమాజాన్ని, ప్రకృతిని తమదైన కోణంతో అధ్యయనం చేసే సామర్ధ్యాన్ని కిశోర బాలలకు అప్పగించాలి. వ్యర్ధం నుండి అర్ధం స్పురించే ప్రయోగాలు చేయించి ప్రదర్శనా శాలలు ఏర్పాటు చేయాలి. క్రియా వంటి బాలోత్సవాలు, పడాల ఛారిటబుల్‌ వంటి సంస్థలు ఇలాంటి పనుల్లో ముందుంటున్నాయి.
8. పరిసరాల అధ్యయనం :
      మన పాఠశాల చుట్టుపక్కల పరిసరాల్లోనే ఎంతో విజ్ఞానం వుందని అంటారు గాంధీజీ. పాఠశాల దగ్గరలోని వ్యవసాయం, పాడిపశువులు, తోటపని, చేతి వృత్తులు (కమ్మరి, కుమ్మరి, నేత మొ||) కార్ఖానాలు, పోస్టాఫీస్‌, బ్యాంకులు అన్నింటితో విద్యార్ధికి పరిచయం, ప్రవేశం కల్పించాలి. చివరకు పారిశుధ్యం, సఫాయి పనితో సహా అన్ని పనులు తెలిసి ఉండాలని అంటారు. ఏ పనీ తక్కువ (నీచం) కాదు. ఆ విధంగా శ్రమ గౌరవం (డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌) కచ్చితంగా తెలపాలి. మన పనే మన విజ్ఞానం (అవర్‌ వర్క్‌ ఈజ్‌ అవర్‌ నాలెడ్జ్‌) అని వక్కాణిస్తారు గాంధీజీ. అప్పుడు చేతులకు, మెదడుకు, హృదయానికి సమన్వయం ఏర్పడుతుంది. గాంధీజీ కనుగొన్న నయీ తాలిం (నూతన విద్య) లోని కీలకాంశం ఇదే.
      ఈ విధమైన సామాజిక విజ్ఞానం ద్వారా విద్యార్థి చిన్నప్పటి నుండే శ్రమతో మమేకం అవుతూ, శ్రమ జీవులకు దగ్గర అవుతాడని వివరిస్తారు. శ్రమయేవ జయతే. శ్రమ ద్వారా హక్కులు – సమానత్వం గురించి అనుభవ పూర్వకంగా అర్ధం చేసుకోవడం వీలవుతుంది.
ఈ నేపధ్యంలో పరిశీలించినప్పుడు మన విద్యార్థి కేవలం కెరీర్‌ ఓరెంటెడ్‌గా తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం వచ్చే వ్యక్తిగత లాభ చింతనతో, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గానో, మరేదో సంపాదనా వనరుగానో, యంత్రంగానో మార్చడం ఎంత వరకు సమంజసమో అందరం ఆలోచించాలి. మనిషిగా తన ఉన్నతిని, విశాలత్వాన్ని, బహుళత్వాన్ని కుదించుకోవడం కాదా? గమనించుకోవాలి.
      ప్రపంచంలోనే అతి పెద్ద పాఠశాల విద్యావ్యవస్థ మన భారతదేశంలోనే వున్నది. అందుకు మనమెంతో గర్వించాలి. దాదాపు 85 లక్షల మంది ఉపాధ్యాయులతో, 25 కోట్ల మంది విద్యార్థులతో మన పాఠశాల విద్యావ్యవస్థ అలరారుతున్నది. నాణ్యమైన విద్యాబోధనా ప్రక్రియలతో బాలలను సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి పథం వైపు నడిపించాల్సిన ఆవశ్యకత, బాధ్యత ఎంతైనా వుంది.
