సమగ్ర సమాచారం లేకుండా వర్గీకరణ ఎలా చేస్తారు?

Lingaswami – డాక్టర్ మంచాల లింగస్వామి, చైర్మన్ – మాల పొలిటికల్ జేఏసీ.
– రాష్ట్ర ప్రధాన కార్యదర్శి – ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా).
న‌వ‌తెలంగాణ‌-ఓయు
ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీం కోర్టు రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ తీర్పును వెలువరించిన వెంటనే తెలంగాణ అసెంబ్లీలో ఆర్డినెన్సు తీసుకొస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మాల పొలిటికల్ జేఏసీ చైర్మన్, ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉస్మానియా యూనివర్సిటీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “సామాజిక వివక్షత పునాదులుగా ఎస్సీలకు రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఈ ఎస్సీ రిజర్వేషన్ల ప్రాథమిక సిద్దాంతాన్ని విస్మరించి సుప్రీం కోర్టు ఆర్థిక వ్యత్యాసం బట్టి వర్గీకరించుకోవచ్చు అని రాష్ట్రాలకు అధికారాన్ని అప్పజెప్పడం రాజ్యాంగ విరుద్ధం. సుప్రీం కోర్టు తీర్పు రాగానే ఆఘమేఘాల మీద అసెంబ్లీలో అవసరమైతే ఆర్డినెన్సు తీసుకొచ్చి తక్షణమే అమలు చేస్తామని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్డినెన్సు తీసుకొచ్చే ముందు తెలంగాణలో మాల, మాదిగ మరియు ఉపకులాల జనాభా లెక్కలు తీయండి. తెలంగాణలో మాల మాదిగల్లో భూములు ఎవరికి ఎక్కువ ఉన్నాయి, గ్రూపు 1 నుండి మొదలుకొని పారిశుధ్య కార్మికుల వరకు ఉద్యోగాలు ఏ కులం నుండి ఎక్కువ మంది ఉన్నారు, గత పదేళ్ళలో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, దళిత బంధు పథకం, దళితులకు మూడెకరాల భూమి పథకాల్లో ఎవరు ఎక్కువ ఆర్థికంగా బలపడ్డారు, లిడ్ క్యాపు లోన్లు ఎవరు పొందారు అనే లెక్కలు తీయండి. ఇవి అన్నీ తేల్చిన తర్వాత నువు వర్గీకరణ గురించి మాట్లాడాలి. మాదిగల ఓట్ల కోసం మాలలను విస్మరించేలా వ్యాఖ్యలు చేస్తే రేవంత్ రెడ్డి మాలల నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది” అని అన్నారు.

Spread the love