హైకోర్టులో ఎన్నికల లబ్దికి యత్నిస్తే ఎలా?

హైకోర్టులో ఎన్నికల లబ్దికి యత్నిస్తే ఎలా?– కాళేశ్వరం అవినీతిపై పిల్స్‌ విచారణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ లోక్‌సభ ఎన్నికల ప్రచారం తరహాలో వాదనలు వినిపిస్తే ఎలాగని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఎన్నికల వేళ రాజకీయ వాదనలు వినిపించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. విచారణలో ఎన్నికలు ప్రసంగాలు చేయడానికి అనుమతించే ప్రసక్తే లేదంది. ప్రభుత్వ వాదనలు విన్న తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామనీ, ఇప్పటికిప్పుడే వాదనలు విని ఉత్తర్వులు జారీ చేయాలంటే వీలు కాదని స్పష్టం చేసింది. అవినీతి జరిగిందని మీడియా కథనాలను ఆధారంగా పిల్స్‌ వేయడం కాదనీ, అవినీతి జరిగిందని చెప్పడానికి పిటిషనర్లు ఎలాంటి ఆధారాలు చూపుతున్నారో చెప్పాలని కోరింది. అధ్యయనం, పరిశీలన చేయకుండా మీడియా కథనాల ఆధారంగా పిల్స్‌ వేసే ఎలాగని ప్రశ్నించింది. ఇవి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలా లేక ప్రచార వ్యాజ్యాలా? అని వ్యాఖ్య చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే.ఏ.పాల్‌, బి.రామ్మోహన్‌రెడ్డి. వ్యక్తిగత హౌదాలో, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ రెడ్డి, ముదుగంటి విశ్వనాథరెడ్డి, బక్కా జడ్సన్‌ విడివిడిగా వేసిన పిల్స్‌ను మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టిన సందర్భంగా పైవిధంగా ప్రశ్నలు వేసింది. సీఐబీ దర్యాప్తు అంశంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 8కి వాయిదా వేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి ఆలోక్‌ ఆరాధే, జస్టిస్‌ జె.అనిల్‌ కుమార్లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ప్రకటించింది.విచారణ సందర్భంగా పిల్స్‌ వేసిన పిటిషనర్లను ఉద్ధేశించి కీలక ప్రశ్నలు వేసింది. ముడుపులు చేతులు మారాయని ఎలా తెలుసనీ, అక్రమాలు జరిగాయని ఎలా చెబుతున్నారనీ, అవినీతి జరిగిందని చెప్పడానికి ఆధారాలు ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. 2016లో ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇప్పటి వరకు ఏం చేశారనీ, అవినీతిపై అధ్యయనం చేశారా లేక పరిశోధన చేశారా? అని కూడా ప్రశ్నించింది. మీడియాలో వచ్చిన కథనాలు మినహా ఆధారాలు ఏమున్నాయనీ, అవినీతిపై ఏ అధికారికి ఫిర్యాదు చేశారనీ, ఆ అధికారి ఏం చర్యలు తీసుకున్నారో కూడా వివరించాలని కోరింది. కాళేశ్వరంపై గత ఉత్తర్వుల జారీని పరిశీలించకుండా ఇప్పటికిప్పుడే విచారణ చేయాలంటే ఎలాగని ప్రశ్నించింది. ఈ రోజే విచారణ పూర్తి చేసి తప్పు చేసిన అక్రమార్కులను జైళ్లకు పంపాలా, ప్రభుత్వ వాదనలు వినకుండానే ఉత్తర్వులు జారీకి అవకాశం లేదని తెలియదా? అని కూడా ప్రశ్నించింది.
పిల్స్‌ను విడివిడిగా విచారణ చేపట్టాలని, పాల్‌ వేసిన పిల్‌ను విడిగా విచారణ చేయాలంటూ బక్క జడ్సన్‌ లాయర్‌ ఎస్‌. శరత్‌ కోరడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఇదే మీ వైఖరి అయితే తిరస్కరిస్తూ ఆర్డర్‌ ఇస్తామని చెప్పింది. ప్రొఫెసర్‌ కోదండరాం లాయర్‌ వాయిదా వేయాలని కోరుతున్నారనీ, ఒకే అంశంపై వేర్వేరుగా విచారణ చేయబోమని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే తాము పిల్‌ వేశామనీ, అయితే నెంబర్‌ కేటాయింపు ఆలస్యమైందని విశ్వనాథరెడ్డి లాయర్‌ నందిత చెప్పడంపై హైకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాలతో దాఖలు చేస్తారా? అని నిలదీసింది. పిటిషన్‌ మొదటిసారి విచారణకు రాగానే న్యాయవాది హాజరు కాలేదని గుర్తు చేసింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే అంశంపై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని అదనపు ఏజీ మహమ్మద్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ను ఆదేశించింది. విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.

Spread the love