      కానీ విషాదం ఏమంటే 29 శాతం మంది ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఇప్పటికీ బడి మానేస్తున్నారు. ప్రపంచ సగటు అక్షరాస్యత శాతం 86.3 వుంటే, మన భారత్‌ అక్షరాస్యతా శాతం 74 మాత్రమేనని యునెస్కో ప్రకటించింది. మరీ ముఖ్యంగా మహిళల్లో అక్షరాస్యత ఘోరంగా పడిపోతున్నది. వీరిలో ఎక్కువమంది బడుగు, బలహీనవర్గాల, మైనార్టీల, దళిత, ఆదివాసీ బిడ్డలని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
      నూతన జాతీయ విద్యావిధానం – 2020, 3 నుండి 18 ఏళ్ల పాఠశాల పిల్లలకు ఒక పక్క నాణ్యమైన విద్యను ఇవ్వాలని అంటూనే, మరోపక్క ఆచరణలో అంతరాలు పెంచేవిధంగా అమలవుతున్నదని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. చరిత్రను వక్రీకరించడం, సైన్స్‌ను తొలగించడం, అశాస్త్రీయ పాఠ్యాంశాలను చొప్పించడం వీరు గమనిస్తూనే వున్నారు. జరిగే నష్టం పట్ల ఆందోళన పడుతున్నారు. ఈ నూతన విద్యావిధానం ఇప్పుడు నాలుగు దశలుగా వర్గీకృతమై వుంది. మొదటిదశ ప్రాథమిక దశ. మూడేళ్ళ నుండి పిల్లలను బడిలో చేర్చుకోవాలి. అంగన్‌వాడీ దశనుండి 1,2 తరగతులు చదివేవరకు 5 సంవత్సరాలు ఈ దశలో పిల్లలు గడపాలి. రెండో దశ చదువుకు సన్నద్ద దశ. ఈ దశలో 3,4,5 తరగతులు చదవాలి. ఈ మూడేళ్లలో చదవడం, రాయడం తప్పక నేర్చుకోవాలి. లిఖిత పరీక్షలు కూడా వుంటాయి. తరువాత మాధ్యమిక దశ. 6,7,8 తరగతులు చదవాలి. ఈ మూడేళ్ళల్లో ప్రయోగాత్మక బోధనా పద్ధతుల ద్వారా లెక్కలు, సామాన్య, సాంఘీక శాస్త్రాలతో పాటు కళలు, మానవ శాస్త్రాలు (ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌) అభ్యసించాలి. ఇక చివరి దశలో నాలుగేళ్లు 9,10,11, 12 తరగతులు చదవాలి. అప్పటికి విద్యార్థికి 18 ఏళ్లు వస్తాయి. ఉపాధి మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఈ 3 నుండి 18 ఏళ్ల పిల్లలకు ఇలా విద్యాబోధన లక్ష్యంగా విద్యావిధానం ఉంది.
      21వ శతాబ్దం సవాళ్లను ఎదుర్కోవాలంటే ఇలాంటి విద్యావిధానం వుండాలని కేంద్రప్రభుత్వం పేర్కొంటున్నది. మరి అందుకు తగిన నిధులను మాత్రం సమకూర్చడం లేదు. అవసరమైన సహేతుక ఆచరణ, ప్రణాళికలు రచించదు. పర్యవేక్షణ లేదు. అందుకే విద్యాహక్కు చట్టం, నూతన జాతీయ విద్యావిధానం, జాతీయ పాఠ్యప్రణాళికా వ్యవస్థలు పైకి ఎంత తియ్యగా మాట్లాడినప్పటికీ ఆచరణలో విఫలమవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. చాలామందికి చదువు అందక, అందినా నాణ్యమైన విద్య లేక విషమ ఫలితాలనే చవిచూస్తున్నారు. పరీక్ష తప్పామని, ర్యాంకు రాలేదని, జీవిత వాస్తవం తెలుసుకోక ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. భావి పౌరులైన ఈ చిన్నారుల ఆత్మహత్యలను కూడా పాలకులు రైతుల ఆత్మహత్యల మాదిరిగానే కళ్లప్పగించి చోద్యంలా చూస్తున్నారు. విరుగుడుకు ప్రయత్నించడం లేదు. చావులకు బాధ్యత వహించడంలేదు. మొత్తం విద్యావ్యవస్థనే కార్పొరేట్‌ బలిపీఠం ఎక్కించేందుకు కేంద్రప్రభుత్వం సిద్దమవుతుంది. ఒకపక్క చదువులేకపోవడం, మరోపక్క పోటీ కార్పొరేట్‌ రంగం, మధ్యలో అరకొర ప్రభుత్వ పాఠశాలలు, కాస్తో కూస్తో నాణ్యంగా లభించే విద్య కూడా డొల్లగా మారడం కళ్లముందున్న కఠోర వాస్తవాలు.
      ఈ పరిస్థితుల్లో సరైన పాఠశాల విద్యాబోధనా స్థితికి పౌరసమాజమే దిక్కయింది. అందువల్ల పిల్లల మీద ప్రేమ వున్నవారు తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు ఎవరైనా సరే తమ తమ బోధనా పద్ధతుల్లో, పెంపకం రీతుల్లో నాణ్యతను పెంచుకుని పిల్లలకు తర్పీదునివ్వవలసిందే. ఏ రంగంలో వున్నవారు ఆ రంగంలో పిల్లల సమగ్ర వికాసానికి పాటు పడాల్సిందే. అలా పిల్లలను నిత్యం ఉత్సాహపరుస్తూ పూలబాటలు పరవాల్సిందే. జీవితం పట్ల అంతులేని ప్రేమను కల్పించాల్సిందే. బిడ్డల శిక్షణ పెద్దల దైనందిన జీవితంలో ముఖ్యభాగం కావాల్సిందే. అప్పుడే సత్యం, శివం, సుందరమైన భావి భారతాన్ని నిర్మించుకోగలం.
– కె.శాంతారావు, 9959745723

Spread the love