గణేశ్‌ నవరాత్రులకు భారీ బందోబస్తు

Huge arrangement for Ganesh Navratri– హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీసుల అప్రమత్తం
– జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, విద్యుత్‌, జలమండలి అధికారులతో సమావేశాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గణేశ్‌ నవరాత్రుల నేపథ్యంలో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈనెల 18 నుంచి నవరాత్రులు ప్రారంభం కానుండటంతో అందుకు కావాల్సిన ఏర్పాట్లు, భద్రతతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్‌ అధికారులు దృష్టి సారించారు. గణేశ్‌ విగ్రహాలను ప్రతిష్టించినప్పటి నుంచి నగరంలో సందడి వాతావరణం ఏర్పడనుంది. మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 60వేలకుపైగా విగ్రహాలను ప్రతిష్టించే అవకాశముందని అధికారుల అంచనా. గణేశ్‌ పండుగ ప్రారంభం నుంచి నిమజ్జనం ప్రక్రియ పూర్తయ్యేవరకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగను పూర్తి చేసేవిధంగా చర్యలు చేపడుతున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పాత నేరస్థులు, రౌడీ షీటర్ల కదలికలపై ఆరా తీస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ఎప్పటికప్పుడూ సమాచారం సేకరిస్తున్నారు. దేవాలయాల నిర్వాహకులు, మండపాలను ఏర్పాటు చేయనున్న వారికి పోలీస్‌ అధికారులు ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేయనున్నారు. భద్రతలో భాగంగా నగరంలో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మహిళల భద్రత, ఆకతాయిల ఆటకట్టించేందుకు షీ బృందాలను రంగంలోకి దించుతున్నారు. ట్రాఫిక్‌, సివిల్‌, టాస్క్‌ఫోర్సు, ఎస్‌వోటీ, ర్యాపిడ్‌ యాక్షన్‌ పోలీసులతోపాటు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించనున్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, వాటర్‌ బోర్డు, విద్యుత్‌, రెవెన్యుతోపాటు తదితర శాఖల అధికారులతో హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర కో-ఆర్డినేషన్‌ సమావేశాలు నిర్వహించారు.
క్షేత్రస్థాయిలో అప్రమత్తం
గణేశ్‌ విగ్రహ నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని క్షేత్రస్థాయిలో పోలీస్‌ సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలో విగ్రహాలను నిమజ్జనం చేయనున్న చెరువులు, కుంటలు, సరస్సులను ముందుగానే పరిశీలించాలని, కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఇతర శాఖల అధికారులు, నగరవాసులు, నిర్వాహకులతో సమన్వయంతో పనిచేయాలని పోలీస్‌ సిబ్బందికి సూచించారు. చెరువులు, ఇతర నిమజ్జన నీటి కుంటల వద్ద వీధి దీపాలు, ఫ్లడ్‌ లైట్లు, క్రేన్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు.
బలవంతపు వసూళ్లపై ప్రత్యేక దృష్టి
గణేశ్‌ పండుగను పురష్కరించుకుని ఎవరైనా బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ముగ్గురు పోలీసు కమిషనర్లు హెచ్చరించారు. కొందరు సిబ్బందిని మఫ్టీలో ఉంచి సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే కొందరు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్టు పోలీస్‌ అధికారుల దృష్టికి రావడంతో వారిని హెచ్చరించినట్టు సమాచారం. గణేశ్‌ విగ్రహాల ఏర్పాటు కోసం అనుమతులు తీసుకోవాలన్నారు.

Spread the love