సామాన్యుడు బతికేదిలా..?

– చికెన్‌, మటన్‌ ధరలకు రెక్కలు
– ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేదు
– రోజురోజుకీ పెరుగుతున్న కూరగాయల ధరలు
– గుడ్డుకు గడ్డుకాలం
– పెరిగిన పప్పు, చింతపండు ధరలు
నవతెలంగాణ-కుల్కచర్ల/ చౌడాపూర్‌
పల్లెటూరూల్లో సైతం కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. రూ.500 తీసుకుని అంగడికి వెళ్లినా బస్తానిండని పరిస్థితి. ఒక్క కూర గాయల ధరలు మాత్రమే కాదు పప్పులు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. కొన్ని రోజుల కింద అందుబాటులోనే ఉన్న కూరగాయల ధరలు ఇప్పుడు భారీగా పెరిగాయి. ప్రస్తుతం కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు చూస్తుంటే ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అనే పరిస్థితి నెలకొంది.
సామాన్యుడిపై ధరల భారం..
గత రెండు మూడు రోజులుగా కూరగాయల ధరలు ఎండతో పాటే మండిపోతున్నాయి. గత వారం రోజుల వరకు కిలో రూ.20 ఉన్న టమాటా బుధవారం కుల్కచర్ల, చౌడాపూర్‌ అంగళ్లలో కిలో రూ.40గా బీరకాయ కిలో రూ.80గా ఉంది. ఎప్పుడూ తక్కువ ధరకు దొరికే ఆలుగడ్డ కిలో రూ.60 వంకాయ కిలో రూ.80, పచ్చి మిర్చి కిలో రూ.100, బెండకాయ రూ.80, దొండకాయకు రూ.80బీన్స్‌ కిలో రూ.120, ఉన్న క్యాప్సికం రూ.80, చిక్కుడు కిలో రూ.80 ఉంది.
ఆకుకూరలైతే…
చిన్న కొత్తిమీర కట్ట రూ.10, తోటకూర రూ.20కి రెండు చిన్న కట్టలు, పాలకూర, చుక్కకూర, పాయల్‌ కూరలు సైతం రూ.80 కి కిలో ఇచ్చారు. వేసవికాలం కావడంతో నిమ్మకా యల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రూ.20కి నాలుగు నిమ్మకాయలు ఇస్తుండగా, చిన్నవి అయితే 5 అల్లం కిలో రూ.200 ఉంటే ఎల్లిగడ్డ రూ.320 పలుకుతోంది. చింతపండు కూడా రూ.120 నుంచి రూ.140 కి అమ్ముతున్నారు.
నాన్వెజ్‌ ఏం తక్కువ కాదు..
నాన్వెజ్‌ ధరలు కూడా భారీగా పెరిగాయి. పెండ్లిల సీజన్‌ కూడా కానప్పటికి నాన్వెజ్‌ ధరలకు సైతం రెక్కలొచ్చాయి. ఎండల వేడిమికి చికెన్‌ ధరలు అమాంతం తగ్గిపోతుంటాయి కానీ ఈ సారి మాత్రం ధరలు అందుకు భిన్నంగా ఉన్నాయి. బుధవారం స్కిన్‌ లెస్‌ చికెన్‌ కిలో రూ. 280కి చేరింది. గతంతో పోలిస్తే కాస్త తగ్గినా ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో తెలియదని చికెన్‌ షాప్‌ యజమానులు అంటున్నారు. గతంలో కిలో రూ.800 ఉన్న మటన్‌ ఇప్పుడు కిలో రూ.1000కి పెరిగింది. దీంతో పండుగలు, పంక్షన్లు అంటేనే సామాన్య ప్రజానీకం హడలి పోతున్నారు.
గుడ్డుకు గడ్డు కాలం…
పల్లెల్లో ప్రజలు గుడ్డు తినేందుకు కూడా గడ్డు కాలం వచ్చిందా అనుకుంటున్నారు. రూ.5 ఉన్న కోడిగుడ్డు ఇప్పుడు రూ.7కు చేరింది.
కూరగాయలపై భానుడి ప్రభావం…
ఈ సారి ఎండలు మండిపోతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండలతో చాలా ఏరియాల్లో గ్రౌండ్‌ వాటర్‌ తగ్గడంతో అన్నదాతలు వేసిన పంటలకు దిగుబడి రావడం లేదు. దీంతో ఉత్పత్తి తగ్గడం అదే తరుణంలో డిమాండ్‌ పెరగడం వల్ల ధరలు పెరి గిపోతున్నాయి. పెరిగిన ధరలతో జన జీవనం దినదిన గండంగా మారుతుంది. నెలనెలా వచ్చే జీతానికి, పెరుగుతున్న ధరలకు ఎక్కడా పొంతన లేకుండా పోతుందని, ఇలా అయితే సామాన్యుడి జీవనం మరింత భారం ఆవుతుందని ప్రజలు ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నారు.
పప్పుల ధరలు పైపైకి..
పప్పుల ధరలు ఎన్నికల తర్వాత అమాంతం పెరిగాయని సామాన్యులు అంటున్నారు. పప్పుల రేట్లు గతంలో కంటే ఎక్కువగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. మొన్నటి వరకు కిలో రూ.110 నుంచి 120 పలికిన కందిపప్పు ఇప్పుడు రూ.200కు చేరింది. శనగపప్పు రూ.90 నుంచి 100, పెసరపప్పు రూ.140, మినపప్పు .140 నుంచి 150 అయింది.

Spread the